కారు డీలర్‌షిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ టిప్స్ ఎవరూ చెప్పరు.. పెట్టుబడి ఎంత.. లాభాలు ఎంత వస్తాయంటే ?
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద వాహన మార్కెట్ అయిన మన భారతదేశంలో కార్ల బిజినెస్‌కు అపారమైన డిమాండ్ ఉంది. కొత్త కార్లతో పాటు, టయోటా ఇన్నోవా లాంటి యూజ్డ్ కార్లకు కూడా ఇక్కడ మంచి గిరాకీ ఉంది. అందుకే కారు డీలర్‌షిప్ పెట్టడం అనేది మంచి లాభదాయకమైన వ్యాపారంగా మారుతోంది.
అయితే ఈ వ్యాపారం మొదలు పెట్టాలంటే ముందుగా ఎలాంటి ప్లానింగ్ ఉండాలి, ఏయే అనుమతులు తీసుకోవాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, సరైన ప్లానింగ్, కస్టమర్ నమ్మకాన్ని గెలుచుకుంటే చిన్నగా మొదలుపెట్టిన షోరూమ్ కూడా పెద్ద డీలర్‌షిప్‌గా ఎలా మారుతుందో తెలుసుకుందాం.

డీలర్‌షిప్ రకం, మార్కెట్ స్టడీ
కారు డీలర్‌షిప్ ప్రారంభించే ముందు, మీరు ఏ రకమైన డీలర్‌షిప్‌ను ప్రారంభించాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. కొత్త కార్లు, యూజ్డ్ కార్లు, ఆథరైజ్డ్ ఫ్రాంఛైజీ లేదా ఇండిపెండెంట్ షోరూమ్.. ఇలా వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడి, తక్కువ రిస్క్‌తో మొదలు పెట్టాలంటే యూజ్డ్ కార్ షోరూమ్ బెస్ట్ ఆప్షన్.
మీరు వ్యాపారం చేయాలనుకుంటున్న ప్రాంతంలో ఏ బ్రాండ్‌కు డిమాండ్ ఉంది. కస్టమర్ల అభిరుచి ఏమిటి, పోటీదారులు ఎవరు అనేదానిపై మార్కెట్ సర్వే చేయడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, చిన్న పట్టణాల్లో పెద్ద SUVల కంటే ఎంట్రీ లెవల్ చిన్న కార్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది.

లైసెన్సులు, పర్మీషన్లు
కారు డీలర్‌షిప్ అనేది చట్టపరమైన అనుమతులు లేకుండా ప్రారంభించలేని వ్యాపారం. దీనికి కొన్ని ముఖ్యమైన లైసెన్సులు అవసరం. కంపెనీ రిజిస్ట్రేషన్, జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. స్థానిక మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందాలి. షాప్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వాహనాలను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి , బదిలీ చేయడానికి RTO ట్రేడ్ సర్టిఫికెట్ తప్పకుండా ఉండాలి.
కొత్త కార్ల ఫ్రాంచైజీకి అవసరమైన ప్రక్రియ
మీరు ఒక నిర్దిష్ట బ్రాండ్‌తో కొత్త కార్ల డీలర్‌షిప్ (ఆథరైజ్డ్ ఫ్రాంచైజీ) ప్రారంభించాలనుకుంటే, ఆ బ్రాండ్ ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించాలి. వారు మీ నుంచి కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి.. వారు వివరాలను పరిశీలిస్తారు. బిజినెస్ ప్రొపోజల్, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లు (CA సర్టిఫికెట్‌తో సహా), భూమి/లీజ్ డాక్యుమెంట్లు, ఆటోమొబైల్ రంగంలో మీకున్న అనుభవం గురించిన సర్టిఫికెట్లు కావాలి. ఈ వివరాలన్నీ పరిశీలించిన తర్వాతే, కంపెనీ మిమ్మల్ని ఇంటర్వ్యూకి, డీలర్‌షిప్ ఒప్పందానికి ఆహ్వానిస్తుంది.

స్థలం, హ్యూమన్ రీసోర్స్
షోరూమ్ స్థాపనకు సరైన స్థలాన్ని ఎంచుకోవడం వ్యాపార విజయానికి మొదటి మెట్టు. మీ షోరూమ్ జాతీయ రహదారి (హైవే) లేదా ప్రధాన రోడ్డుకు దగ్గరగా ఉండటం బెస్ట్. డిస్‌ప్లే ఏరియా (కార్లను ప్రదర్శించడానికి), సర్వీస్ బే/వర్క్‌షాప్, పార్కింగ్ సౌకర్యం, ఆఫీస్ స్పేస్ (డాక్యుమెంట్లు, ఫైనాన్స్ కోసం) అవసరం. పెద్ద బ్రాండ్‌లకైతే 10,000 నుండి 25,000 చదరపు అడుగుల వరకు స్థలం అవసరం కావచ్చు. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, టెక్నీషియన్స్, ఫైనాన్స్ & ఇన్సూరెన్స్ ఆఫీసర్స్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజర్‌లను నియమించుకోవాలి.
పెట్టుబడి, లాభాల అంచనా
ఈ వ్యాపారంలో లాభం అనేది మీరు ఎంచుకునే డీలర్‌షిప్ రకంపై ఆధారపడి ఉంటుంది. యూజ్డ్ కార్ల షోరూమ్ ప్రారంభించడానికి సుమారు రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు పెట్టుబడి అవసరం కావచ్చు. ఇందులో సగటున 10% నుండి 25% వరకు లాభం పొందవచ్చు. కొత్త ఆథరైజ్డ్ డీలర్‌షిప్ ప్రారంభానికి కోటి నుండి రూ.5 కోట్లు వరకు పెట్టుబడి పెట్టాల్సి రావచ్చు. ఇందులో సగటున 4% నుండి 8% వరకు లాభం ఉంటుంది.

సక్సెస్ సీక్రెట్
భారతదేశంలో కారు డీలర్‌షిప్ అనేది మంచి అవకాశాలు ఉన్న వ్యాపారం. కానీ దీనిలో విజయం సాధించడానికి సరైన ప్లానింగ్, అన్ని లీగల్ డాక్యుమెంట్లు, కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడం అత్యంత ముఖ్యమైన అంశాలు. చిన్న స్థాయిలో ప్రారంభించి, విశ్వసనీయతను పెంచుకుంటే, భవిష్యత్తులో మీ వ్యాపారం పెద్ద డీలర్‌షిప్‌గా వృద్ధి చెందడానికి సహాయపడుతుంది.


Click it and Unblock the Notifications








