ఈ కారును 7 గురు మాత్రమే కొన్నారు.. ఇంత తక్కువ ధరకు ఇచ్చినప్పటికి షోరూమ్‌కు రాని కస్టమర్లు!
ఫ్రెంచ్ ఆటోమొబైల్ బ్రాండ్ సిట్రోయెన్ (Citroen) భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుండి తనదైన ప్రత్యేకతను చూపించగలిగింది. డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా, అలాగే కొత్తదనాన్ని కోరుకునే వినియోగదారులకు ఈ కంపెనీ వాహనాలు ఒక ప్రత్యామ్నాయంగా నిలిచాయి. అయితే, అందులో భాగంగా విడుదలైన సిట్రోయెన్ బసాల్ట్ (Citroen Basalt) మాత్రం ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితిని ఎదుర్కొంటోంది. తక్కువ ధర శ్రేణిలో ఉండి, ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగి ఉన్నప్పటికీ, ఈ SUV భారతీయ మార్కెట్లో వినియోగదారులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా వెలువడిన ఆగస్టు 2025 అమ్మకాల గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సిట్రోయెన్ బసాల్ట్ గత నెలలో కేవలం 7 యూనిట్లు మాత్రమే విక్రయించబడింది. ఇది ఒక అంతర్జాతీయ బ్రాండ్ SUVకి చాలా తక్కువ సంఖ్య.
గత ఏడాది ఇదే నెలలో అంటే ఆగస్టు 2024లో బసాల్ట్ 579 యూనిట్లను విక్రయించగా, ఈసారి ఆ సంఖ్య కేవలం ఒక నంబరుకే పరిమితమైంది. దీనర్థం ఒక్క ఏడాదలోనే ఈ మోడల్ అమ్మకాలు దాదాపు 98.79 శాతం వరకు క్షీణించాయి. మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుండి బసాల్ట్‌కు ఇది చెత్త ఫలితంగా చెప్పుకోవాలి. కొత్త SUVలు వరుసగా మార్కెట్లోకి వస్తుండడం, మరింత బలమైన ఫీచర్లు, కలిగిన కార్లు రావడంతో అమ్మకాలు తగ్గాయి.

అలాగే వినియోగదారులలో బ్రాండ్‌పై నమ్మకం తక్కువగా ఉండడం ఈ కారు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపించాయి. సిట్రోయెన్ భారతీయ మార్కెట్లో తన స్థిర స్థానాన్ని సంపాదించుకోవాలంటే, తన మోడళ్లలో విస్తృత మార్పులు చేయడం, సర్వీస్ సపోర్ట్‌ను మెరుగుపరచడం, అలాగే వినియోగదారులను ఆకర్షించే ధరా వ్యూహాలు అవలంబించడం తప్పనిసరిగా కనిపిస్తోంది. లేదంటే, ఈ తరహా అమ్మకాలతో కంపెనీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ మరింత దెబ్బతినే అవకాశం ఉంది.
ఇటీవల సిట్రోయెన్ తమ బసాల్ట్‌లోని లోపాలను అధిగమించేందుకు X అనే టాప్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బసాల్ట్ అమ్మకాలు ఆందోళనకరంగా పడిపోతుండటంతో, ఈ కొత్త వేరియంట్ ద్వారా వినియోగదారుల దృష్టిని మళ్లీ ఆకర్షించాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ కొత్త బసాల్ట్ X మోడల్ ధర రూ.7.95 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అదేవిధంగా, టాప్ ఎండ్ మోడల్‌గా ఉన్న బసాల్ట్ X మాక్స్ ధరలో కూడా గణనీయమైన తగ్గింపు చేశారు.

మునుపటి ధర రూ. 13.87 లక్షలుగా ఉండగా, ఇప్పుడు అదే వేరియంట్‌ను రూ. 12.90 లక్షలకు అందిస్తున్నారు. అంటే, వినియోగదారులు దాదాపు రూ. 1 లక్ష వరకు లాభం పొందే అవకాశం కలుగుతోంది. అయితే, కొత్త వేరియంట్‌లో ధర తగ్గింపు, కొన్ని సౌకర్యాల్లో మార్పులు మాత్రమే కనిపించాయి. డిజైన్ పరంగా లేదా బాహ్య భాగంలో పెద్దగా మార్పులు చేయలేదు. కారు లోపల మాత్రం అనేక అప్‌డేట్స్ ఉన్నాయి.
టాప్-ఎండ్ మోడల్‌గా నిలిచే బసాల్ట్ X మాక్స్ వేరియంట్ 1.2-లీటర్, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. డ్రైవింగ్ స్టైల్‌కి అనుగుణంగా కస్టమర్‌లు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా మరింత సౌకర్యవంతమైన 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంచుకోవచ్చు. ఈ కారణంగా, లాంగ్ డ్రైవ్‌లలో శక్తివంతమైన అనుభవం కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా మారుతుంది.

ఇదే సమయంలో, ఎంట్రీ-లెవల్‌గా లభించే బసాల్ట్ X వేరియంట్లు కొంత సాదాసీదాగా ఉన్నప్పటికీ, ప్రాక్టికల్‌గా వినియోగదారులను ఆకట్టుకునే విధంగా రూపకల్పన చేశారు. వీటిలో కూడా 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. అయితే, ఇది గరిష్టంగా 82 బిహెచ్‌పి పవర్‌ను మాత్రమే ఇస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ జత చేయబడింది. ఇది ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువైన ఆప్షన్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








