స్టాక్ క్లియర్ చేయడానికి కంపెనీల బంపర్ ఆఫర్లు.. డిసెంబర్లో కారు కొంటే కలిగే లాభనష్టాలేంటి ?
కారు కొనుగోలుదారులను బాగా కన్ఫ్యూజ్ చేసే నెల ఏదైనా ఉందా అంటే అది డిసెంబర్ అని చెప్పాలి. డిసెంబర్‌లో కారు కొనుగోలు చేయడం వల్ల ఇతర నెలల్లో కొనుగోలు చేయడం కంటే ఎక్కువ డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఇయర్-ఎండ్ ఆఫర్లలో కారు కొనడం వల్ల లాభాలే కాదు, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయనే వాస్తవం తెలుసుకున్న తర్వాత కొనుగోలుదారులు గందరగోళానికి గురవుతారు. మీరు ఈ నెలలో కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఎలా లాభదాయకమైన డీల్‌ను పొందాలి, ఇయర్-ఎండ్ ఆఫర్‌లో వాహనం కొనడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.
డిసెంబర్‌లో కారు కొనడం వల్ల ఇతర నెలల కంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనేది నిజమే. ఎందుకంటే డిసెంబర్ అనేది క్యాలెండర్ సంవత్సరంలో చివరి నెల. ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో తయారీదారులు, డీలర్లు ఆ సంవత్సరంలో తయారు చేసిన మొత్తం వాహనాలను విక్రయించడానికి ప్రయత్నిస్తారు.

ఉదాహరణకు, 2026 జనవరి రాగానే 2025లో తయారు చేసిన వాహనాలు ఒక సంవత్సరం పాతవిగా లెక్కలోకి వస్తాయి. అందుకే ఈ సంవత్సరం తయారైన వాహనాల స్టాక్‌ను క్లియర్ చేయడానికి మాగ్జిమమ్ ఆఫర్లను ప్రకటిస్తారు. దీనివల్ల డిసెంబర్‌లో మీకు ఇతర నెలల్లో లభించని డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంటుంది.
దీంతో పాటు, ప్రతి సంవత్సరం ఎంత మంది వాహనాలను విక్రయించారనే లెక్కలు డిసెంబర్ పూర్తయిన తర్వాత తెలుస్తాయి. క్యాలెండర్ సంవత్సరంలో నిర్ణయించిన అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోవడానికి డీలర్లపై ఒత్తిడి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, డీలర్లు గరిష్ట యూనిట్లను విక్రయించడానికి ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తారు.

ఇవి కేవలం క్యాష్ డిస్కౌంట్లు మాత్రమే కాకుండా, ఉచిత ఇన్సూరెన్స్, ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఉచిత యాక్సెసరీలు, తక్కువ వడ్డీ రేటుతో ఫైనాన్సింగ్ ఆప్షన్లు కూడా ఉండవచ్చు. ఈ ఆఫర్లు ఇతర నెలలతో పోలిస్తే డిసెంబర్‌లో మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. చాలా మంది ప్లాన్ చేసుకున్న కస్టమర్లు అంతకుముందే (దీపావళికి ముందు) కొనేసి ఉంటారు కాబట్టి, ఈ నెలలో షోరూమ్‌లలో రద్దీ పెద్దగా ఉండదు. ఈ సమయంలో షోరూమ్‌ను సందర్శించేవారు బేరం ఆడి బెస్ట్ ఆఫర్‌తో వాహనాన్ని పొందవచ్చు.
చెప్పేటప్పుడు అన్నీ చెప్పాలి కదా. మీరు రీసేల్ వాల్యూ చూసి కారు కొనే వ్యక్తి అయితే, డిసెంబర్‌లో కొనుగోలు చేయకపోవడం మంచిది. ఈ నెలలో మీరు కారు కొంటే, ఆ మోడల్ విలువ కొద్దిగా తగ్గుతుంది. ఎందుకంటే మీరు డిసెంబర్‌లో కొన్నప్పటికీ, మీ ఆర్సి బుక్‌లో మోడల్ ఇయర్ 2026 అని కాకుండా 2025 అనే కనిపిస్తుంది. దీనివల్ల వాహనాన్ని మళ్లీ విక్రయించేటప్పుడు (5-6 సంవత్సరాల తర్వాత) కొద్దిగా తక్కువ ధర లభించే అవకాశం ఉంది.

మీరు వాహనాన్ని ఎక్కువ కాలం, అంటే 5-6 సంవత్సరాల కంటే ఎక్కువ ఉపయోగించాలని ప్లాన్ చేస్తుంటే, తప్పకుండా ఈ నెలలో కారు కొనుగోలు చేయవచ్చు. ఇదంతా చదివి కన్ఫ్యూజ్ అయ్యారా? ఇయర్-ఎండ్ ఆఫర్‌లో కొనాలా, లేక కొత్త సంవత్సరంలో కొత్త మోడల్ ఇయర్‌తో వచ్చే కారు బుక్ చేయాలా అనే సందేహం ఉంటే భయపడకండి.
ఒకవేళ మీరు ఇప్పుడే బుక్ చేయలేకపోయినా, వచ్చే ఏడాది కూడా గత సంవత్సరంలో (MY2025) తయారైన మోడల్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డీలర్లు తమ వద్ద ఉన్న ఇన్వెంటరీని పూర్తిగా విక్రయించలేకపోతే, ఆ స్టాక్‌ను ఎలాగైనా ఖాళీ చేయడానికి మరింత ఆకర్షణీయమైన ఆఫర్‌లను ప్రకటిస్తారు.
ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇవన్నీ స్టాక్ లభ్యతపై ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోండి. కాబట్టి సమయం తీసుకుని, మీ అభిరుచికి, అవసరాలకు తగిన మంచి మోడల్‌ను బుక్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు.


Click it and Unblock the Notifications








