పెట్రోల్, డీజీల్ కార్లు వద్దు, ఈవీ ముద్దు అంటున్న జనాలు.. 2024లో ఎన్ని ఎలక్ట్రిక్ కార్లు కొన్నారంటే?
2024 ముగిసింది. కొత్త ఆశలతో 2025 ప్రవేశించింది. 2024 సంవత్సరం.. ఆటో మొబైల్ ఇండస్ట్రీకి అదుర్స్ అనిపించింది. అదే సమయంలో ఎలక్ట్రిక్ వెహికిల్ మార్కెట్ సైతం ఈ ఏడాది తన హవా చూపెట్టింది. రవాణా మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం... 2024లో మొత్తం 19.4 లక్షల ఈవీల అమ్మకాలు జరిగాయి. ఇది అంతకుముందు ఏడాది 2023తో పోలిస్తే 26.5 శాతం అధికం కావడం విశేషం. అంతేగాకుండా ఈవీ పెనెట్రేషన్ కూడా 7.46 శాతం పెరిగింది. అంతకుముందు ఏడాది ఇది 6.39శాతంగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది ఏ నెలలో అమ్మకాలు ఎలా సాగాయంటే..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఓవైపు ఈవీల కొనుగోళ్ల జోరు పెరుగుతున్నప్పటికీ.. మరోవైపు పెట్రోల్ వాహనాల అమ్మకాలు కూడా తగ్గేదేలా అన్నట్లుగా జరిగాయి. 2024లో మొత్తం 26.04 మిలియన్ వాహనాలు అమ్మకాలు జరిగాయి. ఇందులో 73.69శాతం వాహనాలు పెట్రోల్ వాహనాలే కావడం గమనార్హం. ఇది 19.18 మిలియన్ యూనిట్లతో సమానం. ఇక డీజిల్ వాహనాల విషయానికి వస్తే 10.05శాతం అమ్మకాలు జరిగాయి.

ఇది 2.62 మిలియన్ యూనిట్లకు సమానం. ఇక ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే హైబ్రిడ్, సీఎన్‌జీ వాహనాల వాటా 9.87శాతంగా ఉంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. ప్రతి 12.43 పెట్రోల్, డీజిల్, హెబ్రిడ్ వాహనాల అమ్మకాలకు ఒక్క ఈవీ చొప్పున అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. 2023లో ప్రతి 15.67 వాహనాలకు, 2022లో ప్రతి 21.05 వాహనాలకు ఒకటి చొప్పున ఈవీ అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ నివేదికలు... ఆటోమొబైల్ వినియోగదారులు క్రమక్రమంగా గ్రీన్ మొబిలిటీ వైపు మళ్లుతున్నట్లు స్పష్టమవుతోంది. అంతేగాకుండా ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగడం వల్ల, అదే విధంగా ప్రభుత్వ పాలసీల కారణంగా నెలల వారీగా అమ్మకాల్లో ఒడుదొడుకులు నమోదయ్యాయి. గత ఏడాది ప్రారంభంలో జనవరి, ఫిబ్రవరి నెలలో ఈవీ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. జనవరి నెలలో 1,45,064 ఈవీ సేల్స్ జరగగాయి.

ఇక ఫిబ్రవరిలో 1,41,740 ఈవీల అమ్మకాలు నమోదయ్యాయి. ఇక మార్చి నెలలో ఈ సేల్స్ మరింత పెరిగాయి. మార్చిలో ఈవీల కొనుగోళ్లకు సంబంధించి ఉద్దేశించిన ప్రభుత్వ సబ్సిడీ స్కీమ్ ఫేమ్ 2 ముగిసే సమయం కావడంతో అనేక మంది ఈవీలను కొనుగోళ్లు చేశారు. ఈ ఒక్క నెలలోనే 2,13,068 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
ఇక ఏప్రిల్‌లో 1,15,898 ఈవీల అమ్మకాలు జరగగా.. అతి తక్కువ సేల్స్ జరిగిన నెలగా నిలిచిపోయింది. ఇక ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం.. పీఎం ఇ- డ్రైవ్ పథకాన్ని ప్రకటించడంతో.. ఈవీల అమ్మకాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఫెస్టివ్ సీజన్ అయిన అక్టోబర్‌లో వాహన తయారీ సంస్థలు ప్రకటించిన ఆఫర్ల మూలంగా రికార్డు స్థాయి అమ్మకాలు నమోదయ్యాయి.

అక్టోబర్‌లో ఏకంగా 2,19,482 ఈవీ సేల్స్ జరిగాయి. అయితే ఈ జోష్.. తర్వాతి నెలలైన నవంబర్, డిసెంబరులో కాస్త తగ్గింది. అయితే ఏదైమైనా.. మొత్తానికి గతేడాదితో పోలిస్తే మాత్రం ఈవీ అమ్మకాలు పెరిగాయని మాత్రం క్లియర్ గా తెలుస్తోంది. పీఎం-ఇ డ్రైవ్ పథకం కింద.. కార్గో ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్‌కి సంబంధించి సబ్సిడీని తిరిగి ప్రవేశ పెట్టడం ఈ ఏడాది సేల్స్ పెరగడానికి మరో కారణంగా నిలిచింది.
ఈ పథకం కింద వాహనాలకు అందించే సబ్సిడీ తగ్గించినప్పటికీ, 80,500 పైగా EVలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాయి. ఈవీల అమ్మకాలు పెరుగుతున్న ఈ ధోరణి.. రాబోయే సంవత్సరాల్లో మరింత మంది ఈవీ వైపు మళ్లుతారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈవీపై భారీ సబ్సిడీని ప్రకటించే అవకాశం ఉంది. దీంతో సేల్స్ మరింత పెరగనున్నాయి.


Click it and Unblock the Notifications








