ఒకప్పుడు ఈ కారు కోసం షోరూంలకు క్యూ కట్టేవారు.. కానీ త్వరలోనే ఈ మోడల్ కనుమరుగు
ప్రస్తుతం ఎస్యూవీల హవా నడుస్తోంది. వాటి ముందు సెడాన్ కార్లు వెలవెలబోతున్నాయి. మంచి ట్రావెల్ ఎక్స్పీరియన్స్, మైలేజీనిచ్చే సెడాన్‌లు కూడా వాటి ముందు నిలబడలేకపోతున్నాయి. హ్యుందాయ్ ఔరా, టాటా టిగోర్ వంటి కార్లు వెనుకబడిపోతుంటే, మారుతి డిజైర్, హోండా అమేజ్ మాత్రం ఇంకా తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి. చూడగానే ఎవరికైనా నచ్చే ఈ రెండు కార్లు భారతీయుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాయి. ప్రస్తుతం హోండా సంచలన నిర్ణయం తీసుకుంది.
హోండా తన పాత తరం అమేజ్ కారు ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది. అయితే ఇది కొత్తగా విడుదలైన తరం కాదు, దానితో పాటు అమ్ముడవుతున్న రెండో తరం అమేజ్ మోడల్‌ను కంపెనీ నిలిపివేస్తోంది. 2024 డిసెంబర్‌లో మూడో తరం అమేజ్‌ను విడుదల చేసిన సమయంలో కొత్త మోడల్‌తో పాటు పాత తరం కూడా అమ్ముతామని హోండా ప్రకటించింది.

అలా ప్రకటించినప్పటికీ, కేవలం ఐదు నెలల తర్వాత హోండా పాత అమేజ్ అమ్మకాలను నిలిపివేసింది. కొత్త తరం విడుదలైన తర్వాత, కంపెనీ ఈ మోడల్‌ను S, VX అనే రెండు వేరియంట్లలో విక్రయించింది. కానీ ఇప్పుడు జపనీస్ కార్ల తయారీదారుల అధికారిక వెబ్‌సైట్ నుంచి VX వేరియంట్‌ను తొలగించారు.
ఇకపై 2024 హోండా అమేజ్ శ్రేణితో పాటు 2021 హోండా అమేజ్ S ట్రిమ్ లెవెల్ మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అయితే, త్వరలోనే ఈ సింగిల్ వేరియంట్‌ను కూడా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించినా ఆశ్చర్యపోనవసరం లేదు. రెండో తరం హోండా అమేజ్ మొదటిసారిగా 2018లో విడుదలైంది. ఆ తర్వాత మూడు సంవత్సరాలకు, ఈ సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా కంపెనీ భారతదేశానికి అందించింది.

అప్పట్లో హోండా అమేజ్ E, S, VX అనే మూడు వేరియంట్లలో లభించేది. 2023లో కాంపాక్ట్ సెడాన్ E వేరియంట్‌ను నిలిపివేశారు. ఇప్పుడు VX వేరియంట్‌ను కూడా నిలిపివేయడంతో, రెండో తరం అమేజ్ కేవలం S ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీటి ధరల విషయానికి వస్తే, మాన్యువల్, సివిటి ఆటోమేటిక్ వేరియంట్‌ల ఎక్స్-షోరూమ్ ధర వరుసగా 7.63 లక్షలు, రూ.8.53 లక్షలు.
హోండా అమేజ్లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 89 బిహెచ్‌పి శక్తిని మరియు 110 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2021లో చివరి అప్‌డేట్ వచ్చినప్పటికీ, ఫీచర్ల విషయంలో ఈ సెడాన్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. S వేరియంట్‌లో ఆక్స్-ఇన్, బ్లూటూత్, యూఎస్‌బి కనెక్టివిటీతో కూడిన ఇంటిగ్రేటెడ్ 2DIN LCD స్క్రీన్ ఆడియో సిస్టమ్ ఉంది.

దీంతో పాటు స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, హ్యాండ్స్-ఫ్రీ టెలిఫోన్ కంట్రోల్స్, టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, కప్‌హోల్డర్‌తో కూడిన వెనుక సెంటర్ ఫోల్డబుల్ ఆర్మ్‌రెస్ట్, ముందు, వెనుక యాక్సెసరీ సాకెట్లు, ట్రంక్ లిడ్ లైనింగ్, మాన్యువల్ వేరియంట్‌ల కోసం లెదర్ గేర్ లివర్ బూట్, ఒక అసిస్టెంట్ సైడ్ వానిటీ మిర్రర్, డ్యూయల్-టోన్ బ్లాక్ బీజ్ ఇంటీరియర్ వంటి ఫీచర్లు అమేజ్ S వేరియంట్‌లో ఉన్నాయి.
ఇక 2024 డిసెంబర్‌లో విడుదలైన సరికొత్త హోండా అమేజ్ కొనాలనుకునే వారికి V, VX, ZX అనే మూడు వేరియంట్లలో కారును ఎంచుకునే అవకాశం ఉంది. 8.19 లక్షల నుండి 11.20 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధర కలిగిన ఈ మోడల్‌లో 89బిహెచ్‌పి పవర్, 110ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
2024 అమేజ్ స్పెషాలిటీ ఏంటంటే.. ఇది ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)ను కలిగి ఉన్న భారతీయ మార్కెట్‌లోని అత్యంత సరసమైన కార్లలో ఒకటి. ఎల్‌ఈడీ లైటింగ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రొజెక్టర్ ఫాగ్ లాంప్‌లు, రిమోట్ ఇంజన్ స్టార్ట్, సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, లేన్ వాచ్ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఈ వాహనంలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








