పేద-మధ్యతరగతి కస్టమర్ల మనసు దోచిన మారుతీ.. ఫార్ములా వర్కౌట్ చేస్తూ మార్కెట్‌ను శాసిస్తుంది
భారత ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (FADA) ప్రతి నెలా దేశవ్యాప్తంగా అమ్ముడుపోయిన వాహనాల డేటాను వెల్లడిస్తుంది. మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న RTOలలో నమోదైన వాహనాలను నమోదు చేసుకుని ఎప్పటికప్పుడు ప్రచురిస్తుంది. తాజాగా ఫాడా ఫిబ్రవరి 2025కు సంబంధించి కార్ల కంపెనీల ద్వారా RTO వద్ద నమోదైన డేటాను సేకరించి వాటి అమ్మకాల వివరాలు తాజాగా విడుదల చేసింది. గత నెలలో దిగ్గజ కార్ల తయారీ దారులు మెరుగైన సంఖ్యలో విక్రయాలను నమోదు చేశారు.
ఫిబ్రవరిలో అత్యధికంగా కార్ల అమ్మకాలు జరిపిన టాప్-10 కార్ కంపెనీల్లో ఎప్పటిలాగే దేశీయ ప్రముఖ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్టీఓలలో నమోదైన కార్లలో అధిక భాగం ఈ కంపెనీలకు చెందిన మోడళ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఫిబ్రవరిలో టాప్ కార్స్ సెల్లింగ్ కంపెనీగా మారుతీ సుజుకీ నిలిచింది.

ఫాడా విడుదల డేటాను చూసినట్లయితే మారుతీ గత నెలలో మొత్తం 1,18,149 విక్రయాలను నమోదు చేసింది. ఈ గణాంకాలు అన్ని ఆర్టీఓలలో నమోదైన డేటా నుంచి తీసుకున్నారు. సాధారణంగానే మారుతీ కార్లకు ఇండియాలో భారీ డిమాండ్ ఉంటుంది. సేల్స్ పరంగా ఇతర కంపెనీల కంటే కూడా ఎప్పుడు ముందు స్థానంలో నిలుస్తుంది. సమీక్ష నెలలో ఇండియాలో ఆర్టీఓలలో నమోదైన కార్స్‌లో ఈ కంపెనీ వాటా ఏకంగా 38.94 శాతంగా ఉంది.
ఈ లెక్కన దేశంలో ఫిబ్రవరిలో అమ్ముడుపోయిన ప్రతి 3 కార్లలో ఒకటి ఖచ్చితంగా మారుతీ సుజుకీ మోడల్ ఉంటుంది. అయితే ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే గత ఏడాది (2024) ఫిబ్రవరి నెలలో ఆర్టీఓలో వద్ద 1,33,135 మారుతీ కార్లు రిజిస్టర్ అయ్యాయి. ఈ సమయంలో మొత్తం కార్ల విక్రయాల్లో మారుతీ వాటా 39.34 శాతంగా నమోదైంది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఈ సారి స్వల్పంగా తగ్గింది.

ఇక మారుతీ తర్వాత గత నెలలో మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన 39,889 కార్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్టీఓలలో రిజిస్టర్ అయ్యాయి. దీంతో అమ్మకాల పరంగా ఇది రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ సేల్స్‌లో మారుతీ సుజుకీ, మహీంద్రా కంపెనీల మధ్య భారీ తేడా ఉంది. దీన్ని బట్టి భారతదేశంలో మారుతీ కార్లకు ఏ మేరకు డిమాండ్ ఉందో అర్ధం అవుతుంది.
మూడో స్థానం విషయానికి వస్తే, దిగ్గజ కార్ల తయారీదారు టాటా మోటార్స్ ఫిబ్రవరిలో 38,696 సేల్స్‌ను నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే నెలలో పోలిస్తే తగ్గడం గమనార్హం. నాలుగో స్థానం చూసినట్లయితే దక్షిణ కొరియా బ్రాండ్ హ్యుందాయ్ మోటార్స్ ఫిబ్రవరి 2025లో దేశంలోని అన్ని rtoల వద్ద 38,156 కార్లను నమోదు చేసుకుంది. ఇది 2024 ఫిబ్రవరిలో 47,540 యూనిట్లుగా రిజిస్టర్ అయింది.

టయోటా కంపెనీ గత నెలలో మొత్తం 21,561 కార్లను విక్రయించి, 5వ స్థానాన్ని ఆక్రమించింది. కియా ఇండియా ఫిబ్రవరిలో అన్ని rtoల వద్ద 18,794 కార్లను నమోదు చేసుకుంది. తరువాత స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా గ్రూప్ 6,438 కార్స్, 7వ స్థానంలో హోండా కార్స్ (5,166), 8 స్థానంలో ఎంజి మోటార్స్ (4,551),9 వ స్థానంలో రెనాల్ట్ (2,523), పదో స్థానంలో నిస్సాన్ మోటార్ (1,706) ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: పైన అందించిన గణంకాలను భారత ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (FADA) , RTOల నుంచి అందుకున్న డేటా ఆధారంగా వెల్లడించడం జరిగింది. మరో కీలక విషయం ఏమిటంటే ఈ కార్ల సంఖ్యలో తెలంగాణలో నమోదైన వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే, ఇతర దేశాల ఎగుమతులు కూడా లేవు.


Click it and Unblock the Notifications








