పెళ్లి చూపులకెళ్లి, అమ్మాయి నచ్చి, పెళ్లిని వాయిదా వేసినట్లు.. కొత్త కార్ల కోసం కస్టమర్లు వెయిటింగ్
ఆగస్టు నెలలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ అమ్మకాల పరంగా నిలకడగా ఉంది. కానీ ఇది ఆందోళన కలిగించే విషయం కాదు, శుభవార్తే. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) నివేదిక ప్రకారం.. భారీ డిమాండ్ ఉన్నప్పటికీ కస్టమర్లు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీని వెనుక ప్రధాన కారణం ఏంటి? కొత్త జీఎస్టీ రేట్లు ఎందుకు అమ్మకాలను నిలిపివేశాయి? ఈ విషయంపై పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
భారత ఆటోమొబైల్ మార్కెట్ ఆగస్టు నెలలో మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) గణాంకాల ప్రకారం, మొత్తం రిటైల్ అమ్మకాలు 19.64 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 2.84% ఎక్కువ, కానీ జులై నెలతో పోలిస్తే మాత్రం దాదాపు స్థిరంగా ఉంది.

ఈ స్థిరత్వానికి ప్రధాన కారణం ఇటీవలి జీఎస్టీ రేట్ల తగ్గింపు. ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జీఎస్టీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి, కస్టమర్లు ధరలు తగ్గే వరకు కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు.
బుకింగ్‌లు పెరిగాయి, డెలివరీలు తగ్గాయి
ఈ ప్రభావం ఆగస్టు నెల మొత్తం కనిపించింది. డీలర్‌షిప్‌లలో ఎంక్వైరీలు, బుకింగ్‌లు భారీగా పెరిగినప్పటికీ, డెలివరీలు చాలా నెమ్మదిగా సాగాయి. కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో, కస్టమర్లు కొత్త ధరల కోసం వేచి ఉన్నారు.

చాలామంది కొనుగోలుదారులు సెప్టెంబర్ 22న జీఎస్టీ 2.0 అమలయ్యే వరకు ఆగడం మంచిదని భావించారు. దీని వల్ల అన్ని విభాగాల్లోనూ అమ్మకాలు స్తంభించాయి. అయితే, సెప్టెంబర్ నుంచి అమ్మకాలు మళ్లీ పుంజుకుంటాయని ఆటో డీలర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కార్ల అమ్మకాలపై ప్రభావం
ఆగస్టులో ప్యాసింజర్ వాహనాల (కార్లు, ఎస్‌యూవీలు) అమ్మకాలు 3,23,256 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది గతేడాది ఆగస్టుతో పోలిస్తే 0.93% ఎక్కువగా ఉన్నప్పటికీ, జులైతో పోలిస్తే 1.63% తక్కువ. నెల మొదటి భాగంలో ఓనం, వినాయక చవితి పండుగలకు డెలివరీలు వేగంగా సాగాయి. కానీ నెల రెండవ భాగంలో మాత్రం కొనుగోలుదారులు జీఎస్టీ మార్పుల ప్రయోజనాన్ని పొందడానికి డెలివరీలను వాయిదా వేశారు.

కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల కూడా షోరూమ్‌లకు వచ్చే వారి సంఖ్య తగ్గింది. అయితే, సెప్టెంబర్ చివరి నుంచి పండుగ సీజన్ మొదలవుతుంది కాబట్టి అమ్మకాలు పెరుగుతాయని FADA అధ్యక్షుడు సిఎస్ విఘ్నేశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వడ్డీ రేట్లు తగ్గుతుండటం, జీఎస్టీలో పారదర్శకత పెరగడం వల్ల ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు భారీగా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
టూ-వీలర్స్‌పై వర్షం ఎఫెక్ట్
ఆగస్టులో టూ వీలర్ల అమ్మకాలు 13,73,675 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే 2.18% ఎక్కువ కాగా, జులైతో పోలిస్తే 1.34% పెరిగాయి. ఈ విభాగంలోనూ విచారణలు ఎక్కువగా ఉన్నాయి, కానీ కొన్ని రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోళ్లు నెమ్మదిగా సాగాయి.

స్కూటర్ల అమ్మకాలు బలంగా ఉన్నప్పటికీ, కమ్యూటర్ మోటార్ సైకిళ్ల కొనుగోళ్లు మాత్రం వాయిదా పడ్డాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల కోసం డీలర్లు భారీగా బుకింగ్‌లను నమోదు చేసుకున్నారు. దీనిని బట్టి డిమాండ్ నెమ్మదిగా పెరుగుతోందని అర్థమవుతుంది.
భారీ అమ్మకాలు ఖాయం
ఆగస్టు నెలలో తగ్గిన డిమాండ్ కోల్పోయినది కాదని, కేవలం వాయిదా పడినదని FADA అభిప్రాయపడింది. దేశ జీడీపీ 6.3% నుండి 6.8% మధ్య స్థిరంగా ఉంది, ద్రవ్యోల్బణం తక్కువగా ఉంది, రుతుపవనాలు సాధారణంగా ఉన్నాయి. ఇవన్నీ పండుగ సీజన్‌లో మంచి డిమాండ్‌కు సంకేతాలు ఇస్తున్నాయి.
సెప్టెంబర్ నెల రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం అంటే శ్రాద్ధం సమయంలో అమ్మకాలు నెమ్మదిగా ఉంటాయి, కానీ సెప్టెంబర్ 22 తర్వాత జీఎస్టీ 2.0, నవరాత్రి పండుగలు ఒకేసారి రావడం వల్ల ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్లు, కమర్షియల్ వెహికల్స్, త్రీ వీలర్ల అమ్మకాల్లో భారీ పెరుగుదల ఉంటుందని ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications








