టెస్లా మోడల్ Y vs టాటా హ్యారియర్.ఈవీ.. రూ.60 లక్షల టెస్లాలో లేని ఫీచర్లు రూ.21 లక్షల టాటా కారులో ఉన్నాయా ?
భారత మార్కెట్‌లోకి ఎట్టకేలకు టెస్లా అడుగుపెట్టింది. టెస్లా తన మోడల్ Y సెడాన్‌ను రూ.60 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..ఈ ఖరీదైన టెస్లాలో లేని కొన్ని అడ్వాన్సుడ్ ఫీచర్లు కేవలం రూ. 21 లక్షల ధర ఉన్న టాటా హ్యారియర్.ఈవీలో ఉన్నాయట. ఈ రెండు కార్ల మధ్య ఉన్న కీలక తేడాలు, ఏయే ఫీచర్లు టాటా హ్యారియర్‌ను స్పెషల్‌గా నిలబెడుతున్నాయో చూద్దాం.
టెస్లా మోడల్ Y ఒక ప్రీమియం సెడాన్ కాగా, టాటా హ్యారియర్.ఈవీ ఒక భారీ ఎస్‌యూవీ. ఈ రెండింటి మధ్య ధరలో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఫీచర్ల పరంగా టాటా హ్యారియర్ కొన్ని చోట్ల టెస్లాను మించిపోయింది.

గ్రౌండ్ క్లియరెన్స్: భారతీయ రోడ్లకు అధిక గ్రౌండ్ క్లియరెన్స్ చాలా అవసరం. టాటా హ్యారియర్.ఈవీ 205 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. ఇది ఒక ఎస్‌యూవీ కాబట్టి, ఎత్తుపల్లాల రోడ్లపై ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ, టెస్లా మోడల్ Y ఒక సెడాన్ కాబట్టి, దీని గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉంటుంది.
డ్రైవింగ్ మోడ్స్: టాటా హ్యారియర్.ఈవీలో 6 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ మోడ్స్ డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగ్గా, రోడ్ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడానికి సహాయపడతాయి. ఈ ఫీచర్ టెస్లా మోడల్‌లో అందుబాటులో లేదు.

డిస్‌ప్లే టెక్నాలజీ: టాటా హ్యారియర్.ఈవీలో 14.5 అంగుళాల శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇది అత్యంత స్పష్టమైన, షార్ప్ విజువల్స్ అందిస్తుంది. దీనివల్ల డ్రైవర్, ప్రయాణీకులకు మంచి అనుభవం లభిస్తుంది.
పనోరమిక్ సన్‌రూఫ్: టాటా హ్యారియర్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది, ఇది కారుకు లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. ఈ ఫీచర్ టెస్లాలో లేదు.
స్మార్ట్ కీ ఫోబ్: టాటా హ్యారియర్.ఈవీకి ఒక ప్రత్యేకమైన, గుండ్రని ఆకారంలో ఉన్న కీ ఫోబ్ వస్తుంది. ఇది కేవలం కారును లాక్ చేయడం, అన్‌లాక్ చేయడం మాత్రమే కాకుండా, రిమోట్ పార్కింగ్, సమన్ మోడ్ (కారును ముందుకు, వెనక్కి జరపడం), కారు లైట్లను ఆన్/ఆఫ్ చేయడం వంటి మొత్తం 12 ఫీచర్లను అందిస్తుంది. ఈ కీ ఫోబ్ టెస్లాలో ఉండే సాధారణ ఫీచర్ల కంటే భిన్నంగా ఉంటుంది.
ధర, రేంజ్ విషయానికి వస్తే టాటా హ్యారియర్.ఈవీ ప్రారంభ ధర రూ.21.49 లక్షలు. 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ 627 కి.మీ.ల రేంజ్ ఇస్తుంది. కేవలం 15 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 250 కి.మీ.ల రేంజ్ పొందవచ్చు.
టెస్లా మోడల్ Y ప్రారంభ ధర సుమారు రూ.60 లక్షలు. 60 kWh, 75 kWh బ్యాటరీ ఆప్షన్స్‌తో వస్తుంది. 60 kWh బ్యాటరీ మోడల్ 500 కి.మీ.ల రేంజ్ ఇస్తుంది. 15 నిమిషాల సూపర్ ఛార్జింగ్‌తో 238-267 కి.మీ.ల రేంజ్ పొందవచ్చు. టాటా హ్యారియర్.ఈవీకి భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ లభించింది. అలాగే, ఇందులో లెవల్ 2 ADAS ఫీచర్లు కూడా ఉన్నాయి.
టెస్లా మోడల్ Y దాని బ్రాండ్ విలువ, ప్రీమియం ఫీచర్ల కోసం కొనుగోలు చేయాలి. కానీ, ధరలో దాదాపు మూడో వంతు ఉన్న టాటా హ్యారియర్.ఈవీ భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది. ఇందులో ఉన్న అదనపు ఫీచర్లు, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, మెరుగైన రేంజ్ దీనిని ఒక ఎట్రాక్టివ్ ఆప్షన్‌గా నిలుపుతున్నాయి.


Click it and Unblock the Notifications








