18గంటల్లో 2,40,000కార్లు బుకింగ్.. టెస్లాకే చెమటలు పట్టిస్తున్న ఫోన్ల కంపెనీ
సాధారణంగా ఎంఐ అని పిలిచే షియోమీ కంపెనీ మనలో చాలామందికి మొబైల్ ఫోన్ల కంపెనీగానే తెలుసు. కానీ, ఈ కంపెనీ చిన్నపాటి చేతి గడియారం నుండి పెద్దపెద్ద ఆటోమొబైల్ వాహనాల వరకు తయారు చేసి అమ్ముతోంది.
చైనా రాజధాని బీజింగ్ కేంద్రంగా పనిచేసే షియోమీ కంపెనీ కొన్ని సంవత్సరాల క్రితమే కార్ల తయారీలోకి దిగింది. ఇప్పుడు షియోమీ కంపెనీ నుండి రెండో కారు మార్కెట్‌లోకి రాబోతోంది. ఇది ఇండియాలో కాదు, పొరుగుదేశం చైనాలో.

పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం జనాల్లో బాగా పెరిగిపోతోంది. ఇది చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఆటోమొబైల్ రంగంలో కొత్త అవకాశాలను తెరిచింది. ఇండియాలో కూడా ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, అల్ట్రావయోలెట్ లాంటి 50కి పైగా కొత్త కంపెనీలు గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ టూ-వీలర్లను తయారు చేసి అమ్ముతున్నాయి.
ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ మార్కెట్ ఇలా ఉంటే ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో మాత్రం విదేశీ కంపెనీల ఆధిపత్యం మొదలైంది. ముఖ్యంగా ఎంజీ మోటార్, బీవైడీ లాంటి చైనీస్ కంపెనీల హవా నడుస్తోంది. ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ ఇలా ఉంటే ప్రపంచంలోనే అత్యంత పోటీ ఉండే చైనా ఆటోమొబైల్ మార్కెట్ గురించి చెప్పాల్సిన పనే లేదు.

మనకంటే చాలా సంవత్సరాలు ముందున్న చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం చాలా సంవత్సరాలుగా ఎక్కువగా ఉండటంతో, షియోమీ లాంటి పెద్ద కంపెనీలు నేరుగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి దిగాయి. ఇందులో భాగంగా, షియోమీ తన మొదటి ఎలక్ట్రిక్ కారును ఎస్‌యూ7 పేరుతో 2024 మార్చి నెలలో విడుదల చేసింది.
ఈ షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారులో కొత్తగా ఖరీదైన ఎస్‌యూ7 అల్ట్రా కారును ఇప్పుడు చైనాలో పరిచయం చేశారు. దీనికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, షియోమీ కంపెనీ తన రెండో ఎలక్ట్రిక్ కారును వైయూ7 పేరుతో చైనాలో మార్కెట్‌లోకి విడుదల చేసింది.

2.53లక్షల చైనీస్ యువాన్లు(ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.28.50 లక్షలు) ధరతో చైనాలో విడుదలైన కొత్త వైయూ7 ఎలక్ట్రిక్ కారుకు, బుకింగ్స్ మొదలైన కేవలం 18 గంటల్లోనే ప్రజల నుండి 2.40లక్షల బుకింగ్స్ వచ్చాయి. దీని ఫలితంగా షియోమీ కంపెనీ షేర్ల విలువ కూడా ట్రేడింగ్‌లో పెరిగింది.
చైనీస్ ప్రజల నుండి వైయూ7 ఎలక్ట్రిక్ కారుకు ఇంత పెద్ద స్పందన వస్తుందని షియోమీ కంపెనీ కూడా ఊహించలేదు. అందుకే, వైయూ7 ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని పెంచారు. షియోమీ వైయూ7 కారు ధరతో పోలిస్తే, టెస్లా కంపెనీకి చెందిన మోడల్ వై ఎలక్ట్రిక్ కారు దీనికి పోటీగా ఉంటుంది. టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కారు కూడా చైనాలో అమ్ముడవుతోంది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లోకి రావడానికి చాలా ఆలోచించిన షియోమీ, ఒక్కసారి దిగిన తర్వాత మాత్రం ఏడాదికి ఒక కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తూ మార్కెట్‌ను ఊపేస్తోంది. అయితే, ఈ చైనీస్ కంపెనీ ఇండియాలో తన ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావడానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుందని అంచనా వేస్తున్నాం. కానీ, ఒక ఫోన్ కంపెనీ ఇంత త్వరగా కార్ల మార్కెట్‌లో దూసుకెళ్లడం నిజంగా ఆశ్చర్యమే!


Click it and Unblock the Notifications








