పండుగ సీజన్, జీఎస్టీ తగ్గింపుతో టూ వీలర్లకు కలిసొచ్చిన కాలం.. ఏ బైక్ ఎక్కువ అమ్ముడుపోయిందో తెలుసా ?
భారతదేశంలో టూ వీలర్ సేల్స్ 2025 సెప్టెంబర్ నెలలో అద్భుతమైన వృద్ధిని నమోదు చేశాయి. పండుగల సీజన్ డిమాండ్, కొత్త మోడళ్ల విడుదల, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు ఈ సానుకూల వృద్ధికి ప్రధాన కారణాలు. ఈ మొత్తం అమ్మకాల్లో ఎప్పటిలాగే హీరో స్ప్లెండర్ తన ఆధిపత్యాన్ని కొనసాగించి, ఒక్క నెలలోనే 3.8 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడైంది. అయితే, ఇదే సమయంలో స్కూటర్ సెగ్మెంట్లో టాప్ పొజిషన్లో ఉండే హోండా యాక్టివా అమ్మకాలు మాత్రం తగ్గడం గమనార్హం. సెప్టెంబర్ నెలలో టూ వీలర్ సేల్స్ పూర్తి వివరాలు చూద్దాం.
టూ వీలర్ మార్కెట్లో రికార్డు వృద్ధికి కారణాలివే
2025 సెప్టెంబర్ నెల టూ వీలర్ మార్కెట్‌కు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. దేశంలోని టాప్ 10 మోడళ్ల మొత్తం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 2025 సెప్టెంబర్‌లో మొత్తం 14,62,687 యూనిట్ల ద్విచక్ర వాహనాలు విక్రయమయ్యాయి. ఇది 2024 సెప్టెంబర్‌లో అమ్ముడైన 13,76,024 యూనిట్ల కంటే 6.30% అధికం (86,663 యూనిట్లు ఎక్కువ).

సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు అమ్మకాలను పెంచాయి. ముఖ్యంగా, 350సీసీ కంటే తక్కువ కెపాసిటీ గల టూ వీలర్ల పై పన్ను 28% నుండి 18%కి తగ్గడం అనేది కస్టమర్లకు ధరల విషయంలో ఉపశమనం కలిగించింది. అత్యధికంగా అమ్ముడయ్యే మోడల్స్ అన్నీ ఈ విభాగంలోనే ఉండటం వల్ల ఈ వృద్ధి సాధ్యమైంది.
హీరో స్ప్లెండర్ అగ్రస్థానం, యాక్టివాకు గట్టి ఎదురుదెబ్బ
విక్రయాల జాబితాలో మొదటి స్థానం స్థిరంగా ఉన్నప్పటికీ, రెండవ స్థానంలో మార్పులు కనిపిస్తున్నాయి.

హీరో స్ప్లెండర్ : 2025 సెప్టెంబర్‌లో స్ప్లెండర్ 3,82,383 యూనిట్లు అమ్ముడై, 26.14% మార్కెట్ వాటాను దక్కించుకుంది. గత ఏడాది కంటే 1.73% వృద్ధి నమోదైంది. ఇటీవల, హీరో సంస్థ 12.5 కోట్ల టూ వీలర్ల మైలురాయిని చేరుకోవడం సందర్భంగా స్ప్లెండర్+ వంటి ప్రత్యేక ఎడిషన్లను విడుదల చేయడం కూడా అమ్మకాలకు దోహదపడింది.
హోండా యాక్టివా : జాబితాలో రెండో స్థానంలో ఉన్న యాక్టివా అమ్మకాలు మాత్రం ఆశ్చర్యకరంగా తగ్గాయి. 2024 సెప్టెంబర్‌తో పోలిస్తే, 9.38% తగ్గింపుతో 2,37,716 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే, సుమారు 24,600 స్కూటర్లు తక్కువగా అమ్ముడయ్యాయి. స్కూటర్ విభాగంలో కొత్త మోడళ్ల రాక, పెరిగిన పోటీ కారణంగానే ఈ తగ్గుదల నమోదైందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇతర మోడళ్ల అద్భుత పనితీరు
మొదటి 10 స్థానాల్లో ఉన్న మిగిలిన టూ వీలర్లు మెరుగైన వృద్ధిని చూపించాయి. ముఖ్యంగా పల్సర్, జూపిటర్, యాక్సెస్ మోడళ్లు రికార్డులు సృష్టించాయి. టీవీఎస్ జూపిటర్ అత్యధికంగా 38.07% వార్షిక వృద్ధిని సాధించి, 1,42,116 యూనిట్లకు చేరుకుంది. ఇది యాక్టివా అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మారింది.
బజాజ్ పల్సర్ 11.98% వృద్ధి రేటుతో 1,55,798 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. సుజుకి యాక్సెస్ స్కూటర్ కూడా 34.48% వృద్ధిని నమోదు చేసి, 72,238 యూనిట్లను విక్రయించింది.

ఇతర మోడళ్ల విషయానికి వస్తే హోండా షైన్ (1,85,059 యూనిట్లు - 1.77% వృద్ధి), హీరో హెచ్.ఎఫ్ డీలక్స్ (1,18,043 యూనిట్లు - 3.70% వృద్ధి), బజాజ్ ప్లాటినా (62,260 యూనిట్లు - 25.09% వృద్ధి), టీవీఎస్ అపాచీ (53,326 యూనిట్లు - 28.06% వృద్ధి) తో మార్కెట్‌లో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. మినీ మోటార్‌సైకిల్ అయిన టీవీఎస్ ఎక్స్ఎల్ (TVS XL) మాత్రమే 2.22% స్వల్ప తగ్గింపును నమోదు చేసింది.


Click it and Unblock the Notifications








