ఈ కంపెనీ కార్లకు ఏమైంది? ఎవరూ వాటిని కొనడం లేదు! అమ్మకాలు ఊహించని విధంగా పడిపోయాయి!
భారతదేశపు ఆటోమొబైల్ రంగంలో హోండా (Honda) ఎప్పటికైనా ఒక గుర్తుండిపోయే బ్రాండ్. ఒకప్పుడు స్టైల్, నాణ్యత, నమ్మకత్వానికి సింబాలిక్‌గా నిలిచిన హోండా కార్లు ఇప్పుడు భారత మార్కెట్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మాత్రం హోండాకు ఇప్పటికీ మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, భారత వినియోగదారుల అభిరుచులు, అంచనాలు తక్కువ ధరలో ఎక్కువ సౌకర్యాలు కోరే దిశగా మారిపోవడంతో, హోండా అమ్మకాల పరంగా క్రమంగా వెనుకపడుతోంది. ఈ నేపథ్యంలో, హోండా మోటార్ ఇండియా మే 2025 అమ్మకాల గణాంకాలను తాజాగా విడుదల చేసింది. అందులో చూపినట్లుగా, మే నెలలో హోండా దేశవ్యాప్తంగా కేవలం 3,950 కార్లను మాత్రమే విక్రయించింది. ఇది గత సంవత్సరం మే 2024లో విక్రయించిన 4,822 యూనిట్లతో పోలిస్తే 18.08 శాతం తగ్గుదల.
అంటే, హోండా ఒక్క ఏడాదిలోనే 872 యూనిట్ల విక్రయాలు కోల్పోయింది. ఇది భారతీయ మార్కెట్లో కంపెనీ పరిస్థితిని ప్రతిబింబించే స్పష్టమైన సంకేతం. అయితే, నెలనెలకు గణాంకాలను పరిశీలిస్తే, కొంత మెరుగుదల కనిపిస్తోంది. ఏప్రిల్ 2025లో విక్రయించిన 3,360 యూనిట్లతో పోలిస్తే మేలో 17.56 శాతం వృద్ధి నమోదైంది. అంటే 590 యూనిట్ల అమ్మకాలు పెరిగాయి. ఈ పెరుగుదల స్వల్పమైనదైనా, హోండా ఇప్పటికీ భారత మార్కెట్లో తిరిగి నిలబడ్డేందుకు ప్రయత్నిస్తోందని సూచిస్తుంది.

ఇప్పటికే మారుతీ సుజుకీ, టాటా, మహీంద్రా, కియా, టయోటా వంటి బ్రాండ్లు ప్రజలకు కావలసిన టెక్నాలజీ, ఫీచర్లు, అందుబాటు ధరల్లో అన్నింటినీ అందిస్తూ ముందుకు సాగుతున్నాయి. కానీ, హోండా మాత్రం కొన్ని పాత మోడళ్లను ఆధారంగా పెట్టుకొని కొత్త పోటీదారులతో పోటీ పడటంలో వెనుకబడుతున్నది. కొత్త మోడళ్ల కొరత, SUV విభాగంలో స్పష్టమైన ప్రాతినిధ్యం లేకపోవడం వంటి అంశాలు కూడా హోండా విక్రయాలపై ప్రభావం చూపుతున్నాయి.
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(HCIL) మే 2025లో దేశీయంగా చేసిన విక్రయాలతో పాటు ఎగుమతుల పరంగా కూడా వెనకడుగు వేసిందని గణాంకాలు చెబుతున్నాయి. కంపెనీ ప్రకారం, ఈ నెలలో 2,035 యూనిట్ల కార్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. అయితే, ఇదే మే నెల 2024లో 6,251 యూనిట్లు ఎగుమతి చేసిన నేపథ్యంలో, ఇది 67.45 శాతం తగ్గుదలగా నమోదైంది. ఒక్క ఏడాదిలోనే 4,216 యూనిట్ల తక్కువ ఎగుమతులు జరిగాయి.

ఈ గణాంకాలు హోండా గ్లోబల్ మార్కెట్ పెనుసవాళ్లను ఎదుర్కొంటున్నదనేది స్పష్టంగా సూచిస్తున్నాయి. ఎగుమతుల తగ్గుదలతోపాటు, దేశీయ అమ్మకాల్లోనూ పడిపోతున్న ట్రెండ్ కంపెనీని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. మొత్తంగా, హోండా మే నెలలో దేశీయంగా విక్రయించిన 3,950 యూనిట్లు, ఎగుమతి చేసిన 2,035 యూనిట్లను కలిపితే, మొత్తం 5,985 యూనిట్లు మాత్రమే మార్కెట్లోకి వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది 2024 మేలో నమోదైన 11,073 యూనిట్లతో పోలిస్తే 45.95 శాతం తగ్గుదల.
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న మార్కెట్ సవాళ్ల నేపథ్యంలో, సంస్థ మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహ్ల్ మాట్లాడుతూ, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, అలాగే కస్టమర్ డిమాండ్‌లో కొనసాగుతున్న తగ్గుదల దృష్ట్యా, మేము మా డీలర్ నెట్‌వర్క్ అంతటా సరైన స్థాయిలో ఇన్వెంటరీని ఉంచేందుకు షిప్‌మెంట్‌లు నియంత్రించే దిశగా వ్యూహాత్మకంగా ముందుకు సాగామని అన్నారు.

భవిష్యత్తు ప్రణాళికల గురించి ప్రస్తావిస్తూ, రాబోయే నెలల్లో అమ్మకాలు మెరుగయ్యే అవకాశం ఉందని. దీనికి దేశవ్యాప్తంగా మంచి రుతుపవనాల అంచనాలు, కస్టమర్లలో కొనుగోలుపై సానుకూల అంశాల మెరుగుదల వంటివి మద్దతు ఇస్తాయని ఆశిస్తున్నాము. ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, ఆకర్షణీయమైన ఆఫర్లు, కొత్త ఉత్పత్తులతో వినియోగదారుల్ని ఆకర్షించేలా ప్లానింగ్ చేస్తున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications








