డీజిల్ లేకపోవడం శాపమైందా? ఒకప్పుడు బెస్ట్‌సెల్లర్.. ఇప్పుడు SUVలతో పోటీకి తంటాలు పడుతున్న సిటీ!
భారతీయ కార్ల మార్కెట్‌లో ఒకప్పుడు సెడాన్‌లు రాజులు. కుటుంబ కార్లలోనూ, స్టైల్ కోరుకునే యువతలోనూ సెడాన్‌లకు ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఆ కాలంలో హోండా సిటీ వంటి కార్లు చాలమంది కలల కారు. ఆకట్టుకునే డిజైన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్, విశ్వసనీయమైన పనితీరు.. ఇవన్నీ హోండా సిటీని ప్రత్యేకం చేశాయి. కానీ, SUVల రాకతో మార్కెట్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. SUVల బలమైన డిజైన్, హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్, ఆల్-రౌండ్ యూజ్ వంటి లక్షణాలు వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించాయి. ఈ మార్పు ప్రభావం హోండా సిటీ వంటి ప్రాచుర్యం పొందిన సెడాన్‌లపై కూడా పడింది. తాజాగా వెలువడిన జూలై 2025 అమ్మకాల గణాంకాలు దీనిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. గత నెలలో మొత్తం 4,050 కార్లను హోండా విక్రయించినప్పటికీ, అందులో హోండా సిటీ కేవలం 646 యూనిట్లతోనే పరిమితమైంది.
ఇది ఒకప్పుడు హోండా బ్రాండ్‌కు సింబల్‌గా ఉన్న సిటీకి పెద్ద దెబ్బగా చెప్పుకోవాలి. ఇక జూలై 2024తో పోలిస్తే కూడా ఈ సంవత్సరం సేల్స్ తగ్గాయి. గత ఏడాది ఇదే నెలలో 957 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి సంఖ్య 646కి పడిపోవడం, దాదాపు 32 శాతం తగ్గుదల. ఇది సెడాన్ మార్కెట్‌పై పెరుగుతున్న ఒత్తిడికి నిదర్శనం. SUVలు ఆకర్షణీయమైన ధరలతో, ఎక్కువ ఫీచర్లతో అందుబాటులో ఉండటం సెడాన్‌ల డిమాండ్‌ను తగ్గిస్తోంది.

మొత్తం మీద, హోండా సిటీ ప్రస్తుతం తన పూర్వ వైభవాన్ని నిలబెట్టుకోవడంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నా, మార్కెట్ ధోరణి పూర్తిగా SUVల వైపు మొగ్గుచూపుతుండటంతో, దీని భవిష్యత్తు మరింత సవాళ్లతో నిండిపోయినట్లే కనిపిస్తోంది. హోండా సిటీ ఒకప్పుడు భారతీయ సెడాన్ మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలిచిన మోడల్. డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో వినియోగదారులందరినీ ఆకట్టుకున్న ఈ కారు, కాలక్రమేణా మారుతున్న నియమాలు, మార్కెట్ పరిస్థితులతో అనేక మార్పులను ఎదుర్కొంది.
గతంలో డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉన్న హోండా సిటీ, కఠినమైన ఉద్గార నిబంధనలు అమల్లోకి రావడంతో ఆ ఎంపికను పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. దీంతో తక్కువ ఖర్చు కోరుకునే వినియోగదారులు కొంత నిరాశ చెందారు. ఆ లోటును భర్తీ చేయడానికి హోండా శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్‌ను ప్రవేశపెట్టింది. సాంకేతికంగా అద్భుతంగా ఉండి, ఇంధన సామర్థ్యంలోనూ మెరుగైన ఫలితాలు ఇచ్చినా సాధారణ వినియోగదారులు దాని వైపు పెద్దగా ఆసక్తి చూపలేదు.

ప్రస్తుతం హోండా సిటీ SV, V, VX, ZX ఎలిగెంట్ ఎడిషన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ధరలు రూ. 12.42 లక్షల నుండి రూ. 16.69 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఈ ధర శ్రేణి దానిని ప్రీమియం సెడాన్ విభాగంలో నిలిపినా, SUVల పెరుగుతున్న పోటీ కారణంగా ఇది కొంత వెనుకబడుతోంది. అయితే, హోండా సిటీ తన ముఖ్యమైన బలాలను మాత్రం ఇప్పటికీ నిలబెట్టుకుంది.
హోండా సిటీ 1.5-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. దీన్ని రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో జత చేశారు, ఇది కేవలం శక్తినే కాకుండా ఫ్యూయల్ సామర్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచుతుంది. ఈ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ 126 bhp శక్తిని అందించగలదు, అలాగే గరిష్టంగా 253 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని శక్తిని సమర్థవంతంగా రోడ్డు మీదకు అందించడానికి ECVT ట్రాన్స్‌మిషన్‌ను వినియోగించారు.

ఇంధన సామర్థ్య పరంగా ఈ హైబ్రిడ్ వేరియంట్ హోండా సిటీకి మరో బలమైన హైలైట్. కంపెనీ ప్రకారం ఇది లీటరుకు 26.5 కిలోమీటర్ల వరకు మైలేజీ అందించగలదు. పూర్తి ట్యాంక్‌తో 1,000 కి.మీ పరిధి ఇవ్వగల సామర్థ్యం ఈ సెగ్మెంట్‌లో అరుదైన విషయం. దీని వల్ల దీర్ఘకాలిక ప్రయాణాలు చేసే వారికి తక్కువ ఇంధన ఖర్చుతో అధిక ప్రయోజనం లభిస్తుంది.


Click it and Unblock the Notifications








