ఈ హోండా కార్లతో మెయింటనెన్స్ చాలా వరకు తగ్గుతుంది.. ఇక పెట్రోల్ బంకు దగ్గర లైన్లు మరిచిపోండి
ప్రస్తుత రోజుల్లో పెట్రోల్ ధరలు గరిష్ట స్థాయిని తాకిన నేపథ్యంలో, సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల మార్పుల కారణంగా ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఎక్కువ మైలేజ్ అందించే కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అధిక ఖర్చుతో కూడిన పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గిస్తూ, తక్కువ వ్యయంతో కూడిన వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)తో నడిచే వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇవి గాలి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు, ప్రభుత్వాలు కూడా ఈ మార్పును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. కొత్తగా CNG స్టేషన్ల ఏర్పాటు, పన్ను సబ్సిడీలు వంటి విధానాల ద్వారా ఈ రంగానికి బలాన్నిచేకురుస్తుంది.
CNGతో నడిచే కార్లను ఇప్పుడు జనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. భారతదేశంలో పెట్రోల్ ధరలు నిత్యం పెరుగుతూ ఉండటంతో, వినియోగదారుల ప్రాధాన్యతలు కూడా వేగంగా మారుతున్నాయి. మారుతున్న ధోరణిని గమనించిన వాహన తయారీ సంస్థలు, ఇంధన ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాయి. ఈ సందర్భంలో, CNG వాహనాలు భారత ఆటోమొబైల్ రంగంలో ఒక కొత్త శక్తిగా నిలుస్తున్నాయి. అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ, ఈ మార్పును ముందుగానే గ్రహించింది.

టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి ఇతర కంపెనీల కూడా ఈ రంగంలో గణనీయంగా అడుగులు వేస్తున్నాయి. రెండు కంపెనీలు తమ ఎంపిక చేసిన మోడళ్లను ఫ్యాక్టరీలో అమర్చిన CNG కిట్‌తో అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హోండా సంస్థ కూడా ఈ వైపు అడుగులు వేసింది. ఈ జపనీస్ బ్రాండ్ తన రెండు ప్రసిద్ధ కార్లు అయినటువంటి అమేజ్, ఎలివేట్ SUV లకు CNG రెట్రోఫిట్ కిట్‌తో విడుదల చేసింది
ఈ కిట్లను ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పటివరకు కంపెనీ ఇంధన వాహనాలను మాత్రమే విడుదల చేయగా, ఇప్పుడు డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సీఎన్‌జీ కిట్‌లో తన ప్రసిద్ధ మోడళ్లను లాంచ్ చేసింది. రెట్రోఫిట్ కిట్‌లు అంటే, ఇవి వాహన తయారీ సంస్థల ఫ్యాక్టరీలలో ముందుగానే అమర్చబడే కిట్‌లు కావు. బదులుగా, వాహనం కొనుగోలు చేసిన తర్వాత డీలర్‌షిప్ స్థాయిలో ప్రత్యేకంగా ఇన్‌స్టాల్ చేస్తారు.

ఈ విధానం ద్వారా వినియోగదారులు తమ మామూలు పెట్రోల్ వాహనాన్ని, అవసరమైతే, CNGగా మార్చుకోవచ్చు. ఈ ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ ఎక్కడ పడితే అక్కడ జరుగదు. అన్ని డీలర్‌షిప్‌లకూ ఈ సేవలందించే అనుమతి ఉండదు. కేవలం ఎంపిక చేసిన, శిక్షణ పొందిన టెక్నీషియన్లను కలిగిన డీలర్‌షిప్‌ల్లోనే ఈ సేవను అందించేందుకు హోండా కంపెనీ అనుమతి ఇస్తోంది.
ప్రస్తుతం హోండా, రెట్రోఫిట్ కిట్ సదుపాయం కలిగిన అమేజ్, ఎలివేట్ కార్ల ధరల వివరాల గురించి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ కార్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మొదటగా పెట్రోల్ మోడళ్లుగా ఎంటర్ చేస్తారు. తరువాత వాటిని పెట్రోల్-CNG మోడ్‌కు అనుగుణంగా అప్‌డేట్ చేస్తారు. ఇది ఫ్యాక్టరీలో అమర్చిన సెటప్‌ల కంటే కొంచెం క్లిష్టతరంగా ఉంటుంది. వారంటీ కోసం CNG కిట్ ప్రొవైడర్ నుండి సర్టిఫికేట్ తీసుకోవాలి.
రెట్రోఫిట్ కిట్‌లు ప్రస్తుతం అమేజ్, ఎలివేట్ మోడళ్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ధరల వివరాల గురించి వచ్చే రోజుల్లో ఈ సమాచారం పూర్తిగా వెల్లడయ్యే అవకాశం ఉంది. అమేజ్, ఎలివేట్ కార్లలో హోండా CNG ఆప్షన్‌ను అందించడంతో క్రమంగా వీటి కోసం కస్టమర్లు షోరూమ్‌లకు ఎగబడే అవకాశం ఉంది. మైలేజ్ విసయంలో కూడా త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. పెట్రలో వాహనాలతో పోలిస్తే ఇది మరింత ఎక్కువగానే వస్తుంది.


Click it and Unblock the Notifications








