Auto expo 2025: విదేశాల్లో పాపులర్ అయిన ఆ కారుతో హ్యూందాయ్.. పెద్ద ఫ్యామిలీ ప్రయాణించొచ్చు ఎంచక్కా!
దిల్లీలో జరుగుతున్న భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో.. వివిధ ఆటో మొబైల్ సంస్థల నుంచి కొత్త కొత్త వాహనాలు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఈ ఈవెంట్‌లో హ్యూందాయ్ సంస్థ ఓ సరికొత్త వాహనాన్ని ప్రదర్శించింది. అదే హ్యుందాయ్ స్టారియా ఎంపీవీ. విదేశాల్లో ఇప్పటికే కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకున్న ఈ కారును దేశంలో ఆవిష్కరించడం ఇదే తొలిసారి. అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఉన్న ఈ కారు పెద్ద ఫ్యామిలీలకు సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు. 11 మంది ప్రయాణికులకు సరిపోయేలా సౌకర్యవంతమైన సీటింగ్ సదుపాయం ఇందులో ఉంటుంది. ఈ కారు ధర ఎంత ఉంటుంది? దీని ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో ఉండే ఫీచర్లేంటో ఇప్పుడు చూద్దాం.
హ్యూందాయ్ సంస్థ దీని లాంఛ్ గురించి ఇంకా వెల్లడించలేదు. కానీ, ఇది లాంఛ్ అయితే మాత్రం దీని ధర(ఎక్స్- షో రూమ్) రూ.65 లక్షలకు పైగా ఉండే అవకాశం ఉంది. ప్రీమియం ఇంటీరియర్‌తో ఉన్న ఈ కారు.. కియా కార్నివాల్‌కు గట్టి పోటీగా నిలుస్తుందని చెప్పవచ్చు.

ఈ స్టారియా పెద్ద ఎంపీవీ.. వ్యాన్ తరహాలో ఉండే ప్రీమియం కారుగా చెప్పవచ్చు. ఇది 2021 నుంచి అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారు వివిధ సీటింగ్ కన్ఫిగరేషన్లతో అందుబాటులో ఉంది. నాలుగు వరుసలతో ఉండే ఈ కారులో 11 మంది ప్రయాణించే సదుపాయం కూడా ఉంది. అయితే... ఆటో ఎక్స్‌పో లో ఈకారును ప్రీమియం 7- సీటర్ వెర్షన్‌లో ప్రదర్శించింది హ్యూందాయ్ సంస్థ.
అలాగే ఇది 9- సీటర్ కన్ఫిగరేషన్‌లో కూడా లభిస్తుంది. ఇక 7- సీటర్ వెర్షన్‌లో రెండు రిలాక్సేషన్ సీట్లు ఉన్నాయి. ఇది ఎలక్ట్రికల్లీ రిక్లైన్‌డ్ గా ఉంటుంది. దీన్ని ముందుకు జరిపి కారులో మరింత కార్గో స్పేస్‌ను వాడుకునే అవకాశం ఉంది. ఇక రెండో రో సీట్లలో స్వైవెల్ ఫంక్షన్ సదుపాయం ఉంటుంది.

ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో ఈ హ్యూందాయ్ స్టారియా కారు ఉంటుంది. LED DRL స్ట్రిప్, బంపర్‌పై పొడవాటి గ్రిల్, pixelated ప్యాటర్న్ హెడ్‌లైట్లు దీనికి ఉంటాయి. విండో ప్యానెల్స్ పెద్దగా ఉండి, స్లైడింగ్ డోర్స్‌తో ఉంటుంది. వెనుకవైపు వర్టికల్లీ అరేంజ్‌డ్ టెయిల్ లైట్లు ఉంటాయి.
ఇక దీని ఇంటీరియర్ విషయానికి వస్తే.. మినిమలిస్ట్ డిజైన్‌తో దీని డ్యాష్‌బోర్డ్ ఉంటుంది. హ్యూందాయ్ క్రెటా మోడల్‌లో ఉన్నట్లుగా దీని స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇది 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 64- కలర్ యాంబియెంట్ లైటింగ్, బోస్ సౌండ్ సిస్టంతో ఉంటుంది. సేఫ్టీ కోసం ఇందులో 7 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. రివర్సింగ్ కెమెరా, మల్టిపుల్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ఉంటాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ఈ స్టారియా కారు.. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అయితే ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కారులో మాత్రం 3.5 లీటర్ V6 ఇంజిన్‌తో ఉంది. ఇది 272 bhp పవర్, 331 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8- స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో అనుసంధానించి ఉంటుంది. దీంట్లో ఫ్రంట్- వీల్ డ్రైవ్ ఉంటుంది.
ఈ కారు ఇంటీరియర్‌లోని డ్యాష్ బోర్డుపై అనేక ఫిజికల్ బటన్స్ ఉన్నాయి. ఫ్రీ- స్టాండింగ్ ఇన్స్టుమెంట్ క్లస్టర్, 4- స్పోక్ స్టీరింగ్ వీల్, ఫ్లాట్ ఫ్లోర్ వంటివి ఉంటాయి. కేబిన్‌లో సౌకర్యవంతమైన కదలిక కోసం ఇవి ఉపయోగపడుతాయి. మొత్తానికి ఈ వాహనం.. ప్రీమియం డిజైన్‌లో ఉండి, ఆకర్షణీయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








