ఏడు నెలల్లో 1.17 లక్షల క్రెటా కార్లు.. హ్యుందాయ్ ఆ మోడల్ కు ఎదురొచ్చారో.. వెనుకబడాల్సిందే
భారతదేశంలో ఎక్కువ కార్లను విక్రయించే కంపెనీ అంటే వెంటనే గుర్తొచ్చేది మారుతి సుజుకి. అయితే, అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఏది అంటే, ఇప్పుడు సమాధానం మారిపోయింది. మారుతి కార్లను వెనక్కి నెట్టి హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఈ సంవత్సరం కేవలం మొదటి ఏడు నెలల్లోనే ఏకంగా 1.17 లక్షల కార్లను విక్రయించి క్రెటా సంచలనం సృష్టించింది.
ఈ అద్భుతమైన విజయం వెనుక ఉన్న కారణాలు, క్రెటాలోని వివిధ మోడళ్లు, వాటి ఫీచర్ల గురించి ఇప్పుడు చూద్దాం. సాధారణంగా భారత మార్కెట్‌లో అత్యధిక కార్లను విక్రయించేది మారుతి సుజుకి కంపెనీ. అయితే, అత్యధికంగా అమ్ముడైన కారుగా హ్యుందాయ్ క్రెటా నిలిచింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు హ్యుందాయ్ ఏకంగా 1,17,458 క్రెటా కార్లను విక్రయించి, రికార్డు సృష్టించింది.

ఇది గత ఏడాదితో పోలిస్తే 8 శాతం ఎక్కువ. రూ.11.11 లక్షల నుంచి మొదలయ్యే ధరతో హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కారుగా నిలిచింది. హ్యుందాయ్ క్రెటా ఈ విజయాన్ని సాధించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో పెట్రోల్, డీజిల్, టర్బోచార్జ్డ్, ఎలక్ట్రిక్ వెర్షన్లతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వైవిధ్యమైన ఆప్షన్లు కస్టమర్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.
క్రెటా పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే.. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 115 bhp పవర్, 144 Nm టార్క్ ఇస్తుంది. డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే.. 1.5 లీటర్ U2 CRDi డీజిల్ ఇంజిన్ 116 bhp పవర్, 250 Nm టార్క్ ఇస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, ఐవీటీ ఆటోమేటిక్, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

క్రెటా కేవలం ఐసీఈ మోడల్స్‌లోనే కాదు, ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. అవి 42 kWh, 51.4 kWh. 42 kWh బ్యాటరీ వేరియంట్ సింగిల్ చార్జ్ మీద ఏకంగా 390 కిలోమీటర్ల రేంజ్, 51.4 kWh బ్యాటరీ వేరియంట్ సింగిల్ చార్జ్ మీద 473 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
పవర్ విషయానికి వస్తే చిన్న బ్యాటరీ 135 bhp పవర్, పెద్ద బ్యాటరీ 171 bhp పవర్ అందిస్తుంది. పెద్ద బ్యాటరీ మోడల్ కేవలం 7.9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. హ్యుందాయ్ క్రెటా ప్రస్తుతం మొత్తం 7 వేరియంట్లలో లభిస్తుంది. అవి E, EX, S, S(O), SX, SX టెక్, SX(O).

దీని ధరలు రూ.11.11 లక్షల నుంచి రూ.20.50 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ ధరలు, ఫీచర్ల కలయికతో క్రెటా కార్ల మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








