అందరు ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది.. 473 కి.మీల రేంజ్ ఎలక్ట్రిక్ కారు డెలివరీలు స్టార్ట్
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను కస్టమర్లు ఏవిధంగా కొనుగోలు చేస్తున్నారో అందిరికి తెలిసిందే. సాంప్రదాయ పెట్రోల్, డీజిల్, CNG కార్లకు పోటీగా ఈవీల సేల్స్‌లో క్రమంగా పుంజుకుంటున్నాయి. దేశీయ వాహన తయారీ దారులు టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు ఇప్పటికే ఈ సెగ్మెంట్‌లో మార్కెట్లో అమ్మకాల పరంగా మంచి స్థానంలో ఉన్నాయి. ఇప్పటివరకు ఈవీల విభాగంలో వెనుకబడి ఉన్న మారుతీ సుజుకీ సైతం ఇటీవల తన కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. వీటన్నింటికి పోటీగా హ్యుందాయ్ కూడా వరుసగా ఈవీ కార్లను విడుదల చేస్తుంది. దక్షిణ కొరియా కంపెనీ అయిన హ్యుందాయ్ దేశంలో ఇంత కాలం ICE ఇంజిన్ వాహనాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుండగా, ఇప్పుడు తన ధోరణిని మార్చుకుని ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తుంది. తాజాగా కంపెనీ తన ప్రసిద్ధ మోడల్ క్రెటా ఈవీని తీసుకువచ్చింది.
సాధారణంగా హ్యుందాయ్ క్రెటాకు ఇండియాలో భారీ డిమాండ్ ఉంది. చాలా మంది ఈ కారును కొనుగోలు చేశారు. దీనిని మరింత అప్‌డేట్ చేసి ఈవీ వెర్షన్‌ను తీసుకువచ్చింది. తాజాగా కొత్త క్రెటా ఈవీకి సంబంధించిన డెలివరీలను కంపెనీ ప్రారంభించింది. ICE ఇంజిన్ మోడల్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న తరుణంలో ఈవీ సైతం విపరీతంగా డిమాండ్‌ను కలిగి ఉంది. ఈ కారు బుకింగ్స్‌ను గతంలోనే ఓపెన్ చేసింది.

బుకింగ్ చేసుకున్న వారు చాలా కాలంగా డెలివరీ కోసం వెయిట్ చేశారు. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ తన కస్టమర్లు అసంతృప్తి చెందకుండా ఉండటానికి వేగంగా తన ప్లాంట్‌లో ఉత్పత్తిని చేపట్టి డెలివరీలను వేగవంతం చేస్తుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కస్టమర్ల తమకు ఇష్టమైన క్రెటా ఎలక్ట్రిక్ కారును పొందటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ICE ఇంజిన్ మోడల్‌తో పాటు ఇకపై ఎలక్ట్రిక్ వెర్షన్ సైతం భారత రోడ్లపై కనిపించబోతుంది.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, ప్రీమియం, ఎక్సలెన్స్ అనే నాలుగు వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.17.99 లక్షల నుంచి మొదలుకుని టాప్ వేరియంట్ రూ.23.50 లక్షల వరకు ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ వచ్చేసి మరింత ఎక్కువగా ఉంటుంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ కారును కంపెనీ మొత్తం 10 కలర్ ఆప్షన్లలో అందిస్తుంది.

ఇది 42 kWh, 51.4 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. శక్తివంతమైన సింగిల్ మోటార్ సహాయంతో చిన్న బ్యాటరీ పూర్తి ఛార్జింగ్ ద్వారా ఇది 390 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. ఇది 135 bhp వరకు పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే పెద్ద బ్యాటరీ 51.4 kWhను పూర్తి ఛార్జింగ్ చేసినట్లయితే ఏకంగా 473 కి.మీ వరకు రేంజ్‌ను అందిస్తుందని హ్యుందాయ్ పేర్కొంది.
పెద్ద బ్యాటరీ ప్యాక్ 171 bhp వరకు పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ కేవలం 7.9 సెకన్లలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. క్రెటా ఈవీని DC ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 58 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. 11 kW AC హోమ్ ఛార్జర్ ద్వారా 10-100 శాతం ఛార్జ్ చేయడానికి 4 గంటల టైం పడుతుంది.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారులో అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. ముందు వెంటిలేటెడ్, పవర్డ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్‌లు, కొత్త స్టీరింగ్ వీల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీల కెమెరా, ఐ-పెడల్ టెక్నాలజీ, ADAS సూట్ వంటి పలు ఇతర ఫీచర్స్ దీనిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








