6 నెలల్లో 50,000 మంది కొనేశారు.. హ్యుందాయ్ వెన్యూలో అంతగా ఏముంది? ధర తగ్గడంతో మరింత క్రేజ్!
మారుతి బ్రెజా, కియా సోనెట్ వంటి బలమైన పోటీదారులు ఉన్నప్పటికీ, భారతదేశంలో హ్యుందాయ్ (Hyundai) కంపెనీ అమ్మకాలలో వెన్యూ (Venue) కాంపాక్ట్ ఎస్‌యూవీ సత్తా చాటుతోంది. హ్యుందాయ్ విడుదల చేసిన గత ఆరు నెలల (ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు) అమ్మకాల వివరాల ప్రకారం.. క్రియేటివ్ డిజైన్, మంచి మైలేజ్, అనేక ఫీచర్లతో కూడిన ఈ వెన్యూ కారును దాదాపు 50,000 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు.
అంతేకాకుండా, జీఎస్టీ తగ్గింపు కారణంగా ఈ కారు ధర ఏకంగా రూ.1.32 లక్షల వరకు తగ్గి కేవలం రూ.7.26 లక్షల ప్రారంభ ధరకే లభిస్తుండటం అమ్మకాలకు మరింత ఊతమిచ్చింది. ఇంత మందిని ఆకర్షించడానికి ఈ కారులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

హ్యుందాయ్ మోటార్స్ ఇండియాలో క్రెటా ఎస్‌యూవీ మొదటి స్థానంలో ఉండగా, కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన వెన్యూ స్థిరంగా రెండవ స్థానంలో కొనసాగుతోంది. కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత ఆరు నెలల్లో (ఏప్రిల్ 2025 నుండి సెప్టెంబర్ 2025 వరకు) వెన్యూ ఎస్‌యూవీని మొత్తం 49,978 మంది కొనుగోలు చేశారు. అంటే, నెలకు సగటున 8,329 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
గత సెప్టెంబర్ నెలలో మాత్రం ఏకంగా 11,484 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత 20 నెలల్లో అత్యధిక నెలవారీ విక్రయం కావడం విశేషం. వెన్యూ అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం జీఎస్టీ పన్ను తగ్గింపు అని చెప్పవచ్చు. ఈ కారణంగా కారు ప్రారంభ ధర గణనీయంగా తగ్గింది. గతంలో రూ.7.94 లక్షల ప్రారంభ ధరతో అమ్ముడైన ఈ కారు, ఇప్పుడు రూ.7.26 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే లభిస్తోంది. వేరియంట్‌ను బట్టి ఈ కారుపై ఏకంగా రూ.1.32 లక్షల వరకు ధర తగ్గింది.

వెన్యూ ఎస్‌యూవీ అనేక ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. మైలేజ్ కూడా ఆకర్షణీయంగా ఉంది..1.2 లీటర్ పెట్రోల్ మ్యాన్యువల్ లీటరుకు 17.52 కి.మీ, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఐఎమ్‌టి లీటరుకు18.07 కి.మీ, 1.0 లీటర్ పెట్రోల్ డీసీటీ లీటరుకు 18.31 కి.మీ, 1.5 లీటర్ డీజిల్ మ్యాన్యువల్ లీటరుకు 23.4 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
వెన్యూ ఎస్‌యూవీలో ఆధునిక టెక్నాలజీ, భద్రతా ఫీచర్లను అందిస్తున్నారు. ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, రియర్ పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి.
స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే), డిజిటల్ క్లస్టర్, కలర్ టీఎఫ్‌టీ మల్టీ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ ఇందులో ఉన్నాయి.
హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అత్యంత పోటీ మధ్య అమ్ముడవుతోంది. కియా సోనెట్, మారుతి బ్రెజా, స్కోడా కైలాక్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వంటి బలమైన మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: గత ఆరు నెలల్లో వెన్యూ సాధించిన 50 వేల అమ్మకాలు దాని ప్రజాదరణకు నిదర్శనం. ప్రస్తుతం ధరలు కూడా తగ్గిన నేపథ్యంలో, రాబోయే ఆరు నెలల్లో ఈ కారు విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








