2024లో ఎన్ని లక్షల మంది కొత్త కారు కొన్నారో తెలుసా..? నగర జనాభాకు సమానమైన రేంజ్‌లో కార్ల అమ్మకాలు
భారతీయ వాహన పరిశ్రమ ప్రతి ఏడాది వృద్ధి చెందుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో కంటే కూడా ఇండియాలో ఈ రంగం అభివృద్ధి చెందడానికి చాలా అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నాయి. కానీ భారత్‌లో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఇక్కడ పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయికి రెండింతలకు పైగా లాభం వచ్చే విధంగా అవకాశాలు ఉండటంతో దేశీయ కంపెనీలే కాకుండా విదేశాల్లో మంచి పేరున్న ప్రముఖ వాహన తయారీ కంపెనీలు సైతం భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. కొన్ని అంతర్జాతీయ సంస్థలు అయితే ఏకంగా తమ వ్యాపారాన్ని ఇక్కడ విస్తరించడానికి లోకల్‌గా ఉన్న కంపెనీలతో జట్టు కలిసి వాటా ప్రాతిపదికన పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అధునాతన ఫీచర్లు, సరికొత్త డిజైన్లతో కూడిన వాహనాలను విడుదల చేస్తు భారత్‌లో తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి.
2024 భారతీయ వాహన పరిశ్రమకు మంచి ఆశించిన ఫలితాలను అందించింది. 12 నెలల కాలంలో అదిరిపోయే కార్లు విడుదల అయ్యాయి. 2023తో పోలిస్తే 2024లో ఎక్కువ కొత్త మోడళ్లు లాంచ్ అయ్యాయి. దీంతో దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు గత ఏడాదిలో అంచనాల కంటే ఎక్కువ పుంజుకుని 43 లక్షల సేల్స్ నమోదు అయ్యాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, కియా, టయోటా వంటి కంపెనీల కార్లు విపరీతంగా అమ్ముడుపోయాయి.

ముఖ్యంగా 2024 సంవత్సరంలో దేశీయ ప్రముఖ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) 17,90,977 కార్ల అమ్మకాలతో ఇండియాలో అత్యధికంగా సేల్స్ సాధించిన కంపెనీగా టాప్ ప్లేస్‌లో నిలిచింది. 6 ఏళ్ల నాటి విక్రయాలను అధిగమించి 2024లో సేల్స్ పరంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. గతంలో 2018లో మారుతీ 17,51,919 కార్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ సారి అంతకంటే ఎక్కువ సేల్స్ సాధించడంపై కంపెనీ సంతోషం వ్యక్తం చేస్తుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో పాట, పట్టణాలు, మండల ప్రాంతాల్లో కూడా మారుతీ తన షోరూమ్‌లను తెరవడం కారణంగా అన్ని ప్రాంతాల వారికి మెరుగైన సర్వీస్ అందుతుండటంతో ఈ కార్ల సేల్స్ భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా మారుతీ కార్లు బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మోడళ్లకు అప్‌డేట్ వెర్షన్లు కూడా తీసుకురావడం మూలంగా వీటి సేల్స్ పుంజుకుంటున్నాయి.

మరో దిగ్గజ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా(Hyundai Motor India) 2024లో దేశీయ సేల్స్‌లో సరికొత్త గణంకాలను నమోదు చేసింది. 2024 ఏడాదిలో ఈ కంపెనీ కార్లు మొత్తంగా 6,05,433 అమ్ముడుపోయాయి. హ్యూందాయ్ గత సంవత్సరం అదిరిపోయే మోడళ్లను విడుదల చేసింది. దీంతో అమ్మకాలు పెరగడానికి ఈ కొత్త మోడళ్లు బాగా ఉపయోగపడ్డాయి. తర్వాత టాటా మోటార్స్ కూడా 2024 ఏడాదికి మెరుగైన అమ్మకాలతో ముగింపు పలికింది.
వరుసగా నాలుగో ఏడాది టాటా మోటార్స్ (Tata Motors) రికార్డు స్థాయిలో ఏకంగా 5.65 లక్షల కార్ల విక్రయాలను సాధించింది. సేఫ్టీ పరంగా అత్యంత నమ్మకమైన కార్లను తయారు చేసే కంపెనీగా పేరున్న టాటా మోటార్స్ 2024 ఏడాదిలో పలు కీలక మోడళ్ళను విడుదల చేసింది. ముఖ్యంగా పండుగ సమయంలో ఇచ్చిన ఆఫర్ల కారణంగా అక్టోబర్ నెలలో కంపెనీ అమ్మకాలు బాగా వృద్ధి చెందాయి.

కియా ఇండియా (Kia India) 2024 ఏడాదిలో 6 శాతం వృద్ధి రేటుతో మొత్తం 2,55,038 యూనిట్ల కార్లను విక్రయించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) కూడా గత ఏడాదిలో ఆశించిన అమ్మకాలను సాధించింది. కంపెనీ 2024లో 3,26,329 కార్లను విక్రయించగా, ఇది గత ఏడాది 2,33,346 యూనిట్లుగా ఉంది. ఇవే కాకుండా ఇతర ప్రధన కంపెనీలు కూడా 2024లో మెరుగైన సేల్స్ సాధించాయి.


Click it and Unblock the Notifications








