30 కి.మీకి పైగా మైలేజ్ ఇచ్చే భారతదేశపు బెస్ట్ కార్లు ఇవే! రూ.6 లక్షల్లోనే వచ్చేస్తున్నాయ్
భారతీయ ఆటోమొబైల్ రంగంలో బడ్జెట్ కార్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు మారుతుండటం, జీవన వ్యయాలు పెరగడం వంటివి వినియోగదారులను ఖర్చు పై శ్రద్ధ పెట్టేలా చేస్తాయి. అంతేకాదు, తక్కువ ఖర్చుతో ఎక్కువ విలువ పొందాలనే ఆలోచన మరింత పెరిగింది. ఇలాంటి సందర్భాల్లో తక్కువ ధర, మంచి మైలేజ్, అందమైన డ్రైవింగ్ అనుభూతి కలిగించే కార్లకు మార్కెట్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. కుటుంబ ప్రయాణాలకు సరిపోయేంత స్థలం, ఆర్థికంగా భారం కాకుండా ఉండేలా ధర, సర్వీస్ నెట్‌వర్క్ వంటి అంశాలే చాలామంది ఎంపికను ప్రభావితం చేస్తాయి. ఈ విభాగంలో మారుతి సుజుకి సెలెరియో, ఆల్టో K10, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ వంటి కార్లు వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకున్న మోడల్స్. వాటి గురించి ఈ కథనంలో చూద్దాం.
Maruti Suzuki Celerio: మారుతి సుజుకి సెలెరియో చూడటానికి చిన్న కారులా ఉన్నప్పటికి పనితీరులో అద్భుతంగా ఉంటుంది. మధ్యతరగతి భారతీయ కుటుంబాలకు అందుబాటు ధరలో, మంచి ఫీచర్లతో, మైలేజ్‌తో అందించబడుతున్న కారుగా సెలెరియో మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రస్తుతం ఈ కారు రూ.5.64 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ.7.37 లక్షల వరకు వెళుతుంది (ఎక్స్-షోరూమ్).

ఈ కారు 1.0-లీటర్ K10C పెట్రోల్ ఇంజిన్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో పాటు ఆటోమెటిక్ గేర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది CNG వేరియంట్‌లో కూడా లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్లు 25.17 కి.మీ నుండి 26.23 కి.మీ వరకు మైలేజ్ ఇస్తే, CNG వేరియంట్ సగటుగా 28 కి.మీ, కొన్ని నివేదికల ప్రకారం 34.43 కి.మీ వరకు మైలేజ్ ఇచ్చే సామర్థ్యం ఉంది.
Maruti Suzuki Alto K10: మారుతి సుజుకి ఆల్టో K10 కేవలం ధరలో కాకుండా, పనితీరులోనూ, వినియోగదారుల నమ్మకంలోనూ టాప్‌లో నిలుస్తోంది. దీని ధర రూ.4.23 లక్షల బేస్ వేరియంట్ నుండి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ రూ.6.21 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది శక్తివంతమైన 1.0 లీటర్ 3-సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంది. డ్రైవింగ్ అనుభూతిని మెరుగుపరిచేలా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, స్మూత్ ట్రాన్స్మిషన్ కోసం AMT కూడా అందుబాటులో ఉంది.

పెట్రోల్ మాత్రమే కాకుండా, CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉండటం దీనికి మరో పెద్ద ప్లస్ పాయింట్. మైలేజ్ పరంగా పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ 24.39 కి.మీ, పెట్రోల్ AMT 24.90 కి.మీ, CNG మాన్యువల్ 33.85 కి.మీ/కిలో ఇంధనానికి ఇస్తుంది. అందుకే, మొదటి కారుగా కొనాలనుకునే వారికి, లేక ఫ్యామిలీలోకి మరో బడ్జెట్ కారు తేవాలనుకుంటే ఆల్టో K10 ఓ హిట్ చాయిస్‌గానే నిలుస్తోంది.
Hyundai Grand i10 Nios: హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ స్టైల్, కంఫర్ట్, ఫీచర్లు అన్నింటినీ బడ్జెట్ పరిధిలో సమానంగా అందించే హ్యాచ్‌బ్యాక్. ఈ మోడల్‌కి సంబంధించిన ధరలు రూ. 5.98 లక్షల బేస్ వేరియంట్ నుండి ప్రారంభమవుతాయి, టాప్ వేరియంట్ అయితే రూ. 8.62 లక్షల వరకు వెళుతుంది (సగటు ఎక్స్-షోరూమ్). ఇందులో 1.2-లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ (NA) పెట్రోల్ ఇంజిన్ ఉంది.

ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, AMT (ఆటోమేటిక్) ట్రాన్స్‌మిషన్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇదే కాకుండా, ఈ కారుకు CNG వేరియంట్ కూడా లభిస్తుంది. మైలేజ్ విషయానికొస్తే, CNG మాన్యువల్ వేరియంట్ సుమారు 27 కి.మీ, పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ సుమారు 18 కి.మీ, పెట్రోల్ AMT వేరియంట్ సుమారు 16 కి.మీ వరకు ఇస్తుంది.


Click it and Unblock the Notifications








