పెట్రోల్ యుగం ముగిసే రోజులు దగ్గర్లోనే.. ఆరు నెలల్లో 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసిన ఈవీలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వేగంగా జరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు ఇప్పుడు మరింత ఆర్థికమైన, పర్యావరణహితమైన ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు. దీనివల్ల భారత ఆటోమొబైల్ రంగంలో ఒక కొత్త యుగం ప్రారంభమైందని చెప్పొచ్చు. టాటా మోటార్స్, మహీంద్రా, ఎంజీ మోటార్, బివైడి వంటి దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తమ స్థానాన్ని బలపరుచుకున్నాయి. ఈ కంపెనీలు కొత్త మోడళ్లను, మెరుగైన రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయాలను అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంటున్నాయి. టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV400, MG ZS EV, బివైడి సీల్, హ్యుందాయ్ ఐయోనిక్ 5 వంటి మోడళ్లు మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి.
భారత మార్కెట్ సామర్థ్యాన్ని గుర్తించి, ప్రపంచ దిగ్గజ సంస్థలు కూడా ఇప్పుడు భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయి. అమెరికాకు చెందిన టెస్లా, వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ ఇప్పటికే దేశంలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. వీటివల్ల భారత ఎలక్ట్రిక్ వాహన రంగానికి మరింత పోటీ, మరింత ఆధునిక సాంకేతికతలు, పెట్టుబడులు లభిస్తున్నాయి. తాజాగా ఈవీల సేల్స్‌కు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.

తాజా నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో (ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు) భారతదేశంలో 1 మిలియన్ కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించబడ్డాయి. ఇది ఇప్పటి వరకు నమోదైన అత్యధిక సంఖ్యగా భావించబడుతోంది. ఈ సంఖ్య భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు దూసుకెళ్తోందని, పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక పురోగతిలో ఒక పెద్ద ముందడుగుగా నిలుస్తోందని స్పష్టంగా తెలియజేస్తోంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగం (ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు)లో దేశవ్యాప్తంగా మొత్తం 11 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించబడ్డాయి. గత సంవత్సరం ఇదే కాలంలో అమ్మకాలు 8.95 లక్షల యూనిట్లు మాత్రమే ఉండగా, ఈసారి అదనంగా 2.05 లక్షల వాహనాలు ఎక్కువగా విక్రయించబడ్డాయి. ఈ వృద్ధి రేటు 22.9 శాతంగా నమోదైంది.

ఇది ఎలక్ట్రిక్ వాహనాలపై భారత వినియోగదారుల విశ్వాసం పెరుగుతున్నదనాన్ని స్పష్టంగా సూచిస్తోంది. అయితే, నెల వారీగా చూసినప్పుడు కొంత చలనం కూడా కనిపిస్తోంది. 2025 సెప్టెంబర్ నెలలో 1.82 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవగా, ఆగస్టులో 1.88 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో అమ్మకాలు 3.3 శాతం తగ్గాయి. కేవలం ఎలక్ట్రిక్ కార్ల విభాగాన్ని తీసుకున్నా కూడా అమ్మకాలలో స్వల్ప వెనుకడుగు ఉంది.
ఆగస్టు 2025లో 18,290 యూనిట్లు అమ్ముడవగా, సెప్టెంబర్‌లో 15,100 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి. అంటే, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు నెల వ్యవధిలోనే 17.4 శాతం తగ్గాయి. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం కార్ల అమ్మకాలలో ఎలక్ట్రిక్ కార్ల వాటా 4 నుండి 5 శాతం మధ్యే ఉంది. గత నెలలో ఈవీల వాటా తక్కువ కావడానికి GST పన్ను తగ్గింపు ఒక ప్రధాన కారణం అని చెప్పవచ్చు.

పెట్రోల్, డీజిల్ వాహనాలపై GST ని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో వీటి ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. దీంతో కొత్తగా కారు కొనుగోలు చేసే వారు వీటినే ఎక్కువగా ఎంచుకున్నారు. అదే సమయంలో ఈవీలను తక్కువగా కొనుగోలు చేయడంతో కొనగోళ్లు తగ్గాయి. అయితే, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగవంతమైన అభివృద్ధి, కొత్త మోడళ్ల ఆవిష్కరణలతో ఈ వాటా రాబోయే సంవత్సరాల్లో మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








