ఇండియాలో ఫస్ట్ టెస్లా కారు డెలివరీ.. అందుకున్నది ఎవరో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ప్రముఖ కంపెనీ టెస్లా (tesla) ఇటీవల అధికారికంగా భారత మార్కెట్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఎలాన్ మస్క్ యాజమాన్యంలో నడుస్తున్న ఈ సంస్థ, తన అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ టెస్లా మోడల్ Yను భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే భారత్‌లో టెస్లా షోరూమ్ ప్రారంభమై ఒక నెల దాటక ముందే, కంపెనీ తన తొలి వాహనాన్ని కస్టమర్‌కి డెలివరీ చేయడం విశేషం. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసిన ఆధునిక టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఈ చారిత్రాత్మక క్షణం చోటుచేసుకుంది. ఈ వేడుకలో మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ తన స్వంత టెస్లా మోడల్ Y కారును స్వీకరించారు. ఈ విషయాన్ని ఎక్స్ అకౌంట్లో ఆయన తెలిపారు.
తెల్లటి రంగులో మెరిసిపోతున్న కారు, లగ్జరీ, టెక్నాలజీ కలయికగా అందరినీ ఆకర్షించింది. మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ తన టెస్లా మోడల్ Y కారును స్వీకరించిన సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి టెస్లా కారును అందుకున్నందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇది నాకు గర్వకారణం. ఈ కారును నేను ఎటువంటి తగ్గింపు లేకుండా, పూర్తి మొత్తాన్ని చెల్లించి కొన్నానని అన్నారు.

నా మనవడిని ప్రతిరోజూ పాఠశాలకు తీసుకెళ్లడానికి ఈ టెస్లాను ఉపయోగించాలని అనుకుంటున్నాను. మేము దీన్ని రోజువారీ అవసరాలకు, ఇతర కుటుంబ అవసరాలకు కూడా ఉపయోగిస్తాము. దీనివల్ల మరింత మంది ఈ కారును చూసి, ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపించి, వాటిని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారని ఆయన తెలిపారు. టెస్లా మొట్టమొదటి ఇండియా మోడల్ వై కారు భారతీయ రోడ్లపై ఇప్పుడు పరుగులు పెట్టనుంది.
ఆయన కొనుగోలు చేసిన కారు ఏ వేరియంట్ అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ ప్రారంభ డెలివరీతో టెస్లా కేవలం లగ్జరీ కార్ బ్రాండ్‌గా కాకుండా, భారత ఆటోమొబైల్ రంగంలో భవిష్యత్తు మార్పుల దిశను నిర్ధేశించే శక్తిగా నిలిచింది. త్వరలో మరిన్ని డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశముంది. దీని ద్వారా భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. భారత మార్కెట్‌లో టెస్లా ప్రవేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇది భారత EV రంగానికి కొత్త దిశ చూపించే మోడల్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే భారతదేశంలో టెస్లాకు మొదటి కారుకు ఇప్పటి వరకు 600 బుకింగ్స్ మాత్రమే వచ్చాయని ఇటీవల బ్లూమ్‌బెర్గ్ నివేదించిన విషయం తెలిసిందే. ఇది కంపెనీ అంచనాలకు తగ్గట్టు లేకపోవడం గమనార్హం. డిమాండ్ మేరకు టెస్లా ఈ ఏడాది ఇండియాలోకి 350 నుండి 500 కార్లను రవాణా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
టెస్లా ఇండియాకు తన కార్లను చైనా (షాంఘై)లోని తమ ఆధునిక తయారీ ప్లాంట్‌లో పూర్తిగా అసెంబుల్ చేసి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) రూపంలో దిగుమతి చేసుకుని భారత మార్కెట్‌లో విక్రయాలను ప్రారంభించింది . టెస్లా మోడల్ Yను కంపెనీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో మొదటిది రేర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్. దీని ధర సుమారు రూ. 59.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

దీనిని ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే ఈ కారు దాదాపు 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉండటం విశేషం. ఈ ధరలో లగ్జరీ, సౌకర్యం, ఎలక్ట్రిక్ పవర్ అన్నీ కలిపి వినియోగదారుల కోసం అందించడం టెస్లా ప్రత్యేకత. ఇక రెండో వేరియంట్ Long Range RWD. దీని ధర రూ. 67.89 లక్షలు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 622 కిలోమీటర్ల దూరం నిరాటంకంగా ప్రయాణించగలదు.


Click it and Unblock the Notifications








