దేశంలో ఎక్కువగా కొంటున్న బెస్ట్ 7 సీటర్ కారు ఇదే.. ఆగస్టు టాప్ 10 7-సీటర్ కార్ల లిస్ట్‌పై ఓ లుక్కేయండి
భారతదేశంలో ప్రస్తుతం కార్ల వినియోగం వేగంగా పెరుగుతోంది. ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే సరిపడే కార్ల కంటే, మొత్తం కుటుంబం కలసి ప్రయాణించడానికి వీలయ్యే వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా వీకెండ్ ట్రిప్స్, ఫ్యామిలీ వెకేషన్స్, లాంగ్ డ్రైవ్స్ కోసం 7-సీటర్ కార్లు చాలా మంది ఫ్యామిలీలకు బెస్ట్ ఆప్షన్‌గా మారాయి. బడ్జెట్ ధరల్లోనే మంచి స్పేస్, కంఫర్ట్, మైలేజ్ ఇస్తుండటంతో వీటి మీద డిమాండ్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇటీవల ఆగస్టు నెల అమ్మకాల గణాంకాలు కూడా అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. గత నెలలో 7-సీటర్ వాహనాల విక్రయాలు గణనీయంగా నమోదయ్యాయి. మార్కెట్లోని విభిన్న బ్రాండ్లు, విభిన్న సెగ్మెంట్లలో లభించే మోడళ్లు ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కార్లు అన్నీ బాగా ఆమోదం పొందాయి.
టాప్ 10 లిస్టులోకి వచ్చిన మోడళ్లను పరిశీలిస్తే, ఒక్కో వాహనం తన ప్రత్యేకతలతో, ఫీచర్లతో వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. ఎవరికి మైలేజ్ కావాలో వాళ్లు సరిగ్గా ఆప్షన్ ఎంచుకున్నారు. ఎవరికి సేఫ్టీ, కంఫర్ట్, లగ్జరీ కావాలో వాళ్లు తమ బడ్జెట్‌కు తగ్గట్లు ఎంపిక చేసుకున్నారు. ఫలితంగా, 7-సీటర్ వాహనాల కేటగిరీ ఇప్పుడు ఆటోమొబైల్ మార్కెట్లో కీలక స్థానాన్ని సంపాదించుకుంది. టాప్ 10, 7-సీటర్ కార్లను కింది కథణంలో చూద్దాం.

ఈ జాబితాలో అగ్రస్థానాన్ని మరోసారి మారుతి ఎర్టిగా దక్కించుకుంది. ఆగస్టు నెలలో మాత్రమే 18,445 యూనిట్లు విక్రయమవడంతో ఇది 7-సీటర్ సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే, గత సంవత్సరం ఇదే నెలలో ఎర్టిగా 18,580 యూనిట్లను అమ్మిన సంగతి గుర్తుచేసుకుంటే, ఈసారి అమ్మకాలు స్వల్పంగా 1 శాతం తగ్గినట్లు గమనించవచ్చు. అయినప్పటికీ, స్పేస్, మైలేజ్ కారణంగా ఎర్టిగా మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
రెండో స్థానాన్ని మహీంద్రా స్కార్పియో సంపాదించింది. స్కార్పియో SUV ఆగస్టులో 9,840 యూనిట్లు అమ్ముడవ్వడం ద్వారా టాప్-3లోకి వచ్చింది. అయితే, గత సంవత్సరం ఇదే నెలలో 13,787 యూనిట్లు అమ్ముడవ్వడం గమనిస్తే, ఈసారి అమ్మకాలు 29 శాతం పడిపోయాయి. దీనికి మార్కెట్లో కొత్త మోడళ్ల ప్రవేశం, కాంపిటీషన్ పెరగడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. అయినప్పటికీ స్కార్పియో తన క్రేజ్‌ను ఇంకా కొనసాగిస్తోంది.

మూడో స్థానంలో టయోటా ఇన్నోవా నిలిచింది. ఇన్నోవా ఆగస్టులో 9,304 యూనిట్లు అమ్ముడవ్వడం ద్వారా డిమాండ్‌ను నిరూపించుకుంది. అయితే, గత ఏడాది ఇదే నెలలో 9,687 యూనిట్లు అమ్ముడవ్వడం గమనిస్తే, ఈసారి అమ్మకాలు 4 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. జాబితాలో నాలుగో స్థానాన్ని మహీంద్రా బొలెరో దక్కించుకుంది. ఆగస్టులో 8,109 యూనిట్లు అమ్ముడైంది. గత ఏడాది ఇదే నెలలో 6,494 యూనిట్లు అమ్ముడవ్వడం గమనిస్తే, అమ్మకాలు 25 శాతం పెరిగాయి.
ఐదో స్థానంలో కియా కారెన్స్ నిలిచింది. ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ 7-సీటర్ MPV ఆగస్టులో 6,822 యూనిట్లు విక్రయించగా, గత ఏడాది ఇదే నెలలో 5,881 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే, ఈసారి అమ్మకాలు 7 శాతం వృద్ధి చెందాయి. ఆరవ స్థానంలో మహీంద్రా XUV700 నిలిచింది. ఆగస్టులో 4,956 యూనిట్లను మాత్రమే అమ్ముకోగలిగింది. గత ఏడాది ఇదే నెలలో 9,007 యూనిట్లతో అమ్మకాలు 45 శాతం తగ్గాయి.

ఏడో స్థానాన్ని మారుతి XL6 సంపాదించింది. ఆగస్టులో 2,973 యూనిట్లు అమ్ముడవ్వగా, గత ఏడాది ఇదే నెలలో 2,740 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 9 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎనిమిదో స్థానంలో టయోటా ఫార్చ్యూనర్ నిలిచింది. ఆగస్టులో 2,508 యూనిట్లు అమ్ముడవ్వగా, గత ఏడాది ఇదే నెలలో 2,338 యూనిట్లు విక్రయమయ్యాయి. ఇది 7 శాతం పెరుగుదల.
తొమ్మిదో స్థానంలో రెనాల్ట్ ట్రైబర్ నిలిచింది. ఆగస్టులో 1,870 యూనిట్లు అమ్ముడవ్వగా, గత ఏడాది ఇదే నెలలో 1,514 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీని వలన 24 శాతం వృద్ధి నమోదైంది. పదో స్థానంలో టాటా సఫారీ నిలిచింది. గత ఏడాది ఇదే నెలలో 1,951 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈసారి 1,489 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. అంటే, అమ్మకాలు 24 శాతం తగ్గాయి.


Click it and Unblock the Notifications








