డిస్కౌంట్లు ఇచ్చినా కొనేవారు లేరు.. భారత్‌లో అతి తక్కువగా అమ్ముడైన 10 కార్లు ఇవే..లిస్టులో పెద్ద కంపెనీలు కూడా
సాధారణంగా ఆటోమొబైల్ రంగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే మార్కెట్లో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించలేక అతి తక్కువ అమ్మకాలతో నిరాశపరిచిన మోడళ్లు కూడా కొన్ని ఉన్నాయి. భారీ డిస్కౌంట్‌లు ఆఫర్ చేసినా కూడా ఈ కార్లను కొనేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదు. సెప్టెంబర్ 2025 నెలలో భారతదేశంలో అతి తక్కువగా అమ్ముడైన 10 కార్ల వివరాలను గాడివాడి నివేదిక విడుదల చేసింది.
ఈ జాబితాలో రూ.35 లక్షల లోపు ధర కలిగిన మోడళ్లను మాత్రమే పరిగణించారు. ఈ లిస్ట్‌లో మారుతి సుజుకి, మహీంద్రా, టయోటా వంటి ప్రధాన సంస్థల నుండి ఒక్కో మోడల్ ఉండగా.. సిట్రాన్, జీప్ బ్రాండ్‌ల నుండి మొత్తం ఐదు కార్లు ఉన్నాయి. అత్యంత తక్కువగా అమ్ముడైన ఆ 10 కార్లు ఏవో వివరంగా చూద్దాం.

మారుతి సుజుకి, మహీంద్రా, ఎంజీ, టయోటా సంస్థల నుంచి ఒక్కో మోడల్ ఈ తక్కువ అమ్మకాల జాబితాలో నిలిచాయి. తక్కువ విక్రయాల జాబితాలో ఆఖరి రెండు స్థానాల్లో సిట్రాన్ కంపెనీకి చెందిన రెండు మోడళ్లు ఉండటం ఆ సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ.

సిట్రాన్ సంస్థ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ అయిన సిట్రాన్ eC3, సెప్టెంబర్ 2025లో కేవలం 17 యూనిట్లు మాత్రమే అమ్ముడై, అతి తక్కువ విక్రయాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. గత సంవత్సరం సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 39% అమ్మకాల క్షీణతను చూపించింది.
రెండవ స్థానంలో కూడా సిట్రాన్ నుండి వచ్చిన ఎస్‌యూవీ సిట్రాన్ ఎయిర్‌క్రాస్ ఉంది. ఇది 59 యూనిట్లు అమ్ముడైంది. అయితే, ఇది గత సంవత్సరం కంటే 44% వార్షిక వృద్ధిని సాధించింది.

జాబితాలోని ఇతర మోడళ్ల అమ్మకాలు చూస్తే కొన్ని సంస్థలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎంజీ ఆస్టర్ ఎస్‌యూవీ అమ్మకాలు ఏకంగా 88% పతనమై కేవలం 90 యూనిట్లు అమ్ముడయ్యాయి. అలాగే, మహీంద్రా XUV400 ఈవీ అమ్మకాలు 84% క్షీణించి 149 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ పతనాన్ని ఆయా కంపెనీలు తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది.
జీప్ కంపెనీకి చెందిన కాంపాస్ అమ్మకాలు 55% పడిపోయి 140 యూనిట్లు అమ్ముడవగా, జీప్ మెరిడియన్ అమ్మకాలు మాత్రం 100% పెరిగి 110 యూనిట్లు అమ్ముడయ్యాయి. మారుతి సుజుకి నుండి ఇన్విక్టో ఎంపీవీ 215 యూనిట్లు అమ్ముడవగా, టయోటాకు చెందిన హైలక్స్ పిక్-అప్ ట్రక్ 219 యూనిట్లతో జాబితాలో పదవ స్థానంలో నిలిచింది. ట్యూసోన్ కూడా 85 యూనిట్ల అమ్మకాలతో మూడవ స్థానంలో ఉంది.

హ్యుందాయ్ ట్యూసోన్, మారుతి ఇన్విక్టో, టయోటా హైలక్స్ వంటి కార్లు అధిక ధర కలిగినవి కాబట్టి, వాటి అమ్మకాలు తక్కువగా ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అయితే ఎంజీ ఆస్టర్, మహీంద్రా XUV400 ఈవీ వంటి మోడళ్లలో ఇంత భారీ క్షీణత కనిపించడం మాత్రం తయారీదారులకు ఆందోళన కలిగించే విషయం. స్టెల్లాంటిస్ గ్రూప్‌కు చెందిన సిట్రాన్, జీప్ బ్రాండ్‌లు కూడా భారత మార్కెట్‌లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవడంలో ఇంకా వెనుకబడే ఉన్నాయి.


Click it and Unblock the Notifications








