ఒక్కసారి ఛార్జ్ చేస్తే 263 కి.మీ.లు ప్రయాణించవచ్చు.. ప్రయాణికులతో పాటు సరుకులను తీసుకెళ్లొచ్చు
జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ఇసుజు కంపెనీ తన మొట్టమొదటి పూర్తిగా ఎలక్ట్రిక్ వన్-టన్ పికప్ ట్రక్ - D-Max EVని తీసుకొచ్చింది. ఇటీవల దీనిని యునైటెడ్ కింగ్‌డమ్‌లో జరిగిన 2025 కమర్షియల్ వెహికల్ షోలో ఆవిష్కరించడం ద్వారా, ఎలక్ట్రిక్ వాహనాల దిశగా ఓ కీలకమైన ముందడుగు వేసింది. ఈ ఎలక్ట్రిక్ పికప్‌ను మొదట థాయిలాండ్‌లో తయారు చేస్తోంది. ఇటీవలి కాలంలో పికప్ ట్రక్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ మోడల్ మార్కట్లో బాగా అమ్మకాలను సాధించే అవకాశం ఉంది. ఇసుజు తన తొలి ఎలక్ట్రిక్ వాహనం, D-Max EVను ప్రస్తుత డీజిల్-ఆధారిత డి-మాక్స్ డిజైన్‌కు అనుగుణంగా, కాని ఆధునిక ఎలక్ట్రిక్ టచ్‌తో రూపొందించింది. ఈ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ మొదటిగా డబుల్ క్యాబ్ వేరియంట్‌లో అందించబడుతోంది.
ఇది ఈ తరహా వాహనాలలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజైన్‌గా పరిగణించబడుతుంది. అలాగే, విస్తరించిన క్యాబ్ వెర్షన్ కూడా లభిస్తుంది, ఇది వాణిజ్య అవసరాలతో పాటు వ్యక్తిగత అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. వినియోగదారుల విభిన్న అవసరాలకు ఇది సరిపోయేలా రూపుదిద్దుకుంది. ఈ లాంచ్ ద్వారా ఇసుజు తన సంప్రదాయ శక్తి ఆధారిత వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వైపు అడుగులు వేస్తుందని స్పష్టమవుతోంది.

ఇసుజు-డి మాక్స్ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కు మునుపటి డీజిల్ మోడల్‌లో ఉపయోగించిన కొన్ని అంశాలను పొందుతుంది. ఇది ముందు భాగంలో కొత్తగా డిజైన్ చేయబడిన LED హెడ్‌ల్యాంపులు, మూసివేసిన గ్రీల్ డిజైన్, అలాగే ఆకర్షణీయంగా మెరిసే డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ వంటివి ఈ మోడల్‌కు ఒక తాజా లుక్‌ను అందిస్తున్నాయి. ఈ మార్పులు వాహనానికి ఒక స్పోర్టీ లుక్‌ను ఇవ్వడమే కాకుండా, దాని ఎలక్ట్రిక్ లుక్‌ను కూడా హైలైట్ చేస్తాయి.
ఇసుజు D-Max EV డబుల్ క్యాబ్, ఎక్స్‌టెండెడ్ క్యాబ్ అనే రెండు ప్రధాన ట్రిమ్‌ల్లో అందుబాటులో ఉంటుంది. ఇది వినియోగదారులకు వారి అవసరాలకు అనుగుణంగా సరైన దాన్ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇది శక్తివంతమైన 66.9 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌తో అభివృద్ధి చేయబడింది. బ్యాటరీని డ్యూయల్ మోటార్ సెటప్‌కు అనుసంధానించారు. ఇది రెండు చక్రాలకు బలాన్ని సమానంగా పంపిస్తూ, అన్నివైపులా ప్రభావవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

ఈ మోటార్ సెటప్ 190 హార్స్‌పవర్ శక్తిని, 325 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పనితీరు పరంగా ICE మోడళ్లకు దీటుగా ఉంటుంది. ఇసుజు ప్రకారం, D-Max EV 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 10.1 సెకన్లలో అందుకోగలదు. అంతేకాకుండా దీని టాప్ స్పీడ్ వచ్చేసి 128 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఇది దాదాపు 263 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
ఎక్కువ దూరం ప్రయాణాలు చేయాల్సిన వినియోగదారుల కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, ముఖ్యంగా నగరాల మధ్య వ్యాపార అవసరాలకు ఇది మరింత సరైన ఎంపిక. దీని బ్యాటరీని 50 kW DC ఛార్జర్‌ని ఉపయోగించి ఒక గంటలోపు 20 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే సమయంలో, AC ఛార్జర్‌తో పూర్తిగా ఛార్జ్ చేయడానికి పది గంటలు పడుతుంది.

కుడిచేతి డ్రైవ్ ఎడిషన్ ఉత్పత్తి ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశముంది. అయితే, కస్టమర్లకు డెలివరీలు మాత్రం 2026 మార్చి నుండి ప్రారంభమవుతాయని సంస్థ స్పష్టం చేసింది. అయితే, భారత మార్కెట్ విడుదల విషయానికి వస్తే, ప్రస్తుతానికి దీన్ని ఇక్కడ లాంచ్ చేయకపోవచ్చు. అయితే డిమాండ్‌ను బట్టి మారుతున్న ట్రెండ్ ప్రకారం, ఈ అభిప్రాయంలో మార్పులు ఉండే అవకాశం కూడా ఉండవచ్చు.


Click it and Unblock the Notifications








