రెండూ తోపు కార్లే.. అయితే బెస్ట్ ఎవరో మీరే తేల్చాలి! కారెన్స్ క్లావిస్ Ice vs క్లావిస్ EV
దక్షిణ కొరియా బ్రాండ్ కియా మోటార్స్ (Kia Motors) ఇండియాలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి దేశీయ దిగ్గజ తయారీదారులకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం కియా కార్లు ఢిల్లీ నుంచి మొదలుకుని గల్లీ వరకు కనిపిస్తున్నాయి. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ఆధారిత కార్లను విడుదల చేస్తూనే, అదే సమయంలో ఎలక్ట్రిక్ వేరియంట్లపై కూడా ప్రస్తుతం దృష్టి సారిస్తుంది. అందులో భాగంగా ఒక మోడల్‌ను ఇంధన ఆధారితంగా లాంచ్ చేసిన కొద్ది రోజుల తరువాత అదే కారులో మార్పులు చేసి ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చి ఎలక్ట్రిక్ మోడల్‌లో తీసుకొస్తుంది.
ఈ క్రమంలో ఇటీవల కియా కంపెనీ కారెన్స్ క్లావిస్ (Carens Clavis) పేరుతో రెండు వెర్షన్లను మార్కెట్లోకి తెచ్చింది. కారెన్స్ క్లావిస్ ఐసీఈ (ICE), కారెన్స్ క్లావిస్ ఎలక్ట్రిక్ (EV) కార్లు ప్రస్తుతం కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు వేరియంట్లూ వేర్వేరు అవసరాలకు, వేర్వేరు కస్టమర్లకు అనుకూలంగా రూపకల్పన చేయబడ్డాయి. ఇప్పుడు ఈ రెండింటి గురించి ఈ కథనంలో చూద్దాం.

కారెన్స్ క్లావిస్ ఐసీఈ: ఈ కారును వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో అందిస్తున్నారు. ఇందులో ముందుగా 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది సాఫీగా నడిచే రోడ్ల కోసం అనుకూలంగా ఉంటుంది. మెరుగైన మైలేజ్‌ను ఆశించే వారికి ఇది మంచి ఎంపిక. అలాగే, ఎక్కువ శక్తి, పవర్‌ను కోరుకునే యూజర్ల కోసం 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తున్నారు.
ఇక దూర ప్రయాణాలు చేయాలనుకునే వారికి, అధిక టార్క్‌ను అవసరపడే వారికి డీజిల్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది, అదే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఈ మూడింటికి కూడా భిన్నమైన ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. ట్రెడిషనల్‌కు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందిస్తారు. డీజిల్ వేరియంట్లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, టర్బో పెట్రోల్ వేరియంట్లో మాత్రం 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. iMT గేర్‌బాక్స్‌ను కూడా అందిస్తున్నారు.

ప్రస్తుతం కియా కారెన్స్ క్లావిస్ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.50 లక్షలు. ఆన్‌రోడ్ వచ్చేసరికి దాదాపు రూ.14.21 లక్షల వరకు ఉంటుంది. దీనిలో టాప్ ఎండ్ వేరియంట్ అయితే ఏకంగా రూ.26 లక్షల ఆన్‌రోడ్ ధర వరకు ఉండే అవకాశం ఉంది. దీని మైలేజ్ విషయానికి వస్తే, 19 లేదా 20 కి.మీ వరకు వస్తుంది. అయితే ఇది రోడ్ పరిస్థితులు, డ్రైవింగ్ కండిషన్‌ను బట్టి మారుతుంది.
కారెన్స్ క్లావిస్ ఈవీ: ఇది సంప్రదాయ ఇంధనాలైన పెట్రోల్ లేదా డీజిల్‌తో పోలిస్తే తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణ లాభాన్ని చేకురుస్తుంది. కియా తన తొలి మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ MPVగా క్లావిస్ EVను మార్కెట్‌కి పరిచయం చేసింది. ఇది కేవలం ఎలక్ట్రిక్ వాహనంగానే కాకుండా, మధ్యతరగతి కుటుంబాల కలల కారు. ధర పరంగా చూస్తే రూ.17.99 లక్షల నుంచి రూ.24.49 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్)గా ఈ మోడల్‌కి నిర్ణయించారు.

ఈ ఎలక్ట్రిక్ MPVలో రెండు భిన్నమైన బ్యాటరీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మొదటిది 42 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, ఇది ARAI ధృవీకరణ ప్రకారం ఒక్క ఛార్జ్‌తో 404 కిలోమీటర్ల ప్రయాణదూరాన్ని అందించగలదు. సాధారణ డే టు డే డ్రైవింగ్, సిటీ ప్రయాణాలకు ఇది బెస్ట్. దీన్నే మించి శక్తివంతమైన 51.4 kWh బ్యాటరీ వేరియంట్ కూడా ఉంది, ఇది ఒక్క ఛార్జ్‌తో 490 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.
| కారెన్స్ క్లావిస్ ఐసీఈ | కారెన్స్ క్లావిస్ ఈవీ | |
| ఇంజిన్ / బ్యాటరీ | 1.5L NA పెట్రోల్, 1.5L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ | 42 kWh & 51.4 kWh లిథియం-ఐయాన్ బ్యాటరీలు |
| ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు | 6-Speed MT, 6-Speed iMT, 6-Speed టార్క్ కన్వర్టర్, 7-Speed DCT | ఆటోమేటిక్ |
| రేంజ్ / మైలేజ్ | సుమారుగా 19-20 kmpl (రోడ్ పరిస్థితులపై ఆధారపడి మారుతుంది) | 404 కిలోమీటర్లు (42 kWh), 490 కిలోమీటర్లు (51.4 kWh) |
| ధర (ఎక్స్-షోరూమ్) | రూ.11.50 లక్షల నుండి రూ.19 లక్షల వరకు | రూ.17.99 లక్షల నుండి రూ.24.49 లక్షల వరకు |


Click it and Unblock the Notifications








