కారు రీసేల్ వ్యాల్యూ పెంచేందుకు కియా మాస్టర్ ప్లాన్.. ఏం చేయాలో అర్థంకాక తలపట్టుకుంటున్న మిగతా కంపెనీలు
కారు కొనేవారికి ఇది నిజంగా శుభవార్తే. ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తమ కస్టమర్ల కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా కారు కొంటే 3 లేదా 5 సంవత్సరాల వారంటీ మాత్రమే ఉంటుంది. కానీ, కియా తన నాలుగు ప్రముఖ మోడళ్లు - సెల్టోస్ (Seltos), సోనెట్ (Sonet), సైరోస్ (Syros), కారెన్స్ క్లావిస్ (Carens Clavis) పై వారంటీ కవరేజీని ఏకంగా 7 సంవత్సరాల వరకు పొడిగిస్తూ కొత్త ప్లాన్‌ను ప్రకటించింది.
ఇంత సుదీర్ఘ కాలం వారంటీ ఇవ్వడం ద్వారా కియా, భారతీయ కార్ల మార్కెట్‌లోని ఇతర కంపెనీలకు షాక్ ఇచ్చింది. ఈ పథకం ద్వారా కొత్తగా కారు కొనేవారు, పాత కియా కార్ల యజమానులు తమ వాహనం వారంటీ కవరేజ్‌ను సాధారణ 5 సంవత్సరాల నుండి ఏకంగా 7 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు.

భారతదేశంలో ఇంత దీర్ఘకాలిక వారంటీ పథకాన్ని అందిస్తున్న అతి కొద్ది కంపెనీలలో కియా కూడా చేరింది. కియా కంపెనీ తన అన్ని వాహనాలపై 3 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీని కొనసాగిస్తోంది. దీనికి అదనంగా కస్టమర్‌లు మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లోపాలు సంభవించినప్పుడు తమ కార్లను రక్షించుకోవడానికి ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్లాన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.
తయారీ లోపాలు లేదా రిపేర్ సమస్యల వల్ల కలిగే నష్టాల నుంచి, సాధారణ వారంటీ కాలం తర్వాత కూడా ఈ అదనపు వారంటీ యజమానులకు ఊహించని రిపేర్ ఖర్చుల నుండి రక్షణ కల్పిస్తుంది. ఇప్పటికే కియా కారు ఉన్నవారు 5 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీని కలిగి ఉంటే, దాన్ని 7 సంవత్సరాల ప్లాన్‌గా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు (5+2 సంవత్సరాల పథకం).

దీనికి పన్నులు మినహాయించి రూ.32,170 నుంచి ఖర్చు ప్రారంభమవుతుంది. అదే సమయంలో కొత్తగా కియా కారు కొనుగోలు చేసేవారు నేరుగా 7 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీని ఎంచుకోవచ్చు. దీని ధర పన్నులు మినహాయించి రూ.47,249 నుంచి ప్రారంభమవుతుంది.
కియా కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ పథకంలో ఉన్న అతి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. ఈ కవరేజీని వేరే యజమానికి బదిలీ చేసుకునే అవకాశం ఉండటం. అంటే, వారంటీ కవరేజ్ కాలంలో వాహనాన్ని విక్రయించినట్లయితే, మిగిలిన వారంటీని కొత్త యజమానికి బదిలీ చేయవచ్చు. ఈ సౌకర్యం కారు రీసేల్ విలువను గణనీయంగా పెంచుతుంది. అలాగే, కొత్తగా కొనుగోలు చేసే వ్యక్తికి కూడా వాహనం పై పూర్తి భరోసా లభిస్తుంది.

ఈ చర్యతో కియా సంస్థ ఇప్పటికే హోండా, రెనాల్ట్, టయోటా వంటి ఇతర ప్రధాన కార్ల తయారీ కంపెనీలతో జతకట్టింది. ఆ కంపెనీలు కూడా తమ కొన్ని మోడళ్లకు 7 సంవత్సరాల విస్తరించిన వారంటీ పథకాన్ని అందిస్తున్నాయి. కస్టమర్ సంతృప్తి, తమ ఉత్పత్తి నాణ్యతపై కియాకు ఉన్న నమ్మకాన్ని ఈ నిర్ణయం స్పష్టంగా తెలియజేస్తుంది. దీంతో కార్ల అమ్మకాలు పెద్ద మొత్తంలో పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. నిజంగా ఈ వారంటీ పథకం అద్భుతం అనే చెప్పాలి.


Click it and Unblock the Notifications








