కియా నుండి సంచలన కార్లు.. ఈవీలు, హైబ్రిడ్‌లతో రానున్న రోజుల్లో మార్కెట్లో జాతరే
దక్షిణ కొరియా బ్రాండ్ కియా ఇండియా (Kia India) భారతీయ ఆటోమొబైల్ రంగంలో తన ఉనికిని మరింత బలపరిచే దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే దేశీయంగా పలు ఆకర్షణీయమైన మోడళ్లతో మార్కెట్లో స్థిరమైన గుర్తింపు పొందిన కియా, ఇప్పుడు కొత్త మోడళ్లను పరిచయం చేయడమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలోకి అడుగుపెడుతూ తన వ్యాపారాన్ని మరింత పెంచుకుంటుంది. మార్కెట్లో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో కంపెనీ రానున్న రోజుల్లో మరిన్ని మోడళ్లను విడుదల చేయడానికి ప్రణాళికలు చేసింది. 2025, 2026 మధ్య కాలంలో, భారతీయ వినియోగదారుల కోసం కియా నాలుగు ప్రధాన మోడళ్లను లాంచ్ చేయనుంది. ఈ మోడళ్లు కేవలం డిజైన్ పరంగా మాత్రమే కాకుండా, టెక్నాలజీ, పనితీరు, వినియోగదారుని అనుభవాన్ని మెరుగుపరిచే అంశాల పరంగానూ ప్రతిష్టాత్మకంగా ఉండే అవకాశముంది.
కియా ఎలక్ట్రిక్ వాహన సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతూ, 2025 జూన్‌లో భారత మార్కెట్‌లో తన తొలి పూర్తి ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయనుంది. ఈ వాహనం పేరును క్లావిస్ EVగా పిలుస్తారో, కారెన్స్ EVగా గుర్తిస్తారో అనే విషయం అధికారికంగా తేలకపోయినా, ఇది కారెన్స్ ఆధారంగా ఉండే ఎలక్ట్రిక్ MPVగా చెబుతున్నారు. ముఖ్యంగా, ఇది కియా ఇటీవల పరిచయం చేసిన క్లావిస్ మోడల్ డిజైన్ ఫిలాసఫీని కొనసాగించే అవకాశం ఉంది.

అయితే, ఇది కేవలం డిజైన్ పరిమితిలోనే కాకుండా, పూర్తిగా కొత్త ఎలక్ట్రిక్ శక్తి సిస్టంకు అనుగుణంగా రూపొందించబడుతుంది. అందుకే, దీనిలో కీలకమైన ఇంజిన్ పరంగా మార్పులు చోటుచేసుకోనున్నాయి. టెస్టింగ్ దశలో భారత రోడ్లపై కనిపించిన ఈ కారు, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఉపయోగించనున్న ముఖ్యమైన పవర్‌ట్రెయిన్ భాగాలను పంచుకునే అవకాశం ఉంది. దీంతో ఈ కారు పనితీరు పరంగా మంచి స్థాయిని అందించగలదని భావిస్తున్నారు.
ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఎలక్ట్రిక్ MPV సగటున 400 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను అందించగల కెపాసిటీ కలిగి ఉండనుంది. ఇది సిటీ డ్రైవింగ్‌కి గానీ, మధ్యస్థ దూర ప్రయాణాలకైనా గానీ అనుకూలంగా ఉంటుంది. కారెన్స్ ఈవీ తర్వాత కొత్త కియా సైరోస్ EV వస్తుంది. ఫిబ్రవరి 2025లో కియా సైరస్ ప్రవేశపెట్టబడిన కొద్దిసేపటికే ఈ ఎలక్ట్రిక్ SUV గురించి వార్తలు వ్యాపించడం ప్రారంభించాయి.

2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న సైరస్ EV, అప్‌డేట్ చేసిన బంపర్లు, అల్లాయ్ వీల్స్ వంటి డిజైన్ అప్‌డేట్స్‌తో వస్తుంది. ఇది నెక్సాన్ EV, మహీంద్రా XUV400 వంటి ప్రస్తుత మార్కెట్ లీడర్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. ముఖ్యంగా, శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యం, ఆకర్షణీయమైన డిజైన్, ప్రీమియం ఫీచర్లతో ఈ మోడల్ తక్కువ ధరలో మెరుగైన పెర్ఫామెన్స్ అందించగలదనే అంచనాలు ఉన్నాయి.
దీని తరువాత సెల్టోస్‌ను పూర్తిగా పునర్నిర్మిస్తున్నది. SP3i అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధిలో ఉన్న ఈ కొత్త తరం సెల్టోస్ ప్రస్తుతం దాని అభివృద్ధి దశలో ఉంది. ఇది మొదట 2025 చివర్లో గ్లోబల్ మార్కెట్లలో విడుదలై, ఆపై 2026లో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశముంది. టెక్నాలజీ పరంగా కూడా గణనీయమైన అప్‌గ్రేడ్‌లను అందించనున్నారు. ఇది బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో లభిస్తుంది.

ఇవి మాత్రమే కాకుండా కియా నుంచి ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను కూడా విడుదల చేయాలని కూడా ప్రణాళికలు చేస్తుంది. ప్రస్తుతం హైబ్రిడ్ కార్లు ఎక్కువ మైలేజీని అందిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్లను మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. రాబోయే కార్ల గురించిన పూర్తి వివరాలను కియా ఇండియా త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








