సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఇష్టంగా కొంటున్న కారు.. దీనికి అంత డిమాండ్ ఎందుకో?
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే కియా మోటార్స్ దేశీయ కంపెనీలకు గట్టి పోటీగా నిలిచింది. ప్రత్యేకంగా డిజైన్, ఫీచర్లు, ప్రీమియమ్ క్వాలిటీ.. ఈ మూడు అంశాలను ఒకే ప్యాకేజీలో అందించడం కియాను వినియోగదారుల మధ్య వేగంగా పాపులర్ చేసింది. ప్రస్తుతం ఈ బ్రాండ్‌కు చెందిన కార్లు ప్రతినెలా స్థిరంగా మంచి అమ్మకాలను నమోదు చేస్తూ, మార్కెట్‌లో తమ స్థాయిని మరింత బలపరుస్తున్నాయి. కియా లైనప్‌లో అత్యంత ప్రభావం చూపిన మోడళ్లలో సోనెట్ (Sonet) ఒకటి. సబ్-4 మీటర్ SUV విభాగంలోకి వచ్చినప్పటి నుండి ఈ మోడల్ తన రూపంతో, ఫీచర్లతో, ప్రీమియం ఫీలింగ్‌తో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఈ సెగ్మెంట్‌లో మారుతి బ్రెజ్జా వంటి బలమైన పోటీదారు ఉన్నప్పటికీ, సోనెట్ తన ప్రత్యేకతతో వినియోగదారులను ఆకట్టుకొని మంచి అమ్మకాల సంఖ్యను సాధిస్తోంది.
అక్టోబర్ నెల విక్రయాలు ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చేస్తాయి. గత నెలలో కియా సోనెట్ 12,745 యూనిట్లు విక్రయించగా, దాంతో మారుతి బ్రెజ్జా అమ్మకాలను అధిగమించింది. ఇంతకుముందు 2024 అక్టోబర్‌లో కేవలం 9,699 యూనిట్ల విక్రయాలను మాత్రమే సాధించింది. ఈ సారి సోనెట్ 31.41 శాతం అనే భారీ వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. అంటే గత సంవత్సరం కంటే ఈసారి కంపెనీ 3,046 యూనిట్లు అదనంగా విక్రయించింది.

ఈ పెరుగుదల వెనుక కారణాలు కియా అందిస్తున్న ఆధునిక సాంకేతిక ఫీచర్లు, మంచి మైలేజ్, ఆకర్షణీయమైన డిజైన్, అలాగే కస్టమర్లలో ఏర్పడిన విశ్వసనీయత. ఈ మోడల్‌లో లభించే ఫీచర్లు ఈ సెగ్మెంట్‌లో ఉన్న ఇతర వాహనాలకు మంచి పోటీని ఇస్తాయి. అంతేకాదు, కియా నిరంతరం అప్‌డేట్స్, ఫేస్‌లిఫ్ట్‌లను అందిస్తూ సోనెట్‌ను ఎప్పుడూ అధునాతనంగా ఉంచుతుంది. మొత్తం మీద, భారత ఆటో మార్కెట్‌లో కియా సోనెట్ తన స్థానం మరింత బలపరుచుకుంటుంది.
కియా సోనెట్ ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో విస్తృతమైన ఎంపికలతో అందుబాటులో ఉంది. మొత్తం తొమ్మిది వేరియంట్లలో లభించే ఈ కాంపాక్ట్ SUV ధరలు రూ. 7.30 లక్షల నుంచి రూ. 14.06 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. ఈ ధర పరిధి సోనెట్‌ను వివిధ రకాల బడ్జెట్, అవసరాలు కలిగిన కస్టమర్లకు సరిపోయేలా చేస్తుంది. ఇంజిన్ ఎంపికల విషయానికి వస్తే, కియా సోనెట్ మూడు రకాల పవర్‌ట్రెయిన్‌లను అందిస్తోంది.

వీటిలో మొదటిది 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఇది నగర ప్రయాణాలకు ఎకానమికల్, స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. తరువాత 1.0-లీటర్ మూడు-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, ఇది పెట్రోల్ ఇంజిన్‌లలో ఎక్కువ పవర్, వేగవంతమైన రెస్పాన్స్ కోరుకునే రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. చివరిగా, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, ఇది మంచి మైలేజ్, ఎక్కువ టార్, దూర ప్రయాణాలకు సరిపోయే బలమైన పనితీరు అందిస్తుంది.
ఈ మూడు ఇంజిన్‌లకు తోడు సోనెట్‌లో ట్రాన్స్‌మిషన్స్ వినియోగదారులను ఆకట్టుకునేలా విస్తృతంగా ఉన్నాయి. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ iMT, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, అలాగే 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ వంటి విభిన్న గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండటం ఈ సెగ్మెంట్‌లో సోనెట్‌ను ప్రత్యేక స్థానంలో ఉంచుతుంది. ప్రతి డ్రైవర్ అవసరానికి సరిపోయేలా కియా ఈ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను అందించడం వల్ల, సోనెట్ ఒక మల్టీ-ఫేస్డ్ SUVగా నిలుస్తుంది.

ఈ కారులో ప్రయాణికుల రక్షణకు సంబంధించి 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్‌లు, ESC, TPMSలను కలిగి ఉంది. ఇంకా ADAS సాంకేతికతలో ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్(FCW), కార్ల కోసం ఫ్రంట్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, సైకిళ్ల కోసం ఫ్రంట్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, పాదచారులకు ఫ్రంట్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీప్ వార్నింగ్ వంటివి దీనిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








