కియా నుంచి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కారు! టాటా, మహీంద్రా కంపెనీలను భయపెట్టబోతోందా?
కియా సైరోస్ (Kia Syros) భారత ఆటోమొబైల్ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి వినియోగదారుల మన్ననలు పొందుతూ, అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా నిలిచింది. గత ఫిబ్రవరిలో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు ప్రస్తుతం ఐసీఈ ఇంజిన్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తోంది. కానీ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, కియా తన అత్యంత విజయవంతమైన మోడల్ సైరోస్‌కి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. కియా సైరోస్ EV గురించి ఇప్పటికే వినియోగదారుల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రాకముందే, ఈ వాహనం భారతీయ మార్కెట్లో ప్రవేశిస్తుందన్న వార్తలు ఆటోమొబైల్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఈ కారు భారతీయ రోడ్లపై టెస్ట్ రన్‌ను ప్రారంభించినట్లు సమాచారం వెలువడింది.
కేరళలోని కొచ్చి నగరంలో ఉన్న ఒక ఛార్జింగ్ స్టేషన్‌లో కియా సైరోస్ EV నిలిపివుండగా కెమెరాలో చిక్కిన ఫోటోలు ఈ వార్తకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఆసక్తిని మరింతగా పెంచుతున్నాయి. దీనిని రుస్లాన్ వెబ్‌సైట్ నివేదించింది. రాబోయే రోజుల్లో అధికారిక లాంచ్ వివరాలు బయటకు వచ్చే అవకాశముంది. ఇది మార్కెట్లోకి ప్రవేశిస్తే, ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ SUV విభాగంలో పోటీ పెరగనుంది.

చాలా కాలంగా ఈ ఈవీ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని ఊహగాణాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే టెస్ట్ డ్రైవ్ ప్రారంభమైన నేపథ్యంలో, ఈ ఎలక్ట్రిక్ కారు త్వరలోనే భారత మార్కెట్లో అధికారికంగా ప్రవేశించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న IC ఇంజిన్ వెర్షన్ రూపకల్పనను కొనసాగించేలా, సైరోస్ EV డిజైన్ కూడా దాదాపు అదే తరహాలో ఉండబోతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
అంటే కారు బాడీ లైన్స్, ఎక్స్‌టీరియర్ లుక్, ఇంటీరియర్ కంఫర్ట్ అన్ని కూడా ఒకే విధంగా ఉంటూనే, ఎలక్ట్రిక్ టచ్‌తో కొత్త ఆకర్షణను తెచ్చేలా ఉండనుంది. ఫీచర్ల పరంగా కూడా వినియోగదారులు నిరాశ చెందాల్సిన అవసరం ఉండదనేది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం IC ఇంజిన్ వెర్షన్‌లో ఉన్న ఆధునిక సౌకర్యాలు, సేఫ్టీ ఫీచర్లు, టెక్నాలజీ ఫీచర్లు అన్నీ దాదాపు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా దొరకనున్నాయని అంచనాలు ఉన్నాయి.

అయితే, అసలు ప్రత్యేకత పనితీరులోనే దాగి ఉంది. కియా సైరోస్ EVలో రెండు వేరే బ్యాటరీ ఎంపికలను కంపెనీ అందించే అవకాశాలున్నాయి. ఒకటి 42 kWh బ్యాటరీ, మరొకటి 49 kWh బ్యాటరీ. ఈ రెండు ఆప్షన్లు వినియోగదారుల అవసరాన్ని బట్టి మంచి రేంజ్‌ను అందిస్తాయని భావిస్తున్నారు. తక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీతో నగర ప్రయాణాలకు సరిపోతే, ఎక్కువ సామర్థ్యం ఉన్న వెర్షన్ లాంగ్ డ్రైవ్‌లను సులభతరం చేయనుంది.
అందులో 42 kWh బ్యాటరీ సుమారు 300 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని, 49 kWh బ్యాటరీ మాత్రం దాదాపు 355 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని అంచనా. అంటే, ఒక్కసారి పూర్తి చార్జింగ్ చేస్తే నగర ప్రయాణాల నుంచి లాంగ్ డ్రైవ్‌ల వరకు వినియోగదారులు నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కియా సైరోస్ EV ధరను కూడా చాలా పోటీగా నిర్ణయించబోతోంది.

ప్రారంభ ధర రూ. 14 లక్షల నుంచి ఉండవచ్చని సమాచారం. ఈ ధర స్థాయిలో ఎలక్ట్రిక్ SUVను మార్కెట్లోకి తీసుకురావడం కియా తరపున ఒక గేమ్‌చేంజర్‌గా మారనుంది. ఈ ధరలో లభిస్తే, కియా సైరోస్ EV భారతీయ మార్కెట్లో అమ్ముడవుతున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ SUVగా నిలుస్తుంది. ప్రీమియం సెగ్మెంట్ కస్టమర్లు మాత్రమే కాకుండా, మిడ్-రేంజ్ బడ్జెట్‌లో ఉన్న వారు కూడా ఎలక్ట్రిక్ SUVని సొంతం చేసుకునే అవకాశం పొందనున్నారు.


Click it and Unblock the Notifications








