టెక్నాలజీకే ఓటు.. సన్‌రూఫ్‌ల కోసం ఎగబడుతున్న జనాలు.. అమ్ముడవుతున్న మూడింటిలో 2 SUVలు హ్యుందాయ్ కంపెనీవే !
మన ఇండియన్లకు SUVలంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మారుతి సుజుకి వంటి దిగ్గజ కంపెనీలు కూడా SUV ట్రెండ్‌కు తగ్గట్టు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. తాజాగా విడుదలైన హ్యుందాయ్ 2024-25 ఆర్థిక సంవత్సరం అమ్మకాల గణాంకాలు కూడా దేశంలో SUVల హవా ఏ విధంగా కొనసాగుతుందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో హ్యుందాయ్ ఇండియాలో విక్రయించిన కార్లలో సింహభాగం SUVలే కావడం విశేషం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో హ్యుందాయ్ అమ్మిన కార్లలో 63.2 శాతం SUVలు ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 68.5 శాతానికి చేరుకుంది.దీని అర్థం.. హ్యుందాయ్ షోరూమ్ నుంచి బయటకు వెళ్తున్న ప్రతి మూడు కార్లలో రెండు అత్యధిక ఫీచర్లు కలిగిన ప్రీమియం SUVలే.

హ్యుందాయ్ ఎక్స్‌టర్, వెన్యూ, క్రెటా, అల్కాజార్, ట్యూసాన్ , అయోనిక్ 5 వంటి మోడళ్లకు పెరుగుతున్న డిమాండ్ దీనిని స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రీమియం, ఫీచర్-రిచ్ హ్యుందాయ్ బలమైన SUV లైనప్ భారతీయ వినియోగదారుల మొదటి ప్రాధాన్యతగా మారిందని అర్థం చేసుకోవచ్చు.
హ్యుందాయ్ గత ఆర్థిక సంవత్సరం అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది సన్‌రూఫ్‌లకు పెరుగుతున్న డిమాండ్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో విక్రయించబడిన మొత్తం హ్యుందాయ్ వాహనాల్లో 53.2 శాతం సన్‌రూఫ్‌తో కూడినవే. ఇది భారతీయ వినియోగదారులకు ప్రీమియం ఫీచర్లపై ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది.

ప్రస్తుతం హ్యుందాయ్ తన 14 మోడళ్లలో 12 మోడళ్లకు సన్‌రూఫ్ ఆప్షన్‌ను అందిస్తోంది. అంతేకాకుండా, హ్యుందాయ్ లేటెస్ట్ సేఫ్టీ టెక్నాలజీకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) కలిగిన మోడళ్ల అమ్మకాలు రెట్టింపు కావడం కొత్త టెక్నాలజీపై వినియోగదారుల ఆసక్తిని సూచిస్తుంది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ADASవేరియంట్‌ల వాటా 14.3శాతానికి చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం 6.7 శాతం మాత్రమే. ప్రస్తుతం హ్యుందాయ్ తన 9మోడళ్లలో ADASను అందిస్తోంది. హ్యుందాయ్ పెట్రోల్, డీజిల్, టర్బో పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో పాటు IVT, AMT, AT, DCTట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో సహా వివిధ రకాల ఫ్యూయల్, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లను అందిస్తూ వినియోగదారుల వివిధ ప్రాధాన్యతలను తీరుస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది.

అయితే, హ్యుందాయ్ పాపులర్ సెడాన్ అయిన వెర్నా SUVలతో పోలిస్తే ఆశించిన స్థాయిలో అమ్మకాలు నమోదు చేయలేదు. 2025 మార్చిలో హ్యుందాయ్ కేవలం 1,364 వెర్నా యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇది ఒక మంచి సంఖ్యే అయినప్పటికీ, అదే నెలలో క్రెటా అమ్మకాలు 18,059 యూనిట్లుగా ఉన్నాయి.
మధ్య తరహా సెడాన్ విభాగంలో వెర్నా మంచి పనితీరు కనబరుస్తున్నప్పటికీ, ఇప్పటికీ ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ కంటే వెనుకబడి ఉంది. భారతదేశంలో ప్రస్తుతం సెడాన్ సెగ్మెంట్ క్రమంగా కుంచించుకుపోతోంది. ప్రస్తుతం భారతీయ కార్ల మార్కెట్‌లో సెడాన్ల వాటా కేవలం 8 శాతం మాత్రమే.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








