9 సీట్ల కారు.. ఇంతమంది ఉన్న కుటుంబం ఒకే కారులో ప్రయాణించవచ్చు! ఎంతమందికి నచ్చిందో తెలుసా?
భారతదేశపు మారుమూల గ్రామాల నుంచి పట్టణ వీధుల వరకూ తన శక్తి సామర్థ్యాలతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తున్న లెజెండరీ SUV అంటే అందరికి గుర్తుకు వచ్చేది.. మహీంద్రా బొలెరో (Mahindra Bolero). జూన్ 2025లో విడుదలైన అమ్మకాల గణాంకాలు చూస్తే, ఈ కారుకు ఇంకా ఎంత స్థిరమైన డిమాండ్ ఉందో స్పష్టంగా తెలుస్తోంది. జూన్ 2024లో మహీంద్రా బొలెరో కారు 7,365 యూనిట్లు అమ్ముడవగా, ఏడాది తర్వాత అదే నెలలో అమ్మకాల సంఖ్య 7,478కి చేరింది. అంటే, సుమారు 2 శాతం వృద్ధి నమోదైంది. ఇది చిన్న సంఖ్యలా కనిపించినా, మార్కెట్ పరిస్థితులు, పెరిగిన పోటీ, ఎలక్ట్రిక్ వాహనాల లాంచ్ వంటి పరిస్థితుల్లో ఇది బొలెరోకి ఉన్న స్థిరమైన డిమాండ్‌కు నిదర్శనం.
ప్రస్తుతం బొలెరో మూడు మోడళ్లలో బొలెరో, బొలెరో నియో, బొలెరో నియె ప్లస్‌లలో లభిస్తుంది. వేరే వేరే వాహన అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసిన ఈ మూడు మోడళ్లలో ప్రతి ఒక్కటీ తనదైన మార్కెట్‌ను ఏర్పరచుకుంది. ప్రత్యేకంగా గ్రామీణ మార్కెట్‌లో, బొలెరో తన మైలేజ్, బలమైన బిల్డ్ క్వాలిటీ, రఫ్ అండ్ టఫ్ నేచర్ వల్ల ఫెవరెట్ వాహనంగా నిలిచింది. ఇది కేవలం వాహనం కాదు, చాలామందికి నమ్మకమైన ఎంపిక.

అందుబాటులో ఉన్న ప్రారంభ బొలెరో మోడల్ 7-సీటర్ ఆప్షన్‌లో వస్తోంది. ఇది రోజువారీ వినియోగదారుల కోసం తయారు చేయబడినది. దాని ప్రారంభ ధర రూ. 9.81 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 10.93 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు చేరుకుంటుంది. బలమైన బిల్డ్, భరోసా కలిగించే పనితీరు కారణంగా గ్రామీణ భారతంలో ఇది ఇంకా ప్రాధాన్యం పొందుతోంది. దీనితో పాటు మిడిల్ వేరియంట్ బొలెరో నియో కూడా ఆకట్టుకుంటుంది.
ఇది కూడా 7-సీటర్ డిజైన్‌నే కలిగి ఉంటుంది. దీని ధరలు రూ.9.97 లక్షల నుండి ప్రారంభమవుతాయి, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.12.17 లక్షలు. మోడరన్ లుక్స్, టెక్నాలజీ అప్‌డేట్స్‌ను కోరుకునే వారికిది మంచి ఎంపికగా ఉంటుంది. ఇక ఎక్కువ మంది ప్రయాణికులకు అనుకూలంగా మహీంద్రా బొలెరో నియో ప్లస్ డిజైన్ చేయబడింది. ఇది 9-సీటర్ కాబట్టి పెద్ద కుటుంబాలు, ట్రావెల్ బిజినెస్‌లు లేదా ఫీల్డ్ వర్క్‌లకు బెస్ట్ సూట్ అవుతుంది.

బొలెరో నియో ప్లస్ ప్రారంభ ధర రూ. 11.41 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 12.51 లక్షలు వరకు ఉంటుంది. గమనించదగిన విషయం ఏమిటంటే, బొలెరో నియో ప్లస్‌లో ప్రత్యేకంగా అంబులెన్స్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇది 5-సీటర్ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. అత్యవసర వైద్య అవసరాల కోసం డిజైన్ చేయబడింది. దీని ధర రూ. 14.06 లక్షలు (ఎక్స్-షోరూమ్).
మహీంద్రా బొలెరో.. ఒక SUV మాత్రమే కాదు, భారత రోడ్లపై విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన మోడల్. ఆగస్టు 2000లో భారత మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి, ఇది మారుతున్న కాలానుగుణంగా ఎన్నో అప్‌డేట్‌లను చూసింది. ఇది ఇప్పటికే దాదాపు 25 సంవత్సరాల ట్రావెల్‌ను పూర్తి చేసింది. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే, ఎంతో మంది కొత్త వాహన బ్రాండ్లు, ట్రెండ్లు వచ్చినా కూడా బొలెరో స్థిరంగా విక్రయాలు నమోదు చేస్తోంది.

తాజాగా జూన్ 2025కి సంబంధించిన అమ్మకాల నివేదిక కూడా ఇదే చెబుతోంది, ఇంకా ఈ SUVకి మార్కెట్‌లో బలమైన డిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మూడు బొలెరో వేరియంట్లలో కూడా డీజిల్ ఇంజిన్ ఎంపిక మాత్రమే ఉంది. అంటే పెట్రోల్ వేరియంట్ ఎంచుకునే అవకాశం లేదు. ఇది ఒకవైపు చూసినప్పుడు పరిమిత ఎంపికగా అనిపించవచ్చు, కానీ బొలెరో అమ్మకాల్లో దూసుకుపోతుంది.


Click it and Unblock the Notifications








