ఒకే కారులో 9 మందిని తీసుకెళ్లొచ్చు.. ఎన్ని ఏళ్లు గడిచినా దీనికి డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో SUVల పట్ల ఉన్న డిమాండ్‌ను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తున్నా, కొన్ని SUVలు మాత్రం కాలాన్ని తట్టుకుని, తమ ప్రత్యేక గుర్తింపుతో ముందుకు సాగుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో మహీంద్రా బొలెరో (Mahindra Bolero) ఒకటి. ఈ కారు ఆగస్టు 4, 2000న భారత మార్కెట్లో అడుగుపెట్టింది. అప్పటినుంచి, ఏళ్ల తరబడి మారుతున్న ట్రెండ్స్, కొత్త పోటీ మోడల్స్, మారుతున్న కస్టమర్ అభిరుచులు.. ఇవన్నింటినీ అధిగమిస్తూ, బొలెరో తన స్థానాన్ని గట్టిగా నిలబెట్టుకుంది. ఈ మధ్యతరగతి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒకే రేంజ్‌లో సౌకర్యం, మన్నిక, బలమైన పనితీరుతో ప్రసిద్ధి చెందింది. పావు శతాబ్దం గడిచినా, బొలెరో అమ్మకాలలో ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.
తాజాగా విడుదలైన జూలై 2025 అమ్మకాల గణాంకాలు దీని డిమాండ్‌ను మరోసారి రుజువు చేస్తున్నాయి. మహీంద్రా జూలై 2025లో మొత్తం 7,513 బొలెరోలను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే నెలలో నమోదైన అమ్మకాల కంటే గణనీయంగా ఎక్కువ. జూలై 2024లో ఈ SUV అమ్మకాలు 6,930 యూనిట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. అంటే ఒక్క సంవత్సరంలోనే 583 యూనిట్ల పెరుగుదల సాధించింది. ఇది దాదాపు 8 శాతం వృద్ధి.

ఈ సేల్స్‌కు ప్రధాన కారణం బొలెరోలో ఉన్న బలమైన డిజైన్, అన్ని రకాల రోడ్లపై సాఫీగా నడిచే సస్పెన్షన్ సిస్టమ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు. అంతేకాదు, మహీంద్రా దీన్ని కాలానుగుణంగా చిన్న చిన్న అప్‌డేట్స్ చేస్తూ, కస్టమర్ల ఆకర్షణను కొనసాగిస్తోంది. మహీంద్రా బొలెరో ప్రస్తుతం భారత మార్కెట్లో మూడు విభిన్న వెర్షన్లలో మహీంద్రా బొలెరో, మహీంద్రా బొలెరో నియో, మహీంద్రా బొలెరో నియో ప్లస్‌లలో అందుబాటులో ఉంది .
ఈ మూడు వెర్షన్లూ SUV ప్రేమికులకు ప్రత్యేకమైన ఎంపికలను అందిస్తాయి. బొలెరో బేస్ వేరియంట్ ధర రూ.9.81 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, టాప్ వేరియంట్ ధర రూ.10.93 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం 7-సీటర్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది, అంటే పెద్ద కుటుంబాలు లేదా ఎక్కువ సీటింగ్ అవసరమయ్యే వారికి ఇది సరైన ఎంపిక అవుతుంది.

మరోవైపు, మహీంద్రా బొలెరో నియో కూడా SUV విభాగంలో ప్రత్యేక స్థానం కలిగిన మోడల్. దీని ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర రూ.9.97 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, టాప్ వేరియంట్ ధర రూ.12.18 లక్షల వరకు ఉంటుంది. బొలెరో మాదిరిగానే, బొలెరో నియో కూడా పూర్తిగా 7-సీటర్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది, అందువల్ల కుటుంబ ప్రయాణాలు లేదా లాంగ్ ట్రిప్‌లకు ఇది అద్భుతమైన ఎంపిక అవుతుంది.
అదే సమయంలో, బొలెరో శ్రేణిలో మరింత విస్తారమైన సీటింగ్ అవసరమయ్యే వారికి మహీంద్రా బొలెరో నియో ప్లస్ మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. దీని ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర రూ.11.41 లక్షల నుంచి మొదలై, టాప్ వేరియంట్ ధర రూ.14.06 లక్షల వరకు ఉంటుంది. ఈ వేరియంట్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం 9-సీటర్ ఆప్షన్‌లోనే అందుబాటులో ఉండటం.

ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బొలెరో నియో ప్లస్ అంబులెన్స్ వేరియంట్ మాత్రం 5-సీటర్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే అమ్ముడవుతోంది. అత్యవసర సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వెర్షన్, బలమైన పనితీరు, విశాలమైన స్పేస్‌ను కలిపి అందిస్తుంది. మొత్తం మీద, మహీంద్రా బొలెరో కుటుంబంలోని ప్రతి మోడల్ కూడా వేర్వేరు అవసరాలు, బడ్జెట్, ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది.


Click it and Unblock the Notifications








