కొత్త లుక్‌లో మహీంద్రా పవర్ హౌస్.. ఈ ఫీచర్లతో ఎస్‌యూవీ మార్కెట్లో దుమ్ము రేపడం ఖాయం
ఇండియాలోని అత్యంత ఐకానిక్ వెహికల్స్‌లో ఒకటైన మహీంద్రా బొలెరో సిరీస్ ఇప్పుడు కొత్త రూపం సంతరించుకుంది. ఇటీవల కొత్త 2025 థార్ రిలీజ్ అయిన వెంటనే మహీంద్రా సంస్థ బోలెరో, బోలెరో నియో మోడళ్లకు కూడా ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్స్ తీసుకొచ్చింది. ఈ రెండు ఎస్యూవీలు చాలా కాలంగా ఒకే లుక్‌లో ఉన్నప్పటికీ, ప్రజలకు వాటి డిజైన్ ఇప్పటికీ నచ్చడం విశేషం. అయితే, మార్కెట్లో పోటీ పెరగడంతో ఈ వర్క్‌హోర్స్ మోడళ్లకు కొత్త ఫీచర్లు, అప్‌డేట్స్ ఇవ్వడం ద్వారా అమ్మకాలకు బలాన్ని పెంచాలని కంపెనీ నిర్ణయించింది.
మహీంద్రా బోలెరో కొత్త మోడల్ ధర రూ.7.99 లక్షల నుంచి(ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది. కొత్తగా వచ్చిన B8 ట్రిమ్ ధర రూ.9.69 లక్షలు. ఇక బొలెరో నియో ధర రూ.8.49 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ రెండు ఎస్‌యూవీలలో మెకానికల్‌గా పెద్ద మార్పులేమీ చేయలేదు. అయితే, కారు రైడింగ్, హ్యాండ్లింగ్ బ్యాలెన్స్‌ను మెరుగుపరిచేందుకు సస్పెన్షన్‌ను మెరుగ్గా ట్యూన్ చేశారు.

బొలెరో ఫేస్‌లిఫ్ట్
కొత్త బొలెరోలో మార్పులు చాలా సూక్ష్మంగా ఉన్నాయి. ఇందులో క్రోమ్ ఇన్సర్ట్‌లతో కూడిన కొత్త 5-స్లాట్ గ్రిల్‌ను అందించారు. B6 ట్రిమ్ నుంచి ఫాగ్ ల్యాంప్స్ లభిస్తాయి. టాప్-స్పెక్ B8 ట్రిమ్‌లో కొత్త 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను జోడించారు.
పాత డైమండ్ వైట్, సిల్వర్, రాకీ బీజ్ రంగులతో పాటు, స్టీల్త్ బ్లాక్ అనే కొత్త కలర్ ఆప్షన్‌ను పరిచయం చేశారు. ఇంటీరియర్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, కొత్త స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్‌లు, USB-C ఛార్జింగ్ పోర్ట్, లెదరెట్ అప్హోల్స్టరీ, డోర్ ట్రిమ్‌లలో కొత్త బాటిల్ హోల్డర్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

అయితే, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే మద్దతు లేదు. సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు అన్ని ట్రిమ్‌లలో స్టాండర్డ్‌గా వస్తాయి, కానీ 6 ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రం లేవు. 1.5 లీటర్, 3-సిలిండర్ డీజిల్ ఇంజన్ (76 bhp పవర్, 210 Nm టార్క్) యథావిధిగా ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది(ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ లేదు).
బొలెరో నియో ఫేస్‌లిఫ్ట్
బొలెరో నియో కూడా ముఖంపై మెరుగులు దిద్దుకుంది. కొత్త బాడీ-కలర్డ్ గ్రిల్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, డ్యూయల్-టోన్ ORVMలు, హెడ్‌లైట్‌లో DRLలు, కొత్త 15/16-అంగుళాల అల్లాయ్‌లు దీంట్లో ఉన్నాయి. నియో ఇప్పుడు తొమ్మిది రంగుల్లో (కొత్తగా జీన్స్ బ్లూ, కాంక్రీట్ గ్రే, డ్యూయల్-టోన్ ఆప్షన్లతో కలిపి) లభిస్తుంది.

ఇంటీరియర్ పరంగా నియో మరింత రిచ్‌గా మారింది. ఇందులో కొత్త అప్హోల్స్టరీ, బ్లూటూత్ కనెక్టెడ్ మ్యూజిక్ ప్లేయర్, కీలెస్ ఎంట్రీ, 9-అంగుళాల క్లస్టర్, ISOFIX, ABS, EBD, రియర్ వ్యూ కెమెరా, USB-C పోర్ట్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్-ఎండ్ మోడళ్లలో లూనార్ గ్రే ఇంటీరియర్ థీమ్, ఇతర వేరియంట్‌లలో మోచా బ్రౌన్ ఇంటీరియర్ లభిస్తుంది.
నియోలో మరింత పవర్ఫుల్ 1.5 లీటర్ mHawk 100 డీజిల్ ఇంజన్ (98 నుంచి 100 bhp పవర్, 240 నుంచి 260 Nm టార్క్) లభిస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మహీంద్రా ఈ అప్‌డేట్ల ద్వారా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ రెండు మోడళ్ల అమ్మకాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండు మోడళ్లు (బోలెరో నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవున్న బాడీ-ఆన్-ఫ్రేమ్ ఎస్‌యూవీలు) మార్కెట్లో ప్రత్యక్ష పోటీదారులు లేని ఒక ప్రత్యేక విభాగంలో కొనసాగుతున్నాయి.
ఈ అప్‌డేట్ల ద్వారా అమ్మకాలు మరింత పెరుగుతాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల సెప్టెంబర్ 2025లో మహీంద్రా భారత మార్కెట్లో రికార్డు స్థాయిలో 56,233 ఎస్‌యూవీలను విక్రయించింది. ఇది గతేడాదితో పోలిస్తే 10% వృద్ధిని నమోదు చేసింది.


Click it and Unblock the Notifications








