ఈ కారుని జనాలు పట్టించుకోవడం లేదు.. ఆరు నెలల్లో కనీసం 100 మంది కూడా కొనలేదు!
దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా.. తమ వాహనాలతో ఎన్నో ఏళ్లుగా భారత కస్టమర్లను ఆకట్టుకుంటూ వస్తోంది. అయితే ఈ సంస్థ ఇప్పుడు ఓ కారు కారణంగా కష్టాలెదుర్కొంటోంది! సేల్స్ పెంచుకోలేక సతమతమవుతోంది. అదే మహీంద్రా నుంచి వచ్చిన మరాజో ఎంపీవీ. ఇది లాంచ్ అయిన కొత్తలో వినియోగదారులను బాగానే ఆకట్టుకుంది. 7- సీటర్ వాహనాల్లో భారతీయుల్లో చాలామందికి ఫేవరేట్ వాహనంలా నిలిచింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఈ కారుని జనాలు కొనేందుకు భారతీయ వినియోగదారులు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు.
కొన్ని నెలలుగా దీని అమ్మకాలు దారుణంగా పడిపోవడమే ఇందుకు సంకేతం. గత డిసెంబరు నెలలో మహీంద్రా మరాజో ఎంపీవీ.. అతి తక్కువగా 16 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. 2024లో మరాజో కారు అప్డేడ్ వెర్షన్‌తో వచ్చినప్పటికీ.. ఇది కస్టమర్లను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమైంది. గత ఆరునెలల అమ్మకాలను పరిశీలిస్తే.. ఈ కారు కేవలం 37 యూనిట్ల అమ్మకాలతో అక్టోబరులో కాస్త ఎక్కువ సేల్స్ సాధించింది.

మిగతా అన్ని నెలల్లోనూ దారుణంగా పడిపోయింది. ఈ ఆరు నెలల్లో అంతా కలిపి 91 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2024 జులై నెలలో మహీంద్రా కేవలం 14 యూనిట్ల మరాజో కార్లను మాత్రమే సేల్ చేయగలిగింది. ఇక ఆగస్టులోనైతే అతి తక్కువగా 8 యూనిట్ల వాహనాలను, సెప్టెంబరులో ఇంకా తక్కువగా 7 యూనిట్లను మాత్రమే అమ్మింది.
ఫెస్టివ్ సీజన్ అక్టోబరులో కాస్త పుంజుకుంది. 37 యూనిట్లతో కొద్దిగా ఫర్వాలేదనిపించింది. నవంబరులో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ నెలలో కేవలం 9 యూనిట్ల వాహనాలు మాత్రమే సేల్ అయ్యాయి. ఇక డిసెంబరులో 16 యూనిట్లకు మాత్రమే పరిమితమైంది. మరాజో కారుకు ఎర్టిగా, కియా కారెన్స్, రెనాల్ట్ ట్రైబర్ వంటివి పోటీగా ఉన్నాయి. అలాగే... టయోటా ఇన్నోవా క్రిస్టా, మారుతీ XL6 ఇన్విక్టో మోడళ్లు కూడా గట్టి పోటీనిస్తున్నాయి.

మరాజో ధర విషయానికి వస్తే.. M2 7- సీటర్ వేరియంట్ ధర రూ.14,39,400 నుంచి రూ.14,59,400 కి పెరిగింది. ఇందులో M2 8s వేరియంట్ ధర రూ.20,000 పెరిగింది. M4 Plus 7s వేరియంట్ ధర రూ.19,999 పెరిగి రూ.15,86,000గా ఉంది.
అదే సమయంలో M4 Plus 8s వేరియంట్ ధర రూ.20,000కి పెరిగి, రూ.15,94,200ను చేరింది. M6 Plus వేరియంట్ ధర రూ.19,999 పెరిగి, రూ.16,92,000ని తాకింది. M6 Plus 8s వేరియంట్ రూ.20,000 పెరిగి రూ.17,00,200కి లభిస్తోంది.

ఈ మహీంద్రా మరాజో ఫీచర్లను పరిశీలిస్తే.. ఇది పవర్‌ఫుల్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 121bhp శక్తి, 300 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-speed గేర్ బాక్స్‌తో అనుసంధానించి ఉంటుంది. మరాజో కారు.. ప్రయాణికుల రక్షణ కోసం 6 ఎయిర్ బ్యాగులతో ఉంటుంది.
ఇది ఏబీఎస్, ఈబీడీ వంటి బ్రేకింగ్ కంట్రోల్ సదుపాయాలతో వస్తుంది. రియర్ పార్కింగ్ సెన్సార్లు కలిగి ఉండి, పార్కింగ్ సమయంలో సౌకర్యంగా ఉంటుంది. సెంట్రల్ ఏసీ సిస్టం, ఆటోమేటిక్ క్లైమైట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో డ్రైవింగ్ సాఫీగా సాగుతుంది. రిమోట్ కీలెస్ ఎంట్రీ సిస్టం ద్వారా సులభంగా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది 17 అంగుళాల అలాయ్ వీల్స్‌తో వస్తుంది. 7 అంగుళాల ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టం ఇందులో ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: భారత ఆటోమొబైల్ మార్కెట్ నుంచి మరాజో కారు పట్ల ఆశించినంత స్పందన రానప్పటికీ.. తమ కారు సేల్స్ పెంచుకోవడంలో మాత్రం మరాజో వెనుకడుగు వేయడం లేదు. ఈ కారు అమ్మకాలు పెంచేందుకు అన్ని రకాలుగా ఈ కంపెనీ గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ ఒక్క కారు తప్పా మహీంద్రా ఇతర కార్ల అమ్మకాల్లో దుమ్మురేపుతోంది.


Click it and Unblock the Notifications








