కేవలం రూ.47 చాలు.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లొచ్చు! అందరిని షాక్‌కి గురిచేస్తున్న 7 సీటర్ ఈవీ కారు
భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా (mahindra) ఎప్పటి నుంచో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ. అయితే ప్రస్తుతం ఇది పూర్తిగా కొత్త దారిని ఎంచుకుంది. దేశంలో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల యుగానికి తగినట్లుగా, మహీంద్రా తన సాంకేతికతను, తన శైలిని, తన దృష్టిని మొత్తం EV భవిష్యత్తుపై కేంద్రీకరించింది. ఆ ప్రయాణంలోనే తాజాగా వచ్చిన గొప్ప అడుగు కొత్త మహీంద్రా XEV 9S. ఈ 7 సీట్ల ఎలక్ట్రిక్ SUV కేవలం ఒక కొత్త మోడల్ మాత్రమే కాదు, కంపెనీ ఎలక్ట్రిక్ మొబిలిటీపై ఎంత ఇష్టంగా పనిచేస్తోంది అనేది బలంగా చూపిస్తుంది. దూర ప్రయాణాల్లో EVలు సాధ్యం కాదనే పాత అభిప్రాయాలను చెరిపేసే విధంగా, XEV 9S ఒకే ఛార్జ్‌పై అందించే దూరం అసలు ఈ వాహనానికి ప్రధాన ఆకర్షణ.
మహీంద్రా XEV 9S అసలైన శక్తి దాని డిజైన్‌లోనే కాదు బ్యాటరీ టెక్నాలజీలో ఉంది. ఈ SUVను ఎన్నుకున్న తర్వాత అవసరాలకు తగ్గట్టుగా రేంజ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అందుకే ఈ మోడల్‌ను మూడు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో 59 kWh, 70 kWh, 79 kWhలలో విడుదల చేశారు. దీని ధర రూ. 19.95 లక్షల నుండి టాప్ వేరియంట్ ధర రూ.29.45 లక్షలు (ఎక్స్-షోరూమ్).వరకు ఉంది.

59 kWh ప్యాక్‌తో వచ్చే XEV 9S నగర ప్రయాణాలకు అద్భుతంగా సరిపోతుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 521 కి.మీ.ల ప్రయాణం అందించడం ఈ సెగ్మెంట్‌లోనే పెద్ద విషయం. కొంచెం ఎక్కువ పవర్, ఎక్కువ దూర ప్రయాణాలు కావాలనుకునే వారి కోసం ఉన్న మధ్యస్థమైన 70 kWh బ్యాటరీ అయితే నిజంగా చాలా బలంగా పని చేస్తుంది. ఇది ఒక్క ఛార్జ్‌తో 600 కి.మీ.ల వరకు తీసుకెళ్తుంది.
ఇది దాదాపు హైదరాబాద్ నుంచి చెన్నై వరకూ ఒకేసారి చేరేంత దూరం. మరింత ఎక్కువ దూరం కావాలనుకునే వారికి 79 kWh పెద్ద బ్యాటరీ వేరియంట్ ఉంది. ఇది XEV 9Sకి 679 కి.మీ.ల వరకు భారీ రేంజ్ ఇస్తుంది. ఈ గణాంకం ప్రస్తుతం భారత EV మార్కెట్‌లో ఒక స్టేట్‌మెంట్‌లాంటిది. కుటుంబ ప్రయాణాలు, రోజువారీ డ్రైవింగ్, లాంగ్ డ్రైవ్స్ ఏదైనా కావచ్చు, ఈ కారు బెస్ట్ ఆప్షన్.

మహీంద్రా XEV 9S గురించి మాట్లాడేటప్పుడు ఇందులోని రేంజ్, ఫీచర్లు, డిజైన్ అన్నీ ముఖ్యమే కానీ, చాలా మంది కొనుగోలుదారులకు అసలైన ఆకర్షణ ఏమిటంటే.. దాని తక్కువ నిర్వహణ ఖర్చులు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రధాన ప్రయోజనం ఇదే. మహీంద్రా అధికారిక సమాచారం ప్రకారం, XEV 9Sను నడపడానికి ప్రతి కిలోమీటరుకు కేవలం రూ. 1.2 మాత్రమే ఖర్చవుతుంది.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న ఈ కాలంలో ఇది నిజంగా పెద్ద విషయం. ఒక్కసారిగా మీరు ఈ సంఖ్యను చూస్తే, EV ఎందుకు భవిష్యత్ వాహనం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకూ గూగుల్ మ్యాప్స్ చూపించే దూరం సుమారు 278 కి.మీ. ఈ ప్రయాణాన్ని ఒక సాధారణ పెట్రోల్ SUVలో చేసినా, ఖర్చు మూడు వేలకు పైనే అవుతుంది.

కానీ XEV 9Sతో అదే దూరం ప్రయాణిస్తే అవసరమయ్యే మొత్తం ఖర్చు సుమారుగా కేవలం రూ.334! వరకు అవుతుంది. ఇది 7 సీట్ల కారు. కాబట్టి 7 మంది హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణిస్తే, ఒక్కొక్కరికి కేవలం 47 రూపాయలు ఖర్చవుతుంది. ఇది ఉదాహరణ మాత్రమే. రోజూ ఆఫీసు, వీకెండ్ ట్రిప్‌లు, లాంగ్ డ్రైవ్‌లు.. ఎక్కడికైనా వెళ్లినా ఇలా తక్కువ ఖర్చుతో ప్రయాణించగలగడం EVతో సాధ్యమవుతుందని ఉదాహరణగా చెప్పాము.


Click it and Unblock the Notifications








