ఎక్కడ చూసినా ఇదే కారు.. థార్ దెబ్బకి మార్కెట్ షేక్.. ఆఫ్‌రోడ్ కింగ్‌ను ఎగబడి మరి కొన్నారు
మహీంద్రా థార్ భారతీయ SUV మార్కెట్‌లో తనదైన ముద్ర వేసుకుంది. మార్కెట్లోకి విడుదలైనప్పటి నుంచి అంచనాలకు ధీటుగా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో కూడా అమ్మకాలతో దుమ్ములేపుతుంది. థార్ ఎక్కువగా అడవులు, కొండ ప్రాంతాలు, క్లాసిక్ ఆఫ్-రోడ్ ట్రిప్స్ కోసం బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది 3 డోర్ వెర్షన్ మాత్రమే. తరువాత మహీంద్రా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్‌రోడ్ ప్రయాణాలతో పాటు, రోజువారి ప్రయాణాల కోసం కుటుంబ ప్రయాణాలకు అనువుగా ఉండేలా 5 డోర్ థార్‌ను తీసుకొచ్చింది. ఈ వెర్షన్ ముఖ్యంగా కుటుంబ ప్రయాణాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న కొత్త థార్ రాక్స్ తక్కువ కాలంలోనే ప్రజలందరి అభిమానాన్ని పొందింది.
ఇప్పుడు, 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహీంద్రా & మహీంద్రా విడుదల చేసిన అమ్మకాల గణాంకాలు థార్‌కు ఏ మేరకు డిమాండ్ ఉందో తెలియజేస్తుంది. గత ఏడాది ఇదే సమయంలో దేశీయ మార్కెట్‌లో కంపెనీ 5.5 లక్షల యూనిట్లకు పైగా వాహనాలను విక్రయించింది. ఇక, 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మహీంద్రా అమ్మకాలలో ఏకంగా 20 శాతం వృద్ధిని సాధించింది.

2023-2024 ఇదే కాలంలో కంపెనీ 4,59,864 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ పెరుగుదలలో థార్ SUV అమ్మకాలు కూడా దోహదం చేశాయి. ఈ ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ 2024-2025 సంవత్సరంలో మొత్తం 84,834 యూనిట్ల విక్రయాలను సాధించింది. గత రెండేళ్ల గణాంకాలు చూస్తే, ఈ మోడల్‌కు పెరుగుతున్న ఆదరణ స్పష్టంగా తెలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో థార్ 65,246 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
2024-25లో ఇది ఏకంగా 30 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. 2022-23లో అమ్మకాలు 47,108 యూనిట్లుగా ఉండగా, అప్పటి నుండి ఇప్పటి వరకు 80 శాతం వృద్ధిని సాధించడమంటే ఈ SUV మీద ప్రజల్లో ఉన్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. థార్ భారీ అమ్మకాలు నమోదు చేయడానికి ప్రధాన కారణం థార్ రాక్స్ అనే 5-డోర్ వెర్షన్‌ను మహీంద్రా విడుదల చేయడం.

ఇది మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి, వినియోగదారుల దృష్టిని మరింతగా ఆకర్షించి, అమ్మకాలను బాగానే పెంచింది. థార్ రాక్స్ గత ఏడాది ఆగస్టు మధ్యలో భారత మార్కెట్లోకి ఘనంగా విడుదలైంది. 2024 అక్టోబర్‌లో అధికారిక బుకింగ్‌లను ప్రారంభించగానే, కేవలం ఒక గంటలోనే 1.76 లక్షలకు పైగా బుకింగ్‌లను నమోదు చేయడం ద్వారా తన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపించింది. డిమాండ్‌ను తీర్చేందుకు మహీంద్రా ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది.
మహీంద్రా థార్ రాక్స్ రియర్-వీల్ డ్రైవ్ (RWD), ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్లలో అందుబాటులో ఉండగా, 4x4 ఆప్షన్ డీజిల్ వేరియంట్లకు మాత్రమే పరిమితం అయింది. వేరియంట్‌ల విషయానికొస్తే, థార్ రాక్స్‌ను మహీంద్రా MX1, MX3, MX5, AX3L, AX5L, AX7L వంటి విభిన్న ఎంపికలతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి వేరియంట్‌ను వినియోగదారుల అవసరాలకు తగ్గట్లు డిజైన్ చేశారు. దీనిలో ఫీచర్స్ కూడా డజన్ల కొద్ది ఉన్నాయి.

కంపెనీ ఇటీవలే మహీంద్రా థార్ రాక్స్ 2025 మోడల్‌ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం దీని బేస్ వేరియంట్ ధర రూ. 12.99 లక్షల నుంచి టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 23.09 లక్షల వరకు ఉంది. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఇది 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల mStallion టర్బో పెట్రోల్, 2.2-లీటర్ నాలుగు సిలిండర్ల mHawk డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








