ఈ 7 సీటర్ ఫ్యామిలీ కారుపై భారీ డిస్కౌంట్.. కొత్తగా కారు కొనేవారికి మంచి ఛాన్స్ ఇస్తున్న మహీంద్రా
దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా (Mahindra) గురించి అందరికీ తెలిసిందే. అధునాతన కార్లను విక్రయిస్తూ, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి తయారీదారులకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. గత ఏడాది భారతీయ వినియోగదారుల కోసం అదిరిపోయే మోడళ్లను తీసుకొచ్చిన కంపెనీ 2025లో కూడా పలు మోడళ్లను తీసుకురావడానికి ప్రణాళికలు చేసింది. ఇదిలా ఉంటే మహీంద్రా తన కార్ల అమ్మకాలను పెంచుకోడానికి సాధారణంగా తగ్గింపు ఆఫర్స్‌ను అందిస్తూ కస్టమర్లను తనవైపు తిప్పుకుంటుంది. ఈ క్రమంలో వారిని ఆకట్టుకోవడానికి మరోసారి తన ప్రసిద్ధ 7 సీటర్ ఎంపీవీ (MPV) కారు అయినటువంటి మారాజ్జో (marazzo)పై భారీ తగ్గింపును అందిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం కుటుంబ ప్రయాణాలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఎక్కువ మంది కలిసి ప్రయాణించే కార్లకు దేశంలో డిమాండ్ బాగా పెరిగింది.
ఈ నేపథ్యంలో ఎంపీవీ కార్లను వాహన తయారీదారులు ఎక్కువగా విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మారాజ్జో 7 సీటర్ ఆప్షన్‌లో మంచి డిమాండ్ ఉన్న మోడల్. దీనిపై మహీంద్రా రూ. 72,500 వరకు డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారు దేశీయ మార్కెట్లో రూ. 14.59 లక్షల నుండి రూ. ఇది 17 లక్షల మధ్య కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు.

తగ్గింపు ఆఫర్ ఇవ్వడం ద్వారా కస్టమర్లను ఆకర్షించాలని, దీంతో మారాజ్జో సేల్స్ పెరుగుతాయని మహీంద్రా భావిస్తుంది. ఇప్పటికే డీలర్ల వద్ద పాత స్టాక్ ఉంది. వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో డిస్కౌంట్స్ ఇచ్చింది. కంపెనీ అందిస్తున్న ఈ తగ్గింపు ఆఫర్ 2024, 2025 మోడల్ సంవత్సరాల్లోని అన్ని వేరియంట్‌లకు వర్తించనున్నాయి. గత ఏడాది ఇది అనుకున్నంత అమ్మకాలు సాధించలేకపోవడంతో ప్రత్యేక తగ్గింపు ద్వారా స్టాక్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది.
మహీంద్రా మారాజ్జో విషయానికి వస్తే, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 121 hp పవర్‌ను, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌ను ఇంజిన్‌కు జోడించారు. ఇది ప్రయాణికుల భద్రత పరంగా కూడా అత్యంత సేఫ్టీ ప్రమాణాలను కలిగి ఉంది. ఇది అన్ని వేరియంట్లలో కూడా ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, వెనుక పార్కింగ్ సెన్సార్లను కలిగి ఉంటుంది.

లోపల ప్రయాణికులకు, డ్రైవర్లకు అవసరమయ్యే ఫీచర్స్ డజన్ల కొద్ది ఉన్నాయి. 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, రిమోట్ కీలెస్ ఎంట్రీ, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. క్యాబిన్ డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎక్స్‌టీరియర్ అందాన్ని పెంచడంలో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ స్టైలిష్‌గా ఉంటాయి. 2024లో ఈ కారు అమ్మకాలు తక్కువగానే నమోదయ్యాయి.
నెలవారీగా విక్రయాలను చూసినట్లయితే జనవరిలో 32 కార్లను సేల్ చేయగా, ఫిబ్రవరి నెలలో 51 కార్స్‌ను, మార్చిలో 51 అమ్మకాలు నమోదు కాగా ఆ తరువాత ఏప్రిల్‌లో మాత్రం తగ్గిపోయి 20 కార్ల కొనుగోళ్లు జరిగాయి. ఇక మే నెలలో మరింత తగ్గి 16 కు క్షీణించాయి. జూన్‌లో అయితే ఏకంగా 12 కార్లకు పడిపోయాయి.

తరువాత జులైలో 14, ఆగస్టులో 8, సెప్టెంబర్‌లో 7, పండగల సీజన్ మొదలవడంతో అక్టోబర్‌లో 37కు పెరిగి, నవంబర్‌లో తగ్గి 9కి, డిసెంబర్‌లో 16 కార్స్ సేల్స్ జరిగాయి. ఇక, ఆఫర్స్ విషయానికి వస్తే, కంపెనీ ఇచ్చిన ఆఫర్స్ నగరాలను బట్టి మారుతాయి. కాబట్టి వినియోగదారులు వీటి గురించిన పూర్తి సమాచారం కోసం దగ్గరలోని డీలర్స్‌ను సంప్రదించడం ఉత్తమం.


Click it and Unblock the Notifications








