ఇండిపెండెన్స్ డే రోజు మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. అదిరిపోయే లుక్‌తో విజన్ S, విజన్ X కాన్సెప్ట్‌లు
భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా ఎప్పటినుంచో తన ప్రత్యేకమైన శైలి, నమ్మకాన్ని నిలబెట్టుకున్న సంస్థ. ముఖ్యంగా ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలకు వచ్చినప్పుడు, మహీంద్రా పేరు ముందే గుర్తుకు వస్తుంది. మంచి డిజైన్, బలమైన పనితీరు, ఎక్స్‌ప్లోరర్ స్పిరిట్‌ను ప్రతిబింబించే వాహనాలతో ఈ బ్రాండ్ ఎప్పుడూ ప్రత్యేకతను చూపింది. ఈసారి, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో, మహీంద్రా భవిష్యత్ దిశగా మరోసారి అడుగుపెట్టింది. విజన్ S, విజన్ X పేర్లతో రెండు అద్భుతమైన కాన్సెప్ట్ ఎస్‌యూవీలను ఆవిష్కరించింది. వీటిని కేవలం వాహనాలుగా కాకుండా, మహీంద్రా రేపటి ఆటోమొబైల్ ప్రపంచాన్ని ఎలా ఊహిస్తోంది అనే దానికి ప్రతీకలుగా పరిచయం చేసింది.
విజన్ S ఆకట్టుకునే రూపం, సాంకేతికత, ఆధునికత కలయిక. ఇది అర్బన్ లైఫ్‌స్టైల్‌కి తగ్గట్టుగా, futuristic స్టైలింగ్, స్మార్ట్ ఫీచర్లతో రూపుదిద్దుకుంది. మరోవైపు, విజన్ X ఆఫ్-రోడ్ సామ్రాజ్యంలో మహీంద్రా DNAను కొనసాగించేలా, దృఢమైన బాడీ, అధునాతన డ్రైవ్‌ట్రెయిన్, కఠినమైన భూభాగాలను అధిరోహించే సామర్థ్యంతో రూపొందించబడింది. ఈ రెండు కార్ల గురించిన ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

మహీంద్రా విజన్ X ముందు భాగం చూసిన క్షణం నుంచే ఇది ఒక futuristic SUV అని స్పష్టంగా తెలుస్తుంది. డిజైన్ షార్ప్‌గా, పొరలుగా తయారైన ప్యానెల్‌లతో, ఒక రకమైన బలమైన రూపాన్ని ఇస్తుంది. పైన స్లిమ్ LED DRLలు హెడ్‌లైట్‌లపై ఎత్తుగా ఉండి, వాటి కింద, నిలువుగా పేర్చిన LED ప్రొజెక్టర్ ఎలిమెంట్స్, వాటిని చుట్టుముట్టే స్ప్లిట్ హెడ్‌లైట్ డిజైన్, వాహనానికి ఒక ప్రత్యేకమైన లుక్‌ని ఇస్తాయి.
గ్రిల్ విషయానికి వస్తే, అది పూర్తిగా X-ఆకారపు మెష్ ప్యాటర్న్‌తో ఆకట్టుకుంటుంది. ఇది కేవలం డిజైన్ మాత్రమే కాదు, విజన్ X అనే పేరుతో నేరుగా అనుసంధానమై, ఈ కాన్సెప్ట్‌ను ఒక చూపులోనే గుర్తించేలా చేస్తుంది. ఈ భారీ గ్రిల్ మధ్యలో, మహీంద్రా ట్విన్ పీక్స్ లోగో గర్వంగా మెరిసిపోతూ, బ్రాండ్ ఐడెంటిటీని మరింత బలోపేతం చేస్తుంది. ఇంటీరియర్‌లో BE 6 లాంటి ఆధునిక కాక్‌పిట్‌ను అందిస్తుందనిపిస్తుంది.

లోపల రెండు 12.3 అంగుళాల పెద్ద డిస్ప్లేలు, ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి ఇన్స్ట్రుమెంటేషన్ కోసం. ఈ డ్యూయల్-స్క్రీన్ సెటప్, కేవలం టెక్నాలజీని చూపించడమే కాకుండా, డ్రైవర్‌కు ఒక futuristic డ్రైవింగ్ అనుభవాన్ని అందించేలా డిజైన్ చేయబడింది. మొత్తం మీద, విజన్ X ముందు భాగం శైలి, శక్తి, భవిష్యత్ దృష్టిని ఒకేసారి ప్రతిబింబిస్తూ, ఇదే రేపటి మహీంద్రా అని చెప్పేలా ఉంటుంది.
విజన్ S విషయానికి వస్తే, పూర్తిగా ఒక కొత్త తరం బొలెరోలా అనిపిస్తుంది, కానీ మరింత ఆధునిక, ఆగ్రెసివ్, భవిష్యత్‌దృష్టితో రూపుదిద్దుకున్న వెర్షన్. ముందుభాగంలో L-ఆకారపు LED DRLలు కొత్త డిజైన్ గ్రిల్‌లో సమర్థంగా విలీనం కావడం, లైటింగ్ సిగ్నేచర్‌ను మరింత స్టైలిష్‌గా మార్చింది. ఈ గ్రిల్ మధ్యలో మహీంద్రా సిగ్నేచర్ ట్విన్-పీక్స్ లోగో గర్వంగా మెరిసిపోతూ బ్రాండ్ ప్రెజెన్స్‌ను పెంచుతోంది.

ముందు, వెనుక భాగాల్లో ఉండే ఐస్-క్యూబ్ LED ఫాగ్ లైట్లు, కేవలం ఫంక్షనల్ కాకుండా, డిజైన్‌కు ఒక రగ్గ్డ్ లుక్‌ను జోడిస్తాయి. కాంట్రాస్ట్ కలర్ స్కిడ్ ప్లేట్లు, ముందు ఎయిర్ డ్యామ్‌పై అమర్చిన ADAS సెన్సార్, ఈ SUV భవిష్యత్ టెక్నాలజీని కూడా దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దుకున్నట్లు సూచిస్తాయి. సైడ్ ప్రొఫైల్ వైపు చూడగానే, మెషిన్డ్ అల్లాయ్ వీల్స్, పెద్ద వీల్ ఆర్చ్‌లు వెంటనే కళ్లలో పడతాయి.
రూఫ్-మౌంటెడ్ ఆక్స్ లైట్లు ఆఫ్-రోడ్ అడ్వెంచర్లలో సహాయకంగా ఉండటమే కాకుండా, SUVకి ఒక ఎక్స్‌పెడిషన్ రెడీ వైబ్ ఇస్తాయి. ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, స్లిమ్ ORVMలు, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ విజన్ S స్టైలీష్ రూపాన్ని చూపిస్తున్నాయి. ఈ కారు ఫ్రంట్, రియర్-డ్రైవ్ ఆప్షన్లలో, రైట్-హ్యాండ్ డ్రైవ్, లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ మార్కెట్లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








