మహీంద్రా ఆ మోడల్ కార్స్ కావాలంటే ఏడాది ఆగాలా.. అవి అంత స్పెషల్ కాబట్టే ఇంత డిమాండ్ మరి ?
మహీంద్రా XUV 3XO(Mahindra XUV 3XO), XUV 700 SUV కార్లకు వినియోగాదారుల్లో మంచి ఆదరణ ఉంది. ఈ కార్లకు మార్కెట్లో ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉంది. 3XO కారు ఇటీవల లక్ష యూనిట్ల మైలురాయిని చేరుకుంది. అలాగే, XUV 700 కారు 2.5 లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించింది. ఈ కార్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతున్నందున వాటి వెయిటింగ్ పిరియడ్ కూడా పెరిగింది.
మహీంద్రా కంపెనీకి చెందిన ఈ రెండు కార్లకు భారీగా బుకింగ్స్ వెల్లువెత్తడంతో ఆ కంపెనీ అప్పుడే ఈ కార్ల ఉత్పత్తిని భారీగా పెంచింది. ఈ మే నెలలో XUV 3XO, XUV 700 కార్ల డెలివరీలు మార్చి నెలతో పోలిస్తే దాదాపు రెట్టింపు అయ్యాయి. అయినప్పటికీ, బుకింగ్‌లు అంతకంటే ఎక్కువగా వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మహీంద్రా 3XO కారు వెయిటింగ్ పిరియడ్ వివరాలు ప్రస్తుతం బయటకు వచ్చాయి. దీని ప్రకారం కంపెనీ MX1 వేరియంట్ కారు కోసం సుమారు సంవత్సరానికి పైగా వెయిటింగ్ పిరియడ్ ఉంది. ఈ కారు రూ. 7.99 లక్షల ధరతో అమ్ముడవుతోంది. ఈ కారు డీజిల్ వేరియంట్‌లో అందుబాటులో లేదు.
మహీంద్రా 3XO MX2, MX2 ప్రో (Pro) వేరియంట్‌ల విషయానికి వస్తే.. పెట్రోల్ వేరియంట్ కార్ల కోసం గరిష్టంగా 3 నెలల వరకు, డీజిల్ వేరియంట్ కార్ల కోసం గరిష్టంగా నెల వరకు వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది. ఈ కారు రూ. 9.54 లక్షల నుంచి రూ. 10.64 లక్షల ధరతో అమ్ముడవుతోంది.

తదుపరి, MX3, MX3 ప్రో (Pro) వేరియంట్‌లు, AX5 కార్ల పెట్రోల్ వేరియంట్‌లకు గరిష్టంగా 2 నెలల వరకు, డీజిల్ వేరియంట్ కార్లకు గరిష్టంగా నెల వరకు వెయిటింగ్ పిరియడ్ ఉంది. MX3 వేరియంట్ విషయానికి వస్తే ఇది రూ. 9.74 లక్షల నుంచి రూ. 11.79 లక్షల ధరతో అమ్ముడవుతోంది. అలాగే, AX5 వేరియంట్ రూ. 11.19 లక్షల నుంచి రూ. 12.99 లక్షల ధరతో అమ్ముడవుతోంది.
తదుపరి, AX5 L, AX7, AX7 L వేరియంట్‌లలో పెట్రోల్, డీజిల్ వేరియంట్ కార్లకు గరిష్టంగా ఒక నెల మాత్రమే వెయిటింగ్ పిరియడ్ ఉంది. ఈ కారు రూ. 12.62 లక్షల నుంచి రూ. 15.80 లక్షల ధరతో అమ్ముడవుతోంది.

ఆ తర్వాత మహీంద్రా XUV 700 కారులో ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) వేరియంట్ మినహా మిగిలిన అన్ని వేరియంట్ కార్లకు గరిష్టంగా ఒక నెల మాత్రమే వెయిటింగ్ పిరియడ్ ఉంది. ఈ కారు రూ. 14.49 లక్షల నుంచి రూ. 25.14 లక్షల ధరతో అమ్ముడవుతోంది. ఈ కారుకు గతంలో 2 సంవత్సరాల వరకు నిరీక్షణ కాలం ఉండేది. ఇప్పుడు ఉత్పత్తిని పెంచడం వల్ల వెయిటింగ్ పిరియడ్ తగ్గింది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: మహీంద్రా కంపెనీ ఉత్పత్తులు అంటేనే వెయిటింగ్ పిరియడ్ ఎక్కువగా ఉంటుందన్న అపోహ ఉంది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. కొన్ని నిర్దిష్ట వేరియంట్‌లకు మాత్రమే వెయిటింగ్ పిరియడ్ ఎక్కువగా ఉంది. ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కార్లకు గరిష్టంగా నెల మాత్రమే వెయిటింగ్ పిరియడ్ ఉంది. ఇది ఖచ్చితంగా మంచి పురోగతి.


Click it and Unblock the Notifications








