చీనాబ్ వంతెన మీదుగా కాశ్మీర్ లోయలోకి తొలిసారిగా కార్ల రైలు.. చారిత్రక ఘనత సాధించిన మారుతి సుజుకి
భారత వాహన మార్కెట్‌లో అనేక విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేసిన సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki). దేశ ప్రజల అవసరాలను, అభిరుచులను తెలుసుకుని సరైన రీతిలో పనిచేసే మరో బ్రాండ్ ఉందా అనిపించేలా మారుతి సుజుకి పని చేస్తోంది. ఇప్పుడు భారత ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రలో అరుదైన ఘనతను సాధించింది. కశ్మీర్ లోయకు రైలు మార్గం ద్వారా వాహనాలను చేరవేసిన మొట్టమొదటి కార్ల తయారీ సంస్థగా మారుతి సుజుకి తన పేరును లిఖించుకుంది. హర్యానాలోని మనేసర్ ప్లాంట్ రైల్వే సైడింగ్ నుండి జమ్మూ కశ్మీర్‌లోని కొత్తగా ప్రారంభించిన అనంత్‌నాగ్ రైల్వే టెర్మినల్‌కు ఈ కార్లు రైలులో చేరుకున్నాయి.
మనేసర్ ప్లాంట్ నుండి అనంత్‌నాగ్ రైల్వే టెర్మినల్ వరకు దాదాపు 850 కిలోమీటర్ల దూరం. బ్రెజా (Brezza), డిజైర్ (Dzire), వాగన్ఆర్ (WagonR), ఎస్-ప్రెస్సో (S-Presso) వంటి 100కు పైగా మారుతి కార్లు మొదటి రైలులో కశ్మీర్‌కు చేరుకున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాలకు రైలు మార్గం ద్వారా వాహనాలను రవాణా చేయడం సాధారణమే అయినప్పటికీ, కశ్మీర్‌కు కార్లు రైలులో చేరడం ఇదే మొదటిసారి. ఇది చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉన్న సంఘటన.
ఈ రైలు చీనాబ్ నది (Chenab River) మీదుగా ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ గుండా ప్రయాణించింది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ మార్గాన్ని ఈ ఏడాది ప్రారంభంలో ప్రారంభించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) ఈ చర్యను అభినందించారు. జమ్మూ-శ్రీనగర్ రైల్వే లైన్ ఈ ప్రాంతానికి గేమ్‌ఛేంజర్ అని అభివర్ణించారు.

ఇటీవల కశ్మీర్ లోయ నుండి ఆపిల్ పండ్లను కూడా జమ్మూ కశ్మీర్ రైల్ లింక్ ఉపయోగించి రవాణా చేశారు. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి తమ కార్లను రైలు మార్గం ద్వారా కశ్మీర్ లోయకు రవాణా చేస్తోంది. ఈ రైల్వే లైన్ జమ్మూ కశ్మీర్‌లోని లాజిస్టిక్స్‌ను, ప్రజల జీవనశైలిని మారుస్తోందని అశ్విని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు.
మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకూచి మాట్లాడుతూ.. రైల్వే ద్వారా రవాణా తమ లాజిస్టిక్స్ వ్యూహానికి కేంద్రబిందువు అని అన్నారు. చీనాబ్ వంతెన తమ కశ్మీర్ లోయలోని కస్టమర్లకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడానికి వీలు కల్పిస్తుందని, దేశవ్యాప్తంగా అద్భుతమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేసిన ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

మారుతి మనేసర్, గుజరాత్ తయారీ ప్లాంట్‌లలో రెండు ఇన్-ప్లాంట్ రైల్వే సైడింగ్‌లను నిర్వహిస్తోంది. దీని ద్వారా తయారైన కార్లను దేశంలోని వివిధ ప్రాంతాలకు రైల్వే ద్వారా చేరవేస్తోంది. 2013లో ఆటోమొబైల్ ఫ్రైట్ ట్రైన్ ఆపరేటర్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి.
2015 ఆర్థిక సంవత్సరం నుండి భారతీయ రైల్వేల ద్వారా మారుతి సుజుకి 2.6 మిలియన్లకు పైగా వాహనాలను రవాణా చేసింది. ఇది రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించింది. రైలు మార్గం ద్వారా కశ్మీర్ లోయకు వాహనాలు చేరడం కంపెనీకి ఒక మైలురాయి మాత్రమే కాదు, ప్రాంతీయ కనెక్టివిటీ, వాణిజ్యం, సుస్థిరతను పెంపొందించడంలో భారతీయ రైల్వేల పెరుగుతున్న పాత్రను కూడా ఇది ప్రతిబింబిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: మారుతి సుజుకి సాధించిన ఈ చారిత్రక విజయం భారత ఆటోమొబైల్ పరిశ్రమలో రైల్వే రవాణా ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. కశ్మీర్ వంటి ప్రాంతాలకు సులభమైన రవాణా మార్గాలను అందించడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది.


Click it and Unblock the Notifications








