మారుతి సుజుకి ధమాకా.. 28 కి.మీ మైలేజీతో ఎస్‌యూవీ.. ధర పాతదే కానీ, కొనడానికి కొత్త కారణం చెప్పిన కంపెనీ!
భారత మార్కెట్లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా ఆధిపత్యాన్ని చెరిపేయడానికి మారుతి సుజుకి ఎంతో శ్రమించి తయారు చేసిన మోడల్ గ్రాండ్ విటారా. టయోటాతో భాగస్వామ్యంలో రూపొందించిన ఈ కారు, మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి విజయవంతంగా దూసుకుపోతోంది. దీనికి ప్రధాన కారణం, అద్భుతమైన మైలేజ్ అని చెప్పవచ్చు.
ఈ సెగ్మెంట్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన మొదటి కారు ఇదే. మంచి ప్రాక్టికాలిటీ, విశాలమైన స్థలంతో ఈ ఎస్‌యూవీలో ఐదుగురు సులభంగా ప్రయాణించవచ్చు. ఇప్పుడు, పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని మారుతి గ్రాండ్ విటారాలో కొన్ని చిన్నపాటి మార్పులను తీసుకొచ్చింది. ధరను మాత్రం పాతదే ఉంచింది.

నెక్సా 10వ వార్షికోత్సవం సందర్భంగా మారుతి ఇటీవల గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు గ్రాండ్ విటారా సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లలో కొత్త రంగులను తీసుకొచ్చింది. బేస్ వేరియంట్ అయిన సిగ్మాలో మూడు కొత్త రంగులు లభిస్తాయి.. నెక్సా బ్లూ, గ్రాండియర్ గ్రే, పెరల్ మిడ్‌నైట్ బ్లాక్.
ఇంతకుముందు సిగ్మా వేరియంట్ కేవలం ఆర్కిటిక్ వైట్ రంగులో మాత్రమే ఉండేది. దీంతో ఈ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి నిరాశ తప్పేది కాదు. ఇప్పుడు కొత్త రంగుల ఆప్షన్లు అందుబాటులోకి రావడంతో బేస్ మోడల్ కొనుగోలుదారులకు మరిన్ని ఎంపికలు లభించనున్నాయి.

డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లలో కొత్తగా పెరల్ మిడ్‌నైట్ బ్లాక్ రంగు లభిస్తుంది. ఈ కొత్త రంగుల చేరికతో గ్రాండ్ విటారా మొత్తం ఏడు రంగులలో లభిస్తుంది.. నెక్సా బ్లూ, స్ప్లెండిడ్ సిల్వర్, ఒపులెంట్ రెడ్, గ్రాండియర్ గ్రే, ఆర్కిటిక్ వైట్, చెస్ట్నట్ బ్రౌన్, పెరల్ మిడ్‌నైట్ బ్లాక్.
ఈ కొత్త రంగుల వేరియంట్లు ఆగస్టు 2025 చివరి నుండి లభిస్తాయి, సిగ్మా ట్రిమ్‌కు కొత్త రంగులు సెప్టెంబర్ మధ్య నుండి అందుబాటులోకి వస్తాయని మారుతి సుజుకి ప్రకటించింది. కొత్త రంగులు వచ్చినా ధరలలో ఎలాంటి మార్పు లేకపోవడం వినియోగదారులకు శుభవార్త.

గ్రాండ్ విటారా సిగ్మా మాన్యువల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.11.42 లక్షలు. డెల్టా మాన్యువల్ మరియు డెల్టా ఆటోమేటిక్ ధరలు వరుసగా రూ.12.53 లక్షలు మరియు రూ.13.93 లక్షలు. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్ ఉన్న డెల్టా ప్లస్ ధర రూ.16.99 లక్షల నుంచి మొదలవుతుంది. మారుతి గ్రాండ్ విటారా యొక్క అత్యంత తక్కువ ధర కలిగిన స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ ఇదే.
జపనీస్ ఆటోమొబైల్ సంస్థ టయోటాతో కలిసి అభివృద్ధి చేసిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా 2022లో విడుదలైనప్పటి నుంచి మంచి అమ్మకాలు సాధిస్తోంది. ఇప్పటివరకు 3 లక్షల కంటే ఎక్కువ మంది ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. ఇందులో 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ మరియు 1.5 స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.
మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ 102 బీహెచ్‌పీ శక్తిని, 137 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. సిఎన్‌జి పవర్‌ట్రెయిన్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ 113 బీహెచ్‌పీ పవర్, 122 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇది ఈసీవీటీ (eCVT) ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. హైబ్రిడ్ వేరియంట్ 27.97 కి.మీ మైలేజ్, మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్ 19.38 కి.మీ మైలేజ్, సిఎన్‌జి వేరియంట్ 26.6 కి.మీ మైలేజ్ ఇస్తాయని మారుతి చెబుతోంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లతో ఇది మార్కెట్‌లో పోటీ పడుతోంది.


Click it and Unblock the Notifications








