మారుతి షోరూమ్‌కు ఎగబడ్డ జనం.. ఎప్పుడూ లేనంత రద్దీ.. నవరాత్రి మొదటిరోజే రికార్డులు
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఆటోమొబైల్ రంగానికే కాదు, వినియోగదారులకూ కూడా శుభవార్తగా మారింది. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారం, వాహనాలపై ఇంతవరకు 28 శాతం వసూలు చేసిన పన్ను 18 శాతానికి తగ్గించబడింది. ఈ నిర్ణయం అమలులోకి రావడంతో దేశవ్యాప్తంగా కార్లు, బైకుల ధరలు గణనీయంగా తగ్గాయి. ధరలు పడిపోవడంతో వినియోగదారుల్లో ఉత్సాహం రెట్టింపైంది. అసలుకే దేశంలో దసరా పండుగ సమయం దగ్గరపడుతుండటంతో, ప్రజలు ఈ సమయంలో కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అలాంటి సమయంలో ధరలు తగ్గడంతో, ఈ అవకాశం వదులుకోవద్దని భావించి, షోరూమ్‌లకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ముఖ్యంగా దేశీయంగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి షోరూమ్‌లలో అసలు పండుగ వాతావరణం నెలకొంది. కొత్తగా వచ్చిన సమాచారం ప్రకారం, కంపెనీ కార్లను కొనుగోలు చేయడానికి సుమారు 80,000 మంది కస్టమర్లు ఎంక్వైరీలు జరిపారు. వీటిలో దాదాపు 30,000 యూనిట్లను కస్టమర్లకు డెలివరీ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే, ఒక్క రోజులోనే ఇంత పెద్ద సంఖ్యలో వాహనాలు డెలివరీ కావడం ఒక రికార్డే అని చెప్పొచ్చు.

నవరాత్రి ప్రారంభం, జీఎస్టీ తగ్గింపు, ఈ రెండు కీలక సంఘటనలు ఒకేసారి కలిసిపోవడంతో ఆ రోజు దేశ ఆటోమొబైల్ చరిత్రలో మిగిలిపోయేలా మారింది. షోరూమ్‌ల వద్ద కస్టమర్ల రద్దీ, కొత్త వాహనం ఇంటికి తీసుకెళ్లిన కుటుంబాల ఆనందం, డెలివరీ సమయంలో జరిగిన సంబరాలు అన్నీ కలిపి ఆ రోజు ఒక పండుగలా మారాయి. ఆటో రంగానికి ఇది ఒక గోల్డెన్ మూమెంట్‌గా నిలిచిపోయింది.
దేశంలో కొత్త జీఎస్టీ అమలు ప్రారంభమైన తర్వాత ఆటోమొబైల్ మార్కెట్లో ఊహించని రీతిలో కదలికలు చోటుచేసుకున్నాయి. ధరలు తగ్గడంతో పెద్ద ఎత్తున కొత్త వాహనాలపై దృష్టి సారించారు. చిన్న కార్ల విభాగంలో డిమాండ్ గణనీయంగా పెరిగింది. నివేదికల ప్రకారం, ధరలు తగ్గిన వెంటనే చిన్న కార్ల బుకింగ్‌లు 50 శాతం పెరిగాయి. సోమవారం కార్లను కొనుగోలు చేసేందుకు అనేక మంది కస్టమర్లు డీలర్‌షిప్‌లకు తరలిరావడంతో ఆటోమోటివ్ డీలర్‌షిప్‌లు కిక్కిరిసి పోయాయి.

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(FADA), ఇంత భారీగా రద్దీ కావడం చాలా అరుదని వెల్లడించింది. అదే సమయంలో, మారుతి సుజుకి మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ కూడా కీలక వ్యాఖ్య చేశారు. గత 35 ఏళ్లలో ఎప్పుడూ చూడని స్థాయిలో కస్టమర్ల రద్దీ ఈసారి నమోదైందని, ఇంత డిమాండ్‌కు కారణం ఒకవైపు జీఎస్టీ తగ్గింపు, మరోవైపు నవరాత్రి ప్రారంభదినం కావడమేనని ఆయన వివరించారు.
ఫలితంగా, ఒకే రోజులో దేశంలోని షోరూమ్‌లు పండుగ మేళాల్లా మారిపోయాయి. కొత్త కార్లను కొనుగోలు చేసిన కుటుంబాల ఆనందం, డెలివరీలతో సందడి చేసిన షోరూమ్‌లు మొత్తం ఆటోమొబైల్ రంగానికి చరిత్రలో నిలిచిపోయే రోజును మిగిల్చాయి. ప్రస్తుతం దేశంలో మారుతి సుజుకి కార్లు కస్టమర్లకు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చాయి. కొత్త జీఎస్టీ రేట్ల అమలు తరువాత, ధరలు గణనీయంగా తగ్గిపోవడంతో మారుతి చిన్న కార్ల ధరలు వరకు అందుబాటులోకి వచ్చాయి.

మారుతి కారు ఎస్-ప్రెస్సో ఇప్పుడు భారత మార్కెట్లో అత్యంత చౌకైన కారు గౌరవాన్ని సంపాదించింది. ఇంతకుముందు రూ.4.26 లక్షలుగా ఉన్న ఎస్-ప్రెస్సో ప్రారంభ ధరను కంపెనీ భారీగా తగ్గించి ఇప్పుడు కేవలం రూ.3,49,900గా నిర్ణయించింది. అంటే ఒకేసారి రూ.76,000 వరకు తగ్గింపు లభించింది. అంతేకాదు, ఈ మోడల్ టాప్-ఎండ్ CNG వేరియంట్ ధర గణనీయంగా తగ్గింది. గతంలో రూ.6.11 లక్షలు ఉండగా, ఇప్పుడు అది కేవలం రూ.5.11 లక్షలకే లభిస్తోంది.


Click it and Unblock the Notifications








