ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్ల ఫేవరెట్ కారు..! కేవలం రూ. 4 లక్షలకే 34 కి.మీ మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగులు
భారతదేశపు కార్ల తయారీలో అతిపెద్ద సంస్థగా అవతరించిన మారుతీ సుజుకీ (maruti suzuki)కి చెందిన ప్రసిద్ధ కార్లలో ఆల్టో K10 (alto k10) ఒకటి. ఇది దేశంలోని అన్ని వర్గాల ప్రజలలో బాగా ప్రసిద్ధి చెందిన మోడల్. ముఖ్యంగా సాధారణ మధ్యతరగతి ప్రజలకు ఫేవరెట్. ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ కారు, సౌకర్యం, మైలేజ్, బడ్జెట్ ధరల కారణంగా ఇప్పటికీ కోట్లాదిమంది మనసు గెలుచుకుంటోంది. ఈ హ్యాచ్‌బ్యాక్ కారుకి సంబంధించిన 2024-25 ఆర్థిక సంవత్సరం అమ్మకాల గణాంకాలు విడుదలయ్యాయి. డేటా ప్రకారం, 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చి 31 వరకు మారుతీ సుజుకీ మొత్తం 1,02,232 ఆల్టో K10 యూనిట్లను విక్రయించింది.
అయితే గతంతో పోలిస్తే ఇది తక్కువే. గత సంవత్సరం, అంటే 2023-24లో మాత్రం 1,11,955 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో పోలిస్తే, ఈ సంవత్సరం అమ్మకాలు సుమారుగా 9 శాతం తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్‌లో కొత్త కార్లు విడుదల కావడం, ఖర్చులు పెరగడం, మారుతున్న వినియోగదారుల అభిరుచులు ఇలా పలు కారణాల వల్లే ఈ తక్కువ అమ్మకాలు జరిగినట్టుగా అంచనా. అమ్మకాలు తగ్గుదల స్వల్ప కాలం అని అధికారులు భావిస్తున్నారు.

అమ్మకాలు కొంత తగ్గినా, టాప్ 10 హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఆల్టో K10 నాల్గవ స్థానంలో నిలిచింది. దీనికి ముందు మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బాలెనో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. తరువాత నాల్గవ స్థానంలో ఆల్టో K10 నిలిచి మార్కెట్లో తనకు ఉన్న డిమాండ్‌ను మరోసారి రుజువు చేసుకుంది. చూడటానికి చిన్న కారు అయినప్పటికి పెద్ద కార్లకు గట్టి పోటీ ఇస్తూ అమ్మకాల్లో మెరుగైన గణంకాలను సాధిస్తుంది.
ఫ్యామిలీ కారుగా, మొదటి కారుగా, రోజువారి అవసరాల కోసం ఉపయోగపడుతుంది. ఆల్టో K10 కారును ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, డాక్టర్లు, చిన్న కుటుంబం గల వారు కొనుగోలు చేస్తుంటారు. అమ్మకాల్లో తగ్గుదల కనిపించినప్పటికీ, అది పెద్దగా ఆందోళన కలిగించే విషయం కాదు. ఎందుకంటే ఇది "స్వల్ప తగ్గుదల" మాత్రమే. గత ఏడాదితో పోలిస్తే 9 శాతం అమ్మకాలు తగ్గినా, 1,02,232 యూనిట్లు అమ్ముడు పోవడం చిన్న విషయం కాదు.

భారతదేశంలోని కార్ల మార్కెట్ ఎంత పోటీగా మారుతుందో మనందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆల్టో K10 నిలకడగా అమ్మకాలు సాధిస్తుండటం గమనించదగ్గ విషయం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఆల్టో K10 మళ్లీ ఫామ్‌లోకి వచ్చి ఇంకా ఎక్కువ అమ్మకాలను నమోదు చేస్తుందని మారుతీ అంచనాలు పెట్టుకుంది. ప్రస్తుత మార్కెట్లో ఈ హ్యాచ్‌బ్యాక్ కారు కేవలం రూ. 4.23 లక్షల ప్రారంభ ధరకు లభిస్తోంది.
అధునాతన ఫీచర్లు ఉన్న టాప్ వేరియంట్ ధర కూడా కేవలం రూ. 6.21 లక్షలు మాత్రమే. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ వచ్చే సరికి స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది. చిన్న కుటుంబాలకు, కొత్తగా డ్రైవింగ్ ప్రారంభించేవాళ్లకు, సిటీల్లో ప్రయాణాలు చేసే వినియోగదారులకు ఇది నమ్మకమైన ఎంపికగా కొనసాగుతోంది. ఇంత తక్కువ ధరలో లభిస్తున్న కారులో 6 ఎయిర్‌బ్యాగులు అందించారు.

ఇది కేవలం టాప్ వేరియంట్‌లో మాత్రమే కాకుండా, ఎంట్రీ లెవల్ వేరియంట్‌లో కూడా అందించారు. ప్రయాణికుల సేఫ్టీకి కంపెనీ ఇస్తున్న ప్రాధాన్యతను ఇది తెలియజేస్తుంది. ఆల్టో K10 CNG వేరియంట్ 33.40 కిలోమీటర్ల మైలేజీని అందిస్తోంది. పెరిగిన ఇంధన ధరల మధ్య, ఇది వినియోగదారులకు మంచి కారుగా ఉపయోగపడుతుంది. ఇది తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లను, సేఫ్టీ, ఎక్కువ మైలేజీని అందిస్తూ మార్కెట్లో పేద, మధ్య తరగతి కారుగా పేరొందింది.


Click it and Unblock the Notifications








