మళ్ళీ తన దూకుడును చూపించిన 31 కి.మీల మైలేజ్ ఇచ్చే మారుతీ కారు.. అది ఏ మోడల్ అంటే?
భారతీయ ఆటోమొబైల్ ప్రపంచంలో బాలెనో అనే పేరు తెలియని వారు ఉండరు. మారుతీ సుజుకీ నుంచి వచ్చినటువంటి ఈ మోడల్ 2015 అక్టోబర్ చివరలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. నెక్సా డీలర్షిప్ ద్వారా విక్రయించబడిన ఈ కార్, ఆ సంస్థకు ప్రీమియం సెగ్మెంట్లో గట్టి స్థానం సంపాదించేలా చేసింది. ఈ బాలెనో హ్యాచ్‌బ్యాక్ తన ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, మంచి మైలేజ్, లోపల విశాలమైన ఇంటీరియర్ వంటి అంశాలతో వినియోగాదారులను ఆకట్టుకుంటుంది. ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటిగా మారింది. ఇదిలా ఉంటే కంపెనీ తాజాగా ఏప్రిల్ 2025కు సంబంధించిన అమ్మకాల వివరాలను విడుదల చేసింది.
డేటా ప్రకారం, గత నెల భారత ఆటోమొబైల్ మార్కెట్లో, మారుతీ సుజుకీ బాలెనో మళ్లీ తన హోదాను నిలబెట్టుకుంది. ఏప్రిల్ 2025లో ఇండో-జపనీస్ భాగస్వామ్యంతో అభివృద్ధి చెందిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మొత్తం 13,180 యూనిట్ల విక్రయాలను సాధించింది. మార్చి నెలలో 12,357 కార్ల విక్రయాల తర్వాత, ఏప్రిల్‌లో 823 యూనిట్ల పెరుగుదల బాలెనోకు మంచి ఊపు ఇచ్చింది. ఇవి వినియోగదారుల నమ్మకానికి అద్దం పడే గణాంకాలు.

ప్రతి నెల వేలకొలది కార్లు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నా, బాలెనో మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ, ఏప్రిల్ 2025లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లలో 10వ స్థానంలో నిలిచింది. ఇది మారుతీ సుజుకీకి మాత్రమే కాదు, బాలెనో అభిమానులకు కూడా ఒక గర్వకారణం. ఈ విజయాన్ని సాధించడంలో, మారుతీ సుజుకీ టెక్నాలజీ అభివృద్ధి, విశ్వసనీయత, సేవల నాణ్యత వంటి అంశాలు కీలక పాత్ర పోషించాయి.
జూన్ 2024 నాటికి బాలెనో 1.5 మిలియన్ యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించి సత్తా చాటింది. వ్యాగన్ ఆర్ 13,413 యూనిట్ల విక్రయాలతో టాప్ 10 కార్ల జాబితాలో 9వ స్థానాన్ని సంపాదించగా, బాలెనో 13,180 యూనిట్లతో కేవలం 233 తేడాతో 10వ స్థానానికి పరిమితమైంది. బాలెనో ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా నెక్సా డీలర్ నెట్‌వర్క్ ద్వారా విక్రయించబడుతుండగా, వ్యాగన్ ఆర్ సాధారణ మారుతి డీలర్‌షిప్ ద్వారా అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుతం మారుతీ సుజుకీ నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తున్న ఎనిమిది మోడళ్లలో, బాలెనో తనదైన ప్రత్యేకతతో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో వినియోగదారుల హృదయాలను గెలుచుకుంటూ, అత్యధికంగా అమ్ముడవుతున్న నెక్సా కార్లలో ఒకటిగా నిలిచింది. దీని బేస్ వేరియంట్‌ను రూ. 6.70 లక్షల ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. టాప్ వేరియంట్ రూ. 9.92 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో లభింస్తుంది.
బాలెనో పెట్రోల్, CNG రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికల్లో లభిస్తోంది. ముఖ్యంగా, CNG వేరియంట్ వినియోగదారులకు మంచి మైలేజ్‌ను అందిస్తుంది. కంపెనీ ప్రకారం, బాలెనో CNG వేరియంట్ 30.61 కి.మీ/కి.జీ మైలేజ్‌ను అందించగలదు. భారతీయులు దీన్ని రోజువారీ వినియోగానికి, ఆర్థికపరమైన ప్రయోజనాల కోసం ప్రధానమైన ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. పెరిగిన ఇంధన ధరలతో తక్కువ మెయింటనెన్స్ కావాలనుకునే వారికి ఇది బలమైన ఎంపిక అవుతుంది.

ఈ కారులో ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించి అనేక అత్యుత్తమ ప్రమాణాలను అందించారు. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో 6 ఎయిర్‌బ్యాగులు స్టాండర్డ్‌గా కాకుండా, టాప్ వేరియంట్లలో మాత్రమే అందించారు. కానీ ఎంట్రీ-లెవల్ వేరియంట్ నుండి టాప్ వేరియంట్ వరకు అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా అందించడం ఇంకా మంచిది. ఈ ఏడాది చివరి నాటికి అన్ని మోడళ్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చనున్నట్లు కంపెనీ ఇటీవల ప్రకటించింది.


Click it and Unblock the Notifications








