పెట్రోల్, డీజిల్‌ను మర్చిపోయి సీఎన్జీ వైపు ప్రజలు.. ఈ ఫ్యామిలీ కారు కోసం ఏకంగా షోరూమ్ ముందు క్యూ!
మారుతీ సుజుకీ భారతీయ కారు మార్కెట్లో తనదైన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. మొత్తం కార్ల అమ్మకాలలో సగం వాటా దాదాపు 50 శాతం మారుతీ సుజుకీ ఖాతాలోనే చేరడం, ఈ బ్రాండ్‌కి ఉన్న విస్తృత ప్రజాదరణకు నిదర్శనం. రెండు కార్లు అమ్ముడైతే, వాటిలో ఒకటి మారుతీ సుజుకీకి చెందినదే అవుతుందన్నది సాధారణంగా వినిపించే మాట. 2025 ఆర్థిక సంవత్సరంలో, మారుతీ సుజుకీకి ఫ్యామిలీ వినియోగదారుల నుంచి మరింత ఆదరణ లభించింది. ముఖ్యంగా, పెద్ద కుటుంబాల కోసం రూపొందించిన 7-సీటర్ మోడళ్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. పెట్రోల్ ధరల పెరుగుదల, ఆపరేటింగ్ ఖర్చులపై ఎక్కువ ఖర్చు చేయాలన్న ఆలోచనతో, వినియోగదారులు సీఎన్జీ (Cng) వాహనాల వైపుకు మరింతగా మొగ్గు చూపుతున్నారు.
మొత్తం అమ్మకాలలో సుమారుగా 33 శాతం కంటే ఎక్కువ వాటా సీఎన్జీ మోడళ్లదే కావడం, ఈ ధోరణిని స్పష్టంగా చూపిస్తుంది. సరళంగా చెప్పాలంటే, మారుతీ మూడు కార్లను విక్రయిస్తే, వాటిలో ఒకటి సీఎన్జీ వేరియంట్ కావడం విశేషం. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం 17,60,765 కార్లను విక్రయించింది. వీటిలో 11,48,363 యూనిట్లు పెట్రోల్ ఇంజిన్ కార్లు కాగా, సీఎన్జీ వేరియంట్లు 5,91,730 యూనిట్లు ఉన్నాయి.

హైబ్రిడ్ వేరియంట్లూ స్థిరంగా తమ స్థానం పెంచుకుంటూ 20,672 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. ఒకప్పటి డీజిల్ వేరియంట్లను కంపెనీ నిలిపివేసిన తర్వాత, సీఎన్జీ మోడళ్లకు తిరుగులేని డిమాండ్ నెలకొన్నది. ఆ క్రమంలో, మారుతీ ఎర్టిగా సీఎన్జీ వేరియంట్ ప్రత్యేకంగా వినియోగదారుల గుండెల్లో స్థానం సంపాదించింది. అందరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మారుతి సుజుకీ తన మోడల్ లైనప్‌ను విస్తరిస్తుంది. సీఎన్జీ వేరియంట్లలో ఎర్టిగా ప్రత్యేకమైన స్థానం సంపాదించింది.
పెద్ద కుటుంబాల అవసరాలకు తగినట్లు డిజైన్ చేయబడిన 7-సీటర్ ఎర్టిగా మోడల్, ఆర్థికంగా కూడా సౌకర్యవంతమైనదిగా ఉండటంతో అత్యధిక డిమాండ్ పొందింది. ముఖ్యంగా, సర్వీస్ నెట్‌వర్క్ అన్ని చోట్ల కలిగి ఉండటం, భరోసా కలిగించే బ్రాండ్ ఇమేజ్ వంటి అంశాలు దీనికి మార్కెట్లో మంచి ఆదరణ సంపాదించడానికి కీలక పాత్ర పోషించాయి. మారుతి సుజుకి ఎర్టిగా, భారతీయ కుటుంబాల ఆదరణ పొందిన 7-సీటర్ MPVగా తన స్థానాన్ని మరింత బలపర్చుకుంది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ కారుగా నిలిచింది. అంతేకాదు, మొత్తం కార్లలో అత్యధిక విక్రయాల జాబితాలో కూడా ఎర్టిగా మూడో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఎర్టిగా శక్తివంతమైన, పవర్‌ట్రెయిన్ వేరియంట్లతో వస్తుంది. ఇది సీఎన్జీతో మోడ్‌లో 87 bhp పవర్, 121.5 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ వేరియంట్‌లో 26.11 km/kg మైలేజీ ఇస్తుంది. దీంతో ఫ్యూయల్ ఖర్చు తగ్గించుకోవాలనుకునే వారికి బెస్ట్.
ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలదు, ఇది 103PS పవర్, 137Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్‌ను మాన్యువల్ గేర్‌బాక్స్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లోనూ పొందవచ్చు. పెట్రోల్ వేరియంట్ 20.51 kmpl వరకు మైలేజీని అందిస్తుందని ARAI అంచనా. ఈ అన్ని అంశాలతో పాటు, విశాలమైన ఇంటీరియర్, ఆకర్షణీయమైన మైలేజీ, విభిన్న పవర్‌ట్రెయిన్ కలిగిన ఎర్టిగా పెద్ద కుటుంబాలకు బాగా సరిపోద్ది.

మారుతీ సుజుకీ ఎర్టిగా ఒక ఫ్యామిలీ MPV. దీని ధరలు రూ.8.69 లక్షల నుంచి ప్రారంభమై, టాప్-ఎండ్ వేరియంట్ వరకు రూ.13.03 లక్షల వరకు చేరుకుంటాయి (ఎక్స్-షోరూమ్). ఇది వాహన పర్యవేక్షణ, టో-అవే అలర్ట్, జియో-ఫెన్సింగ్, ఓవర్-స్పీడ్ అలర్ట్, రిమోట్ ఫంక్షన్‌లు, భద్రత కోసం 360-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా వంటి పలు ఇతర ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








