ఈ కారణంగానే ఇండియాలో మారుతి ఈ-విటారా ఆలస్యం అవుతోంది! ఇది నిజంగా ఆశ్చర్యమే!
గుజరాత్‌లోని మారుతి సుజుకి ప్లాంట్‌లో ఆగస్ట్ 26న జరిగిన ఒక విశిష్టమైన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సాక్ష్యమయ్యారు. మారుతి సుజుకి తన తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్ కారు, ఈ-విటారాకు ఉత్పత్తి ప్రారంభం ఇచ్చింది. గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తున్న ఈ కారు పూర్తిగా భారతదేశంలో తయారవుతుండటం ప్రత్యేకత. అయితే, ఈ కారు మొదట మన దేశ రోడ్లపైకి రాకముందే ప్రపంచాన్ని చుట్టొస్తుంది. జపాన్‌తో పాటు యూరప్‌లోని యునైటెడ్ కింగ్‌డమ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్, హంగేరీ, ఇటలీ, స్వీడన్, ఆస్ట్రియా వంటి దాదాపు 100 దేశాలకు ఈ భారతీయ ఈవీ ఎగుమతవనుంది. పిపావావ్ పోర్టు నుంచి తొలి విడత ఎగుమతులు బయలుదేరి యూరప్ వీధుల్లో సుజుకి కొత్త యుగాన్ని ప్రారంభించనుంది.
అయితే, భారత్‌లో దీని విడుదలకు ఇంకా సమయం పట్టనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరగడం, ప్రస్తుత మార్కెటింగ్ వ్యూహాలు కారణాలుగా చెప్పబడుతున్నాయి. భారత్‌లో తయారైన కార్లకు ఇతర దేశాల ప్రజల నుంచి భారీ డిమాండ్ ఉండటం కారణంగా మొదటగా అక్కడ కార్లను అందించాలని మారుతి సుజుకి యాజమాన్యం నిర్ణయించింది. మేడ్ ఇన్ ఇండియాకు లభిస్తున్న ఆదరణకు నిదర్శనంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మన కార్లకు అక్కడ డిమాండ్ ఉండటం ఆశ్చర్యమే.

భారతదేశంలో తయారైన కార్లు మొదట ఇతర దేశాల్లోకి వెళ్లడం కొంత విచిత్రంగా అనిపించినా, ఇది గ్లోబల్ ఆటోమొబైల్ రంగంలో మన ఉత్పత్తి నాణ్యతకు గుర్తింపుగా చెప్పుకోవచ్చు. మన దేశం తయారు చేసిన ఈ-విటారా విదేశీ రోడ్లపై దూసుకెళ్లడం మనకు గర్వకారణమే అయినా, భారతీయ వినియోగదారులు తమ భూమిలో ఈ కారును చూసే రోజుకోసం మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక మారుతి ఇ విటారా విషయానికి వస్తే, eVitara అంతర్జాతీయ వేరియంట్లలో రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులోకి రానుంది. చిన్నది 49 kWh సామర్థ్యం కలిగిన యూనిట్. ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్ సెటప్‌తో వస్తూ, 142 bhp శక్తి, 193 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, WLTP సైకిల్ ప్రకారం సుమారు 344 కి.మీ వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగిఉంటుంది.

అదే సమయంలో, మరింత శక్తివంతమైన 61.1 kWh బ్యాటరీ ప్యాక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఫ్రంట్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ 171 bhp పవర్, 193 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, గరిష్టంగా 426 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. మరోవైపు, ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్ 181 bhp శక్తి, 307 Nm టార్క్‌ను సమకూర్చి, ఒకసారి ఛార్జ్‌తో 395 కి.మీ దూరం కవర్ చేస్తుంది.
అయితే, భారత మార్కెట్‌కు సంబంధించి అధికారిక రేంజ్ గణాంకాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. చార్జింగ్ విషయానికి వస్తే, ఉపయోగించే ఛార్జర్‌పై సమయం ఆధారపడి ఉంటుంది. 49 kWh బ్యాటరీని 7 kW AC ఛార్జర్‌తో పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 6.5 గంటలు పడితే, 11 kW ఛార్జర్‌తో ఈ సమయం సుమారు 4.5 గంటలకు తగ్గుతుంది.

పెద్ద 61.1 kWh ప్యాక్‌ను 7 kW ఛార్జర్‌పై పూర్తిచేయడానికి దాదాపు తొమ్మిది గంటలు, 11 kW ఛార్జర్‌పై సుమారు 5.5 గంటలు అవసరం అవుతుంది. అయితే, రెండు బ్యాటరీలు కూడా DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయి, దీని ద్వారా కేవలం 45 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








