మారుతి తొలి EV కారుకి భారత్ NCAPలో 5-స్టార్ రేటింగ్.. పెద్దలు, పిల్లల రక్షణలో తోపు మోడల్
మారుతి సుజుకి (Maruti Suzuki) చాలా ఆలస్యంగా ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది అనిపించినా... తొలి ప్రయత్నంతోనే ఆటో మార్కెట్ మొత్తాన్నే తన వైపు తిప్పుకునేలా చేసింది. ఎన్నో అంచనాలు, ఊహాగానాల నడుమ ఎంతోకాలం ఎదురుచూపులకు తెరదిస్తూ ఇ-విటారా (e-vitara)ను భారత మార్కెట్లోకి నిన్న అధికారికంగా విడుదల చేసింది. కానీ ఈ లాంచ్‌లో అసలు కథ ఏమిటంటే, కారు షోరూమ్‌కి చేరుకునేలోపే, భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఏకంగా 5-స్టార్ భద్రతా రేటింగ్ అందుకోవడం. ఇది మారుతి కోసం సాధారణ విషయం కాదు... భారత మార్కెట్‌లో చాలా సంవత్సరాలుగా మారుతి అంటే మైలేజ్, కానీ భద్రత అంత బాగుండదు అనే భావన ప్రజల్లో బలంగా ఉండేది. ఆ మాటకారులు కూడా ఇప్పుడు ఈ ఫలితాన్ని చూసి ఒక్కసారిగా ఆలోచించే పరిస్థితి వచ్చింది.
ఇటీవలి కాలంలో మారుతి తన కార్ల భద్రతా ప్రమాణాలను పూర్తిగా అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇదే ధోరణి ఇప్పుడు ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోకి కూడా వచ్చింది. కంపెనీ తొలి EV మోడల్ అయిన ఇ-విటారా, మార్కెట్లోకి వచ్చేముందే 5-స్టార్‌ను సాధించడం... ఇది మారుతి కొత్త దిశలో ఎంత బలమైన అడుగు వేసిందో చెప్పడానికి సరిపోయే ఉదాహరణ. ఎలక్ట్రిక్ మార్కెట్‌లో ప్రారంభ అడుగే ఇంత భారీ స్థాయి భద్రతా విజయాన్ని సాధించడం గొప్ప విశేషం.

భారత్ NCAP విడుదల చేసిన డేటాను పరిశీలిస్తే, అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో ఇ-విటారా మొత్తం 32 పాయింట్లలో 31.49 పాయింట్లు సాధించింది. అంటే వాహనం ముందుభాగం, పక్కదెబ్బలు, కేబిన్ స్ట్రక్చర్, ఎయిర్‌బ్యాగుల పనితీరు వంటి ప్రధాన భద్రత అంశాలలో దాదాపు పరిపూర్ణ రక్షణను చూపిందన్న మాట. అదేగాక చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో కూడా 49 పాయింట్లలో 43 పాయింట్లు నమోదు చేసింది.
దీనర్ధం ఏమిటంటే, పిల్లల కోసం ఇచ్చిన చైల్డ్ సీట్ యాంకరేజ్, ఐసోఫిక్స్ సపోర్ట్, క్రాష్ సమయంలో కిడ్స్‌కి కలిగే ఇంపాక్ట్‌ను తగ్గించే డిజైన్ అంశాలు అత్యుత్తమంగా పనిచేశాయి అని. డెల్టా, జీటా, ఆల్ఫా అన్ని వేరియంట్‌లకు వర్తిస్తుండటం విశేషం. సాధారణంగా కొన్ని కంపెనీలు హయ్యర్ వేరియంట్‌లకే పూర్తి భద్రతా ఫీచర్లు ఇస్తుంటే, ఇ-విటారాలో మాత్రం బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్ వరకు ఒకే రేంజ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఇచ్చారు.

ఇ-విటారా డైనమిక్ స్కోర్‌లో 24/24 సాధించడం అంటే, ఫ్రంట్ ఇంపాక్ట్, సైడ్ ఇంపాక్ట్, వాహనం స్థిరత్వం, కేబిన్ స్ట్రక్చర్ వంటి రియల్‌టైమ్ క్రాష్ పరిస్థితుల్లో ఈ వాహనం చూపిన పనితీరు దాదాపు ఎనలేని స్థాయిలో ఉందని అర్థం. దెబ్బ తగిలిన తర్వాత కేబిన్ ఆకారాన్ని కాపాడుకోవడం, ప్రయాణికులకు కలిగే ఇంపాక్ట్‌ను తగ్గించడం.. ఇవన్నీ గరిష్ట మార్కులు తెచ్చే రీతిలో పనిచేశాయి.
అదే విధంగా, చైల్డ్ సీట్ ఇన్‌స్టాలేషన్ స్కోర్ 12/12 రావడం చాలా కీలకం. ఎందుకంటే పిల్లల భద్రతలో చైల్డ్ సీట్ సరిగా అమరడం, ISOFIX పాయింట్ల నాణ్యత, క్రాష్ సమయంలో సీట్ స్థిరత్వం వంటి అంశాలు అత్యంత ముఖ్యమైనవి. ఇ-విటారా ఈ విభాగంలో పూర్తి మార్కులు తెచ్చుకోవడం, కుటుంబాలు ముఖ్యంగా చూసే సేఫ్టీ అంశంలో ఇది ముందంజలో నిలిచిందని స్పష్టం చేస్తున్నది.

ఇవి అన్నింటికి తోడు, ఇ-విటారాలో ప్రామాణికంగా అందించే సేఫ్టీ ఫీచర్లు నిజంగా గమనించాల్సిన అంశం, దీనిలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 7 ఎయిర్‌బ్యాగులు, పాదచారుల రక్షణ వ్యవస్థ, సీట్ బెల్ట్ రిమైండర్‌లు (SBR) వంటివి దీనిలో ఉన్నాయి. ఇవి బేస్ వేరియంట్ అయినా, మధ్య వేరియంట్ అయినా, టాప్ వేరియంట్ అయినా.. అన్నింటిలోనూ ఒకేలా లభించడం మారుతి తీసుకున్న కొత్త భద్రతా దృక్పథాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.


Click it and Unblock the Notifications








