బైక్ తరహా మైలేజ్ ఇచ్చే కారు.. 32 నెలల్లోనే 3 లక్షల అమ్మకాలు.. మారుతీ మ్యాజిక్ చేసింది
మారుతీ సుజుకీ (maruti suzuki) తాజాగా తన ప్రసిద్ద మెడల్ గ్రాండ్ విటారా (Grand vitara)కు సంబంధించి అమ్మకాల వివరాలను విడుదల చేసింది. భారత ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న మిడ్-సైజ్ SUV, లాంచ్ అయిన 32 నెలల్లోనే 3 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటి, ఒక అరుదైన విజయాన్ని నమోదు చేసింది. మారుతీ సుజుకీ ఈ గొప్ప విజయాన్ని ఎంతో గర్వంగా, హర్షంతో ప్రకటించింది. సెప్టెంబర్ 2022 చివరలో మార్కెట్‌లోకి వచ్చిన ఈ మోడల్, చాలా తక్కువ సమయంలోనే వినియోగదారుల మనసు దోచుకుంది. భారతSUV విభాగంలో తీవ్రమైన పోటీ ఉన్నా, గ్రాండ్ విటారా తన ప్రత్యేకతతో ముందంజలో నిలబడగలిగింది. గ్రాండ్ విటారా శక్తివంతమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, ప్రీమియం ఇంటీరియర్, మోడరన్ డిజైన్, మైలేజీలో మార్కెట్‌ను ప్రభావితం చేసిన అంశాలతో నిలిచింది.
తక్కువ కాలంలో భారీ అమ్మకాలు సాధించడమనేది ఈ కారుకు ఉన్న మార్కెట్ డిమాండ్, వినియోగదారుల ఆదరణను వెల్లడిస్తుంది. గ్రాండ్ విటారా భారత మార్కెట్లో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ కారు ప్రారంభ ధర రూ.11.42 లక్షలుగా ఉంది, ఇక టాప్ వేరియంట్ రూ.20.52 లక్షల వరకు ఉంటుంది(ఎక్స్-షోరూమ్ ధరలు). ఈ ధరల శ్రేణి, విస్తృత వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారుచేయబడింది.

ఫీచర్ల విషయానికి వస్తే, ఈ SUVలో 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణ. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటు స్మూత్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. కారులో ఉన్న ప్రీమియం ఇంటీరియర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 360 డిగ్రీల కెమెరా వంటి సదుపాయాలు దీన్ని ఈ సెగ్మెంట్‌లో ముందు వరుసలో నిలిపాయి.
ఇంకా, మైలేజ్‌కు పెద్ద పీట వేసే భారతీయ వినియోగదారుల కోసం, గ్రాండ్ విటారా హైబ్రిడ్ వేరియంట్లు మరింత ఆకర్షణగా మారాయి. ఈ అంశాలు కలిసివచ్చి, 32 నెలలకే 3 లక్షల యూనిట్లు అమ్ముడయ్యే స్థాయిలో గ్రాండ్ విటారాకు ఆదరణను తీసుకొచ్చాయి. గ్రాండ్ విటారా, తన శ్రేణిలో ఉన్న ఇతర SUVలతో పోలిస్తే, అనేక లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉన్న ఒక సమగ్ర కారు. వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా దీన్ని రూపొందించారు.

ముందువైపు వెంటిలేటెడ్ సీట్లు ఇవ్వడం, గాలి నాణ్యతను మెరుగుపరచే PM 2.5 డిస్ప్లేతో కూడిన ఆటో ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి సదుపాయాలు దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ SUVలో సుజుకి కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా లభిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు తమ మొబైల్ ద్వారా కారును మానిటర్ చేయడం, కొన్ని ఫీచర్లను రిమోట్‌గా నియంత్రించడం వంటి సౌకర్యాలు పొందగలుగుతారు.
అంతేకాక, డ్రైవింగ్ సమయంలో ఫోనును ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటే, ఇందులో వాడగలిగే వైర్‌లెస్ సెల్‌ఫోన్ ఛార్జర్ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది. భద్రత పరంగా కూడా గ్రాండ్ విటారా అత్యుత్తమ స్థాయిలో నిలుస్తుంది. అన్ని వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగులు ప్రామాణికంగా ఉండటం, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా వంటి అధునాతన భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉండటం దీనిని ఇంకా విశ్వసనీయంగా మారుస్తుంది.

అలాగే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సదుపాయాలు డ్రైవింగ్ అనుభూతిని మరింత సులభతరం చేస్తాయి. పనితీరు పరంగా చూస్తే, గ్రాండ్ విటారా రెండు ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. ఒకటి 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్, మరొకటి 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్. ఇందులో ముఖ్యంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ పెట్రోల్ కార్లలో లభించే అత్యధిక మైలేజీని అందిస్తుంది.
మారుతీ సుజుకీ తెలిపిన ప్రకారం, ఈ వేరియంట్ లీటరుకు 27.97 కి.మీ మైలేజీని ఇవ్వగలదు. దీని వలన ఇంధన ఖర్చులు పొదుపు కోసం చూస్తున్న వినియోగదారులకు ఇది అత్యంత సరైన ఎంపికగా మారుతుంది. ఈ విధంగా, స్టైల్, సౌకర్యం, భద్రత, మైలేజీ.. ప్రతి అంశంలోనూ మంచి సమతుల్యతను చూపిస్తూ మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.


Click it and Unblock the Notifications








