పేదవారు కొనేంత తక్కువ ధరకే కారు.. పైగా 34 కి.మీ మైలేజ్, 5 సీట్లు! కొత్త ధరలు ఇవే
మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) ఎప్పటినుంచో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే హ్యాచ్‌బ్యాక్‌గా గుర్తింపు పొందింది. తక్కువ ఖర్చుతో కారు కొనే అవకాశం ఇవ్వడంతో పాటు, మంచి మైలేజీ, సౌకర్యవంతమైన డిజైన్, సరళమైన నిర్వహణతో ఈ కారు పేద, మధ్య తరగతి కుటుంబాలకి నిజమైన తోడుగా నిలుస్తుంది. అందుకే కొత్తగా కారు కొనాలనుకునే వారిలో ఎక్కువ మంది సెలెరియో వైపు మొగ్గు చూపుతుంటారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వస్తు, సేవల పన్ను (GST) నిర్ణయం ఈ కారు ధరను మరింత ఆకర్షణీయంగా మార్చింది. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త GST రేట్ల ప్రకారం, కార్లపై పన్ను రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించబడింది.
ఈ మార్పు వల్ల తయారీదారులు తమ వాహనాల ధరలను తగ్గించగా, సెలెరియో ధరలోనూ గణనీయమైన తగ్గుదల చోటుచేసుకుంది. ముఖ్యంగా సెలెరియో ప్రతి వేరియంట్‌లోనూ ధర తగ్గడం వినియోగదారులకు పెద్ద లాభంగా మారింది. ఈ మార్పు కారణంగా కస్టమర్లు దాదాపు రూ.94,100 వరకు పొదుపు చేసుకునే అవకాశం పొందుతున్నారు. సాధారణంగా తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన కారు కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్తగా చెప్పుకోవచ్చు.

ఇలా చూస్తే, మారుతి సుజుకి సెలెరియో కారు ఎప్పుడూ అందుబాటులో ఉండే హ్యాచ్‌బ్యాక్‌గానే కాకుండా, ఇప్పుడు మరింత తక్కువ ధరతో అందుబాటులోకి రావడం వల్ల కొత్త కొనుగోలుదారులకు మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఈ తగ్గింపు ధరలతో భవిష్యత్తులో సెలెరియో అమ్మకాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ పండుగల టైంలో సేల్స్ పెరగడం ఖాయం. సెలెరియో కారుకు సంబంధించి వేరియంట్ల వారీగా కొత్త ధరలు ఈ కథణంలో చూద్దాం.
మారుతి సుజుకి సెలెరియో కొత్తగా మార్కెట్లో అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది. కస్టమర్ల అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని పలు ఆప్షన్లతో అందిస్తోంది. ప్రారంభ స్థాయి వేరియంట్ అయిన LXI మాన్యువల్ ట్రాన్స్మిషన్ (పెట్రోల్) ధర రూ.4,69,900గా నిర్ణయించబడింది. దీని తర్వాతి వేరియంట్ VXI మాన్యువల్ ట్రాన్స్మిషన్ (పెట్రోల్) ధర రూ.5,15,900గా ఉంది.

మాన్యువల్ డ్రైవింగ్ కంటే ఆటోమేటిక్‌ను ఇష్టపడే వారికి VXI ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (పెట్రోల్) వేరియంట్ రూ.5,60,900 ఎక్స్-షోరూమ్ ధరకు లభిస్తోంది. మధ్యస్థాయి వేరియంట్‌గా ZXI మాన్యువల్ ట్రాన్స్మిషన్ (పెట్రోల్)ను తీసుకోవచ్చు. దీని ధర రూ.5,70,900. ఫ్యూయల్ ఖర్చును తగ్గించుకోవాలని కోరుకునే వారికి VXI మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (CNG) ఒక మంచి ఆప్షన్‌గా ఉంది, దీని ధర రూ.5,97,900.
ఆటోమేటిక్ ఆప్షన్ కోసం వెతికే వారికి ZXI ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (పెట్రోల్) రూ.6,15,900కి అందుబాటులో ఉంది. అత్యుత్తమ ఫీచర్లను కోరుకునే వారికి ZXI ప్లస్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ రూ.6,27,900కి లభిస్తోంది. ఇదే సమయంలో, ఫుల్ ఆప్షన్‌తో వచ్చే ZXI ప్లస్ (పెట్రోల్) రూ.6,72,900 ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. ఇలా మారుతి కస్టమర్లు తమ బడ్జెట్‌కి, అవసరాలకు తగిన వేరియంట్‌ను ఎంచుకునే అవకాశాన్ని అందిస్తోంది.

కొత్త మారుతి సుజుకి సెలెరియో పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇది చిన్న కార్ల విభాగంలో శక్తివంతమైనది. ఈ కారులో 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు CNG ఆప్షన్ కూడా లభిస్తుంది. CNG వినియోగదారుల అవసరాలను కూడా ఇది సమర్థంగా తీర్చగలదు. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్(AMT) గేర్‌బాక్స్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు గేర్‌బాక్స్ ఎంపికలు డ్రైవింగ్‌ను సులభతరం చేస్తూ, వినియోగదారులకు సౌకర్యవంతమైన అనుభూతిని కలిగిస్తాయి.
ఫ్యూయల్ సామర్థ్యం విషయానికి వస్తే, సెలెరియో 24 kmpl నుండి గరిష్టంగా 34 kmpl వరకు మైలేజీ ఇవ్వగలదు. ఇది దాని విభాగంలో అత్యుత్తమ మైలేజీ కార్లలో ఒకటిగా నిలుస్తోంది. దీనికి తోడు, 32 లీటర్ల సామర్థ్యం కలిగిన భారీ ఇంధన ట్యాంక్ ఉండటం వల్ల, దూర ప్రయాణాల్లో తరచుగా పెట్రోల్ బంకును వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా సౌకర్యాన్ని అందిస్తుంది.


Click it and Unblock the Notifications








