మారుతికి షాక్.. స్వదేశీ మార్కెట్‌లో తగ్గిన అమ్మకాలు... కానీ ఆ ఒక్క విషయంలో సేఫ్!
భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి జూలై నెల అమ్మకాల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మారుతి కంపెనీకి ఈసారి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దేశీయ మార్కెట్‌లో అమ్మకాలు కాస్త తగ్గుముఖం పట్టగా, ఎగుమతులు ఊహించని స్థాయిలో పెరగడం సంస్థకు ఊరటనిచ్చింది. మొత్తం మీద, మారుతి సుజుకి జూలైలో అమ్మకాలను స్వల్పంగా పెంచుకుంది.
జూలై 2025లో మారుతి సుజుకి మొత్తం 1,80,526 వాహనాలను అమ్మింది. గత సంవత్సరం జూలై 2024తో పోలిస్తే (1,75,041 వాహనాలు), ఈసారి అమ్మకాలు పెరిగాయి. అలాగే, గత నెల జూన్ 2025 అమ్మకాలతో పోలిస్తే (1,37,776 వాహనాలు), జూలైలో అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అయితే, ఈ గణాంకాలను జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతాయి.

మారుతి సుజుకి జూలైలో దేశీయ మార్కెట్‌లో మొత్తం 1,48,781 వాహనాలను విక్రయించింది. ఇది గత సంవత్సరం జూలై 2024 అమ్మకాలతో (1,51,056 వాహనాలు) పోలిస్తే స్వల్ప తగ్గుదల. అంటే, దేశంలో మారుతి కార్లకు డిమాండ్ కొంచెం తగ్గిందని చెప్పవచ్చు.
అయితే, ఈ లోటును సంస్థ ఎగుమతుల ద్వారా భర్తీ చేసుకుంది. జూలై 2025లో మారుతి సుజుకి ఏకంగా 31,745 వాహనాలను ఎగుమతి చేసింది. ఇది గత సంవత్సరం జూలై 2024 ఎగుమతులతో (23,985 వాహనాలు) పోలిస్తే గణనీయమైన పెరుగుదల. దీనివల్లే, దేశీయంగా అమ్మకాలు తగ్గినా, మొత్తం అమ్మకాలు మాత్రం పెరిగాయి.

మినీ సెగ్మెంట్ విభాగంలో ఉండే ఆల్టో, ఎస్-ప్రెస్సో అమ్మకాలు తగ్గాయి. జూలై 2025లో 6,822 యూనిట్లు అమ్ముడవగా, గత ఏడాది ఇదే నెలలో 9,960 యూనిట్లు అమ్ముడయ్యాయి.
కాంపాక్ట్ సెగ్మెంట్ విభాగంలో బలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగన్ఆర్ వంటి మోడళ్లకు మంచి గిరాకీ ఉంది. జూలైలో ఈ సెగ్మెంట్‌లో 65,667 యూనిట్లు అమ్ముడయ్యాయి, గత ఏడాదితో పోలిస్తే ఇది మెరుగైన అమ్మకాలు.
మిడ్-సైజ్ సెగ్మెంట్ విభాగంలో ఉన్న సియాజ్ కారు అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. గత ఏడాది జూలైలో 603 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి కేవలం 173 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, ఎక్స్‌ఎల్6 వంటి పాపులర్ మోడళ్లు ఉన్న ఈ సెగ్మెంట్‌లో అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. ఈ జూలైలో 52,773 యూనిట్లు అమ్ముడవగా, గత ఏడాది ఇదే నెలలో 56,302 యూనిట్లు అమ్ముడయ్యాయి.
వ్యాన్ సెగ్మెంట్ విభాగంలో మారుతి అందిస్తున్న ఈకో వెహికల్ అమ్మకాలు పెరిగాయి. జూన్ 2025తో పోలిస్తే జూలై 2025లో ఈకో అమ్మకాలు పెరిగాయి. కమర్షియల్ వెహికల్స్ విభాగంలో సూపర్ క్యారీ వాహనం అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








